సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -356
స్వభావ సిద్ధ న్యాయము
******
స్వభావము అంటే స్వధర్మము.సిద్ధ అంటే ఈడేరినది,గ్రహ యోగము,ఆయత్తమైనది,వండబడినది అనే అర్థాలు ఉన్నాయి.
సహజంగా వచ్చిన,స్వభావ సిద్ధంగా కలిగి వున్న గుణాలను వస్తువులు ఎప్పటికీ విడిపోవని అర్థము.
మరి వస్తువులు వీడవు కానీ వ్యక్తులు కలిగి వుంటారా?వీడుతారా? అసలు స్వభావం అంటే ఏమిటో తెలుసుకుందాం.
మనస్తత్వ శాస్త్రంలో స్వభావం అనేది జీవశాస్త్ర ఆధారితమైన ప్రవర్తనలోని స్థిరమైన వ్యక్తిగత వ్యత్యాసాలను సూచిస్తుంది.ఇది ఒక ప్రత్యేకమైన ప్రవర్తనా శైలి.సహజంగా కలిగి వుండే ఆలోచన, అనుభూతి మరియు పదుగురితో కలిసిమెలసి వుండే ప్రవర్తనే స్వభావమని చెప్పబడింది.అది వ్యక్తుల్లో స్వతఃసిద్ధంగా  వస్తుంది.
 ఉదాహరణకు గంధపు చెట్టు యొక్క చెక్క ఎంత అరగదీసినప్పటికీ అది తన సహజ గుణం మార్చుకోదు. సువాసనను ఇస్తూనే ఉంటుంది.అలాగే బంగారాన్ని ఎందులో కలిపినా, మూసలో పోసి కరిగించినా తన మెరిసే స్వభావాన్ని మార్చుకోదు.
అలాగే స్వభావ సిద్ధంగా మంచి గుణాలు కలిగిన వ్యక్తులు కూడా గంధపు చెట్టు,బంగారము లాంటి వారు. వారు తమకు కీడు చేసిన వారికి సైతం మేలే చేస్తారు.సహజ గుణం మార్చుకోరు.
అలాంటి వారిని ఉద్దేశించి భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా.
 "బంధుర సద్గుణాఢ్యు డొక పట్టున లంపటనొందియైన దు/స్సంధి దలంప డన్యులకు జాల హితంబొనరించుగాక శ్రీ/గంధపు జెక్క రాగిలుచు గాదె శరీరుల కుత్సువార్థమై/ గంధము లాత్మ బుట్ట దఱుగంబడియుండుట లెల్ల భాస్కరా"
అనగా  సజ్జనుడు మంచి గంధపు చెట్టు లాంటివాడు.తనకు కీడు చేసిననూ ఇతరులకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు.
అలాగే ఈ శతక కర్త మరో కోణంలో సజ్జనుడికి రూప లావణ్యాలతో పని లేదనీ,అతనిలోని మంచి గుణమే అందరిచే గౌరవింప బడుతుందని అంటారు.
 మరి ఆ పద్యాన్ని కూడా చూద్దామా...
"పూరిత సద్గుణంబుగల పుణ్యునకించుక రూప సంపదల్/దూరములైన వానియెడ దొడ్డగ జూతురు బుద్ధిమంతు లె/ట్లారయ గొగ్గులైన మఱియందుల మాధురి చూచి కాదె ఖ/ర్జూర ఫలంబ్రియము చొప్ఫడ లెకులు గొంట భాస్కరా."
అనగా ఖర్జూరము పైకి ముడతలతో వున్నా మంచి రుచిగా వుండటం వల్ల అందరూ కొనుక్కుని తింటారు.రూపం బాగా లేకపోయినా గుణవంతుడిని ప్రజలు ఖర్జూరమును ఆదరించినట్లే ఆదరిస్తారని అర్థము.
 ఇదే భావం స్పురించేలా రాసిన వేమన పద్యాన్ని కూడా చూద్దాం.
"మృగమదంబు చూడ మీద నల్లగనుండు/బరిఢవిల్లు దాని పరిమళంబు/గురువులైన వారి గుణము లీలాగురా/విశ్వదాభిరామ!వినురవేమ!"
అనగా కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ దాని సువాసన నాలుగు దిక్కులా వెదజల్లుతూ ఉంటుంది.అలాగే పెద్దలైన  వారు,మంచి వారు కూడా బయటికి ఆడంబరంగా కనపడరు‌. కానీ వారు కస్తూరి వంటి ఉన్నత గుణములు కలవారై ఉంటారు.
 ఇలా స్వభావ సిద్ధంగా మంచి గుణాలు కలిగిన వారు కొందరు వుంటారు. వారు ఎప్పటికీ మారరు.
ఇక పాము,తేలు వంటి గుణాలు కలిగిన చెడు స్వభావం కలిగిన వారు కొందరు వుంటారు.
 మరి అలాంటి  వారిలోనూ విజ్ఞత, వివేకం, విచక్షణ అనే లక్షణాలు లోలోపల వుంటాయి.కాబట్టి వాటి  ద్వారా మంచి ,చెడులను విచక్షణా జ్ఞానంతో చూస్తూ పూలదండలో దారం వలె మంచి స్వభావాన్ని అలవర్చుకోవాలి, మంచి వారిగా జీవనాన్ని కొనసాగిస్తూ  గంధం చెక్క వలె మంచి పేరు తెచ్చుకోవాలి.అప్పుడే మానవీయ విలువలు కలిగిన వారుగా పేరు పొందుతారు.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు