అపరచాణక్యుడు పీవీ నరసింహారావు;- ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్
 స్థిత ప్రజ్ఞుడు, సంస్కరణ శీలి, న్యాయ శాస్త్రజ్ఞుడు, బహు భాషా కోవిదుడు, సాహిత్య సుగంధాలను వెదజల్లిన వాడు, మన తెలంగాణ మహానీయుడైన పీవీ నరసింహారావు అపరచాణక్యుడిగా పేరుపొందారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినప్పుడు ప్రధాని పగ్గాలు చేపట్టి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ధీశాలి మన తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహ రావు.28 జూన్ 1921 నా సీతారామారావు రుక్మాబాయమ్మ పుణ్య దంపతులకు జన్మించాడు.1924లో బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసము చేసి ఉన్నత చదువులు చదివారు. క్రీడల్లో, లలిత సంగీతం, భజనలు శాస్త్రీయ సంగీతాల్లో కంచి పట్టు సాధించారు.1938లో నిజాం రాష్ట్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని, స్వరాష్ట్రంలో చదువుకు దూరమయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో బీఎస్సీ పూర్తిచేసి నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్ గా చేశారు.1948లో కాకతీయ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితగా ప్రసిద్ధికెక్కారు. జయ అనే పేరుతో అనేక రచనలు చేశారు సత్యనారాయణ రాసిన వేయి పడగలు నవలను హిందీలోకి సహస్రఫణ్ పేరుతో  అనువదించారు. ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. పీవీ నరసింహారావు ఇన్సైడర్ నవల విశేష ప్రాచుర్యం పొందింది.
పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమైంది.1952లో ఎన్నికల్లో ఓడిపోయారు.1957 నుండి 1972 వరకు నాలుగుసార్లు మంథని శాసనసభ నియోజకవర్గం  నుండి విజయకేతనం ఎగురవేశారు.1962లో రాష్ట్ర జైలు, ప్రజా సంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయా శాఖల్లో పలు సంస్కరణలు చేపట్టి అందరి మెప్పు పొందారు. మూడవసారి శాసనసభకు గెలిచినప్పుడు ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఈ సమయములోనే భూ సంస్కరణలు అమలుపరిచేందుకు చర్యలు చేపట్టారు.
1977లో కేంద్ర రాజకీయాలలో ప్రవేశించారు. హనుమకొండ నుండి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. శ్రీమతి ఇందిరా గాంధీకి అత్యంత విశ్వానీయుడిగా ఉంటూ హోం శాఖ, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.1984లో హనుమకొండ నుండి ఓటమిపాలైన, మహారాష్ట్రలోని రామ్ టెక్ నియోజకవర్గము నుండి విజయం సాధించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖ, హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1991లో జరిగిన  ఎన్నికల తరువాత దేశ రాజకీయాలలో ఒక అణిచ్చితి ఏర్పడినప్పుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాల మద్దతు కూడగట్టి ప్రధానమంత్రిగా మైనార్టీ ప్రభుత్వం సమర్థవంతంగా నడిపారు. ఈ విధంగా దేశ హితాన్ని కోరిన మహా మనిషి సంక్షోభ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఒడ్డుకు చేర్చిన అసామాన్యుడు. దేశ విదేశా నాయకులతో మెప్పు పొందిన పీవీ నరసింహారావు 23 డిసెంబర్ 2004న గుండె పోటుతో ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్లారు. పీవీ నరసింహారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సేవలు మనకు సదా స్మరణీయాలు.
,

కామెంట్‌లు