సుప్రభాత కవిత - బృంద
మర్రి విత్తనంలో మహావృక్షంలా
మనసులో కోరిక
నింగిని మెరిసే ఇంద్రధనస్సులో
రంగులన్నీ దోచేయాలని...

ఆకాశంలో చుక్కల్లా
అవనిపై  నవ్వులు చిందే
అందాల కుసుమబాలల్లా
అరవిరియగానే పరిమళించాలని..

పచ్చని చీర కట్టి
పువ్వులు తలలో తరిమి
పుడమి కన్యలా
ఆమనికై ఎదురుచూడాలని..

పెళ్ళి పందిట్లో  పట్టుపరికిణీలతో
పకపకలాడుతూ తిరిగే పసివారిలా
హరివిల్లు చుట్టూ అదేపనిగా
గిరికీలు తిరిగే మబ్బునైపోవాలనీ..

తొలికిరణం కనపడగానే మింట
సంతోషంగా  మెరిసే కంట
వేయిగా విరిసే ఇంద్రచాపమై
వర్ణాలు వేవేలు నింపుకోవాలనీ...

ఎదురుచూచు కనులకు
ఎదురై వచ్చు వెలుగు రథమెక్కి
కాంతిపుంజమల్లె లోకమంతా
శాంతి  పంచుతూ తిరగాలనీ

మనసులోని మర్మమెరిగి
ముచ్చటగ కోర్కె తీర్చ
మురిపముగా కదలివచ్చు
ముత్యమంటి వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు