తప్పులెంచు గుణం;- సి.హెచ్.ప్రతాప్
 తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగారు
విశ్వదాభి రామ వినురవేమ
అర్ధం:
వేమా! ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే గుణం వున్న ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చెయ్యటం మానవ సహజం.ఎందుకంటే అద్దం లో చూసునేవరకు మా ముఖాన్ని మేము చూసుకోలేము, అప్పటివరకు పక్క వారి ముఖలే కనిపిస్తాయి.
అలాగే ఎప్పుడు పక్కవారి తప్పులే కనిపిస్తాయి,
కాస్త మనసు తేలిక పడ్డాక ప్రశాంతం గా ఆలోచించినప్పుడు మన తప్పేంటో పక్క వారి తప్పేంటో తెలుస్తుంది…..
అందుకే అస్తమానం ఇతరులలో దోషాలు ఎంచే ప్రవర్తనను మార్చుకోవడం అత్యంత అత్యావశ్యకం.
చాణక్యుడి రాజనీతి శాస్త్రం ప్రకారం తీయగా మాట్లాడేవారు చాలా ప్రమాదకరం. ఒక వ్యక్తి తప్పులు ఎత్తి చూపేవారు, ఆ తప్పులను సరిదిద్దేవారు నిజమైన స్నేహితులు. చెడు స్నేహితులు ఎప్పుడూ మన మంచి కోరరు. మనం చేసేదే సరైనదని  అని చెబుతుంటారు. ఎందుకంటే.. వారు ఇతరుల మంచి కోరుకోరు. ఇక మంచి స్నేహితులను ఉప్పుతో పోల్చారు చాణక్యుడు. ఎందుకంటే.. స్వీట్లలో పురుగులు ఉంటాయి తప్ప ఉప్పులో పురుగులు ఉండవు. ఇలాగే మంచి స్నేహితులలో కూడా చెడు లక్షణాలు ఉండవని చెబుతున్నారు ఆచార్య. ఒక సామెత " మందిది మంగళవారం మనది సోమవారం" లోకంలో చాలా ప్రసిద్ధి పొందింది.
తప్పులెంచువారు తమ తప్పులెరుగరు అన్నట్లు  నేటి సమాజంలో తాము చేసే తప్పులను గమనించకుండా వాటిని సమర్ధించుకుంటూ, ఇతరుల తప్పులను మాత్రం ఎత్తి చూపేవారు చాలా వరకు కనిపిస్తు ఉంటారు. అలా వారి విషయాలు సమర్ధించుకుని ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

కామెంట్‌లు