సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -362
హస్తి పద న్యాయము
   ******
హస్తి అనగా ఏనుగు. పదము అనగా పాదము, అడుగు,నాల్గవ భాగము అనే అర్థాలు ఉన్నాయి.
ఏనుగు ఆకారము పెద్దది.దాని పాదము కూడా పెద్దగానే వుంటుంది.అందువల్ల అది వేసే అడుగులో దాదాపుగా అన్ని జంతువుల అడుగులు యిమిడి పోతాయి.అనగా పెద్ద వృత్తంలో చిన్న వృత్తాలు ఇమిడి వున్నట్లన్న మాట.
"సర్వం పదం హస్తి పదే నిమగ్నమ్,"" హస్తి పదమున నడగవే యడుగులెల్ల", "జంతువుల పదములెల్ల దంతి పదంబులో నడగు క్రియ......" 
అనే ఈ శృతి వాక్యమును అనుసరించి ఏనుగు పాదము నందు అన్ని జంతువుల పాదాలు యిమిడి పోయినట్లు... అనగా ఏనుగు పాదమంటి పరమాత్మలో సర్వజీవ రాశి యిమిడి పోయిందనే అర్థంతో మన  భక్తులు, వేదాంతులు ఈ "హస్తిపద న్యాయము"తో పోల్చి చెప్పడం జరిగింది.
 ఆధ్యాత్మిక వాదుల దృష్టిలో సర్వం సకల చరాచర ప్రపంచం పరమాత్మలో యిమిడి వుందనీ,అందులోని జీవాత్మ జనన మరణ చక్రానికి లోబడి వుంటుందని చెబుతారు.ఏనుగు పాదం వంటి పరమాత్మ సార్వత్రికమైన భావనకు ఉదాహరణ యని,జీవాత్మ  అందులో ఓ భాగమని వీరు చెబుతుంటారు.
మరి పరమాత్మ ఎక్కడ వుంటాడు? అనే ప్రశ్నకు సమాధానం ఈ క్రింది విధంగా పోతన పద్యాన్ని ఉదాహరణగా చెప్పారు.
'ఇందుగలడందు లేడని/ సందేహము వలదు చక్రి సర్వోపగతుం/డెందెందు వెదికి జూచిన/ అందందే గలడు...."అని పరమాత్మ యొక్క ఉనికి గురించి  వివరించారు.
శబ్దము,స్పర్శ, రూపము,రసము, గంధము అను ఐదు విషయములు గలవు.వాటికి కేంద్రములైన ఆకాశము, గాలి,అగ్ని, నీరు,భూమి పరమాత్మ నుండి ప్రకటితమైనవి.అనగా  సృష్టి అనేది ఈ పంచభూతాల కలయిక. అయితే ఈ పంచభూతాల మూలకారణమైది ఏదో అదే పరమాత్మ అని చెప్పడం జరిగింది.
ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాపి అని,అతను విశ్వంలోని ప్రతి కణంలో ఉన్నాడని అంటారు.
ఓంకారమే పరబ్రహ్మ లేదా పరమాత్మ స్వరూపమనీ,ప్రణవం చేత చెప్పదగింది పరమాత్మ తత్త్వమని మాండూక్యోపనిషత్తు చెబుతోంది.ఇంకా ఈ ఉపనిషత్తు ఓంకార తత్త్వాన్ని వివరంగా తెలియజేసింది.వాక్కుకు అందనిది, అంతులేనిది, ఇంద్రియాలకు అతీతంగా సర్వ వ్యాప్తమై వెలుగుతున్నదే పరమాత్మ అని  వివరణ కూడా ఇవ్వడం జరిగింది.
ఇదంతా చదువుతున్నప్పుడు మనకు బోధపడేది ఒక్కటే.ఏనుగు పాదమనే పోలికతో సర్వాంతర్యామి అయిన పరమాత్మ గురించి చెప్పారనీ ,సృష్టి ,స్థితి, లయలకు మూలమై కనిపించనిది ఒకటి ఉందని అదే పరమాత్మ అని మనకు అర్థమవుతోంది.
జనన మరణ చక్రంలో జీవాత్మలుగా చలామణి అవుతున్న మనం  పంచభూతాలకు మూలమైన పరమాత్మలో లీనమయ్యే లోపు అనగా మరణించేలోగా అంతో ఇంతో మంచి పనులు చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు