శాంతికపోతం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఖండిత అండంలా
బ్రహ్మాండమంతా
వెర్రితలలు వేసి వికృతీకరించబడుతున్న
కుహనాసంస్కృతి 
రావణాసురుడి శిరస్సుల్లా
ఉగ్రవాదం, కులవాదం, మతవాదం 
మానవ నైజాల్లోని ఇజాలు చిట్లిపోయి
నిశీధి నిశాచరి
నిశిత అగ్ని జిహ్వలు 
లయగా, కలయగా,
కసిగా, ఆక్టోపస్ లా కాటేస్తుంటే
మనిషి మరల మరల మరణిస్తుంటే
జీవితం అమీబాలా
తిరిగి తిరిగి జన్మిస్తుంది
మానవత్వం 
అంబరాన్ని చుంబించే ఏకైక విహంగం
బతుకు చితిలో
మెతుకులు వండుకుని
శాంతికపోతమై
వెన్నెల తీరాల్లో
మల్లెలు వెతుకుతుంది!!
*********************************

కామెంట్‌లు