సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -352
స్రోతో నిమ్న న్యాయము
*****
స్రోతః అనగా ప్రవాహము.నిమ్న అనగా లోతైనది,గంభీరమైనది, లోతు,పల్లము అనే అర్థాలు ఉన్నాయి.
స్రోతో నిమ్న అనగా నీరు పల్లమునకే పోవును.అనగా ప్రవాహము ఎప్పుడూ పల్లము వైపునకే వెళ్తుందని అర్థము.
 దీనినే తెలుగులో "నీరు పల్లమెఱుగు - నిజము దేవుడెఱుగు" అని అంటారు."
మరి ఆ సామెతకు ఈ "స్రోతో నిమ్న న్యాయానికి" గల అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం.
నీళ్ళు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తాయనేది జగమెరిగిన సత్యం. సైన్స్ జ్ఞానం తెలియకున్నా,శాస్త్రీయతపై అవగాహన లేకున్నా ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు.
 దీనిని ఇలా కాదని "నీరు పల్లానికి కాదు ఊర్థ్వానికి ప్రవహిస్తుందని" ఎవరైనా వాదించారంటే ఆ వ్యక్తి కావాలనే మోసపుచ్చుతున్నాడని అర్థం చేసుకోవచ్చు.
అలాంటి వారి దగ్గరకు వెళ్ళవద్దని చెప్పిన వేమన పద్యాన్ని చూద్దామా...
"దగ్గరకుము పాపదాంభికులము నీవు/మోస పుత్తురయ్య దోసమనక/ కౄర మృగము లట్టి వారురా నమ్మకు/ విశ్వదాభిరామ వినురవేమ"
అనగా తీయని మాటలు చెప్పే దాంభికులు మహా మోసగాళ్ళు.వారి దగ్గరకు పొరపాటున కూడా చేరకూడదు. కౄర జంతువుల లాంటి వారు.ఇతరులను మోసపుచ్చడం పాపమని అనుకోక తేలికగా మోసపుచ్చుతారు.
ఇదే విధంగా అడ్డంగా  వాదించే వ్యక్తి మూర్ఖుడైనా కావచ్చు. లేదా అతి తెలివి తేటలు చూపే అహంభావి, మోసకారీ  కావచ్చు. అందుకే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని "నిజం దేవుడెరుగు" వీళ్ళతో వాదించి లాభం లేదు. వృధా ప్రయాస  అనుకుంటూ వుంటారు.
ఈ విధంగా కళ్ళకు కనిపించే సత్యాన్నే  కాదని భ్రమలోకి తీసికెళ్ళే  వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  కొంత అనుమానం వచ్చి  అమాయకంగా "నిజం దేవుడెరుగు"  దేవుడే వాళ్ళకు తగిన శాస్తి చేస్తాడని అనుకుని జరిగిన అనర్థాన్ని భారంగా అనుభవించకుండా ముందే తగిన జాగ్రత్తతో ఉండటం ఎంతైనా అవసరం. అంతే కదండీ!.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు