సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -340
సూచీ పత్ర న్యాయము
*****
సూచీ అంటే సూది.శత అంటే వంద లేదా నూరు.పత్ర అంటే దళము లేదా ఆకు.
నూరు దళములు గల తామర పువ్వును ముద్దగా పట్టుకొని సూదితో గుచ్చితే  ఆ వంద పత్రములు లేదా రేకులకు రంధ్రాలు పడతాయి. వాటిని ఒక్కొక్కటిగా విప్పి చూస్తే అన్నీ ఒకేసారి చిల్లులు పడినట్లు అనిపిస్తాయి.కానీ ఒక పత్రము నుంచి మరొక పత్రానికి సూది దిగడానికి కొంత సమయం పడుతుంది. కానీ అది లిప్త పాటు లేదా కొన్ని లిప్తల పాటు సమయం కావడం వల్ల  ఆ సూక్ష్మ భేదాన్ని మనం గమనించలేం.అలా ఒకదాని నుండి రెండవ దానికినీ,రెండవ దాని నుండి మూడవ దానికి పోయేటప్పుడు సూది కొంత కాలాన్ని తీసుకుంటుంది.
ఈ క్రియ అతి సూక్ష్మమైన సమయంలో జరగడం వల్ల మనకు గుర్తించడం సాధ్యం కాదు. కాబట్టి అన్నీ ఒకేసారి చిల్లులు పడ్డట్టుగా భ్రమ పడుతూ వుంటాం. అలా పడే భ్రమను  వాస్తవంగా భావించడాన్ని "సూచీ శత పత్ర న్యాయము అంటారు.
ఇది ఒక రకంగా భ్రమ వాస్తవం మధ్య కనిపించని ఓ సన్నని రేఖ.అది సామాన్య దృష్టితో చూస్తే బోధపడదు.అనే అంతరార్థాన్ని ఈ  న్యాయము ద్వారా గ్రహించవచ్చు.
భ్రమ అనేది వాస్తవం కాని దానిని వాస్తవమైనదిగా నమ్మేలా చేస్తుంది.ఇక వాస్తవం అనేది పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ  ఒకేలా  వుంటుంది.అది గుర్తించాలంటే...ఏది భ్రమ? ఏది వాస్తవమైనది.. వాటి మధ్య తేడాను తెలుసుకోగలగాలి అంటే  అందుకు విమర్శనాత్మక ఆలోచన, తార్కిక దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడే భ్రమేదో, వాస్తవమేదో  తెలియడానికి అవకాశం ఉంటుంది.
ఓ ఉదాహరణ చూద్దాం.నీళ్ళతో నిండిన గాజు గ్లాసులో ఒక పొడవైన పెన్సిల్ ను వుంచి చూస్తే అది వంగినట్టుగా లేదా విరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ అది వాస్తవంగా విరగలేదు.అలా విరిగినట్టు కనిపించడ మనేది భ్రమ.
 ఇలా వాస్తవికత  గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు."ఎడతెగనిది,కొనసాగేది, మరియు శాశ్వతమైనదని వాస్తవం అంటారు .అంటే అది నిరూపించడానికి వీలుంటుందన్న మాట .
అలాంటి వాస్తవికమైన సూక్ష్మ దృష్టి కనుక లోపిస్తే  భ్రమలే వాస్తవాలుగా కనిపిస్తాయి .మనసులను తప్పుతోవ పట్టిస్తాయి.మనుషుల్ని కోతుల్లా మూర్ఖంగా ప్రవర్తించేలా చేస్తాయనేది ఈ "సూచీ శత పత్ర న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు