సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -336
సువర్ణ న్యాయము
*******
సువర్ణము అంటే బంగారము,ధనము, సుందరమైనది, పసిడి,కనకము,కాంచనము,హేమము, స్వర్ణము,ఒక పువ్వు,మంచి వర్ణము లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
 "సువర్ణ న్యాయము" అంటే బంగారము కరిగిన కొద్దీ అంటే అంటే పుటం పెట్టిన కొద్దీ వన్నె పెరుగుతుంది. శాస్త్రమును తరచి చూసిన కొద్దీ జ్ఞానము పెరుగుతుంది.అనే అర్థంతో ఈ న్యాయాన్ని చెప్పడమే కాకుండా ఒకే బంగారము అనేక రకాల ఆభరణాలుగా రూపం మార్చుకుని కనిపిస్తుంది అనే మరో అర్థంతోనూ ఈ "సువర్ణ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
 దీనిని భౌతిక వాదుల దృష్టితో  ఒక విధంగానూ, ఆధ్యాత్మిక దృష్టితో  మరొక విధంగానూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
 భౌతిక వాదుల దృష్టితో చూసినట్లయితే...
బంగారము ఒక విలువైన లోహము.ఈ విషయం మనందరికీ తెలిసిందే.స్వచ్ఛమైన బంగారం మృదువుగానూ, ఎంతో మెరుపును కలిగి ఉంటుంది. ఆభరణాల తయారీలో బంగారం గట్టిపడేందుకు రాగి, వెండి మొదలైన లోహాలను కలుపుతారు.ప్రకృతిలో విషపూరితం కానిది, మంచి ఉష్ణ వాహకం, అత్యంత సాగతీయ గల లోహమిదేనని చెబుతారు.
 అలాగే బంగారాన్ని ప్రసిద్ధ ప్రపంచ క్రీడలు, ఛాంపియన్ షిప్ లు మరియు అవార్డులు, పతకాలు అందించేటప్పుడు ఎంతో గౌరవంగా బంగారంతో తయారు చేసి ఇస్తుంటారు.
అంతే కాదు పెళ్ళిళ్ళు, పేరంటాలకు తాళిబొట్టుగా ఇతర నగలుగా అత్యంత వైభవానికి, ఐశ్వర్యానికి గుర్తుగా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు.ఆర్థికంగా పొదుపులో బంగారానికి ప్రత్యేక స్థానం వుంది. ఇది సంపదకు చిహ్నం.
ఇవే కాకుండా ఏరోస్పేస్ టెక్నాలజీలో  అతి ముఖ్యమైన అవసరమైన లోహంగా ఈ బంగారాన్ని ఉపయోగించడం విశేషం.
ఇలా సాంకేతిక,ఆహార, వైద్య,గాజు తయారీ లో, ఆటోమొబైల్ ,దంత పరిశ్రమలలో  కూడా బంగారాన్ని  ఉపయోగిస్తారు. ఈ విధంగా బంగారం యొక్క వినియోగం అత్యంత కీలకమైనదన్న మాట.ఈ విధంగా భౌతిక వాదుల దృష్టిలో బంగారము సంపన్నతకు ,పొదుపుకు  మూలాధారం. ఆపదలో కాపాడే వస్తు రూపమని చెబుతుంటారు.
 అందరికీ ఇష్టమైన, అత్యంత ఖరీదైన బంగారంపై ఎన్ని సామెతలు, పొడుపు కథలు పుట్టుకొచ్చాయో చూద్దాం.
ఓ మంచి మనిషి   గురించి చెప్పేటప్పుడు "ఆయన బంగారం లాంటి మనిషి" అంటారు.సున్నితమైన హృదయం గురించి చెప్పేటప్పుడు "బంగారమంటి మనసు" అని,ఇతరుల వల్ల మారిపోయిన వ్యక్తి గురించి  మాట్లాడేటప్పుడు"మన బంగారం మంచిదైతే కదా!" అని, మంచితనం దయాగుణం కలిగిన వారిని ఉద్దేశించి "బంగారానికి తావి అబ్బినట్లు" అని, కొందరి అతిశయాన్ని విసుక్కుంటూ"ఎంత గొప్ప రత్నమైనా బంగారంలో పొదిగితేనే రాణింపు" అని ఒకనాటి మంచిరోజులను తల్చుకుంటూ"బంగారం లెక్క బతికిన రోజులు" అని  కష్టాల్లో రాటుతేలి మంచి  స్థాయికి వచ్చిన వచ్చిన వ్యక్తిని గురించి ప్రస్తావిస్తూ"బంగారం కాలితేనే మెరుస్తుంది - మనిషి కష్టాల్ని అధిగమిస్తేనే బంగారంలా గుర్తింపబడతాడు" అని, మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేందుకు "బంగారానికి పుటం పెట్టినట్లు- మనసుకు కూడా అప్పుడప్పుడు పుటం పెట్టుకోవాలి" ‌అంటారు.ఇక  "సమయాన్ని , బంగారాన్ని పోలుస్తూ.. కదిలే ప్రతి క్షణానికి విలువ ఉన్నట్లే బంగారంలో ప్రతి చిన్న ముక్క కూడా విలువైనదే"అంటారు. ఇలా బంగారం మీద బంగారమంటి సామెతలు, పొడుపు కథలు  ఎన్నెన్నో వచ్చాయి.
ఇక ఆధ్యాత్మికంగా బంగారం గురించి ఏమనుకుంటున్నారో  చూద్దాం  మరి.
 ఆధ్యాత్మిక వాదుల దృష్టిలో పరమాత్మ ఒక్కడే కానీ అనేక రూపాలలో భాసిల్లుతూ  భక్తుల భక్తిని అందుకుంటూ వుంటాడని అంటుంటారు.
 దానికి సంబంధించిన ఉదాహరణ శ్లోకాన్ని చూద్దామా....
"మృత్పిండ మేకం బహుభాణ్డ రూపం/ సువర్ణ మేకం బహు భూషణాని/ గోక్షీర మేకం బహు ధేను జాత/ మేకః పరమాత్మా బహుదేహ వర్తీ " 
అంటే మట్టి ఒక్కటే దాని వస్తువుల రూపాలు ఎన్నో.బంగారం ఒక్కటే ఆభరణాల రూపాలు ఎన్నో. ఆవు పాలు ఒక్కటే వాటి జాతులు ఎన్నో... అలాగే  అనేక దేహ రూపాల్లో ఉన్నది పరమాత్మ ఒక్కడే  అని  ఆధ్యాత్మిక వాదులు అంటుంటారు.
 ఈ విధంగా బంగారం యొక్క  గొప్పతనం రెండు కోణాల్లో కనిపించడమే కాకుండా ఆర్థిక భద్రతకు తోడ్పాటుగా , అందమైన జీవితానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని మనకు ఈ "సువర్ణ న్యాయము" ద్వారా తెలిసింది.
 
మరి మనం కూడా బంగారం లెక్క బతుకుదాం.బంగారమంటి మనసుగల వారిగా సమాజంలో పేరు తెచ్చుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు