ఈర్ల సమ్మయ్యకు 'స్ఫూర్తి శిఖరం' జాతీయ అవార్డు

 - విద్య, సాహిత్యం, సామాజిక రంగాల్లో కృషి.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు 'స్ఫూర్తి శిఖరం' జాతీయస్థాయి అవార్డు లభించింది.  విద్య, సామాజిక, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆర్యాని సకల కళావేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లోని ఫిలిం భవన్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆ సంస్థ  అధ్యక్షుడు దూడపాక శ్రీధర్ నిర్వహించారు. ఈర్ల సమ్మయ్య చాలాకాలంగా విద్య, సామాజిక, సాహిత్య సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన సేవా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు దూడపాక శ్రీధర్, ప్రముఖ కవి, విమర్శకుడు, సంపాదకుడు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, ఇతర ప్రముఖుల చేత ఈర్ల సమ్మయ్య 'జాతీయస్థాయి స్ఫూర్తి శిఖరం పురస్కారం' అందుకున్నారు. ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుంచి విద్యారంగంలో విశేష సేవలందిస్తున్నారు. 2003 లో మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీలోని నాయక్ పోడ్ కాలనీ పాఠశాలలో నియామకమైనప్పుడు చిన్న పూరి గుడిసెలో పాఠశాల నిర్వహించబడేది. అరకొర సౌకర్యాలకు స్పందించిన ఈర్ల సమ్మయ్య స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని అప్పటి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి స్కూల్ బిల్డింగ్ కోసం నిధులు మంజూరు చేయించారు. పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే వారి సౌకర్యార్థం పాఠశాల బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి చేయించారు. 2005 లో తాను విద్యనభ్యసించిన శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చి, అక్కడ వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ప్రజలు, పిల్లల తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచారు. మండల, జిల్లా స్థాయిలో వివిధ సబ్జెక్టుల్లో రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తూ పాఠశాలలను బలోపేతం చేశారు. పిల్లల తల్లిదండ్రులని మోటివేషన్ చేసి, పాఠశాలల్లో పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మధ్యలో బడి మానివేసిన పిల్లల్ని ప్రోత్సహించి వారు చదువు కొనసాగించేలా చేస్తున్నారు. ప్రస్తుతం తాను పని చేస్తున్న ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మూతపడే స్థితి నుంచి కార్పొరేట్ స్థాయి పాఠశాలగా మార్చివేశారు. లక్షలాది రూపాయలు తన సొంత డబ్బు ఖర్చు చేసి, పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేశారు. 21.5.2019 లో  'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను ప్రారంభించి వందలాది మంది తెలుగు కవుల చేత రచనలు చేయిస్తున్నారు. కవితలు రాయిస్తున్నారు. 'మధుర కవిభూషణ' వంటి పురస్కార పత్రాలను ఆన్లైన్లో అందిస్తూ కవులు, రచయితలను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల పిల్లలకు సొంత ఖర్చుతో విద్యాసామాగ్రి అందించడం, పిల్లల పుట్టినరోజు వేడుకలను పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వందలాది వివిధ రకాల పుస్తకాలను సేకరించి, పిల్లల పఠనా భివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు అందజేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం, పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్న వారికి పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలో పేద కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు, మాస్కులు అందించారు. పాఠశాల పిల్లలకు ఇంటి వద్దకు వెళ్లి బోధన చేశారు. వీరి  సేవలను గుర్తించిన పలు సంస్థలు ఇదివరకే అనేక అవార్డులతో సత్కరించాయి. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జిల్లా, మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, గురు బ్రహ్మ అవార్డు, జాతీయ సేవా రత్న అవార్డు, మన తెలుగు తేజం జాతీయ అవార్డు, కవి రత్న వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. స్ఫూర్తి శిఖరం అవార్డు పొందిన ఈర్ల సమ్మయ్యను ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పిల్లలు, యువతీ, యువకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువు, పలువురు అభినందించారు.

కామెంట్‌లు