అపాత్రదానం- సి.హెచ్.ప్రతాప్

 దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు. ఘోర పాపాలకు నిలయమైన ఈ కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి. చాలామంది మంచిని ఆశించి పాత్రత గురించి ఆలోచన చేయకుండా నాలుగు మంచి మాటలు చెప్పేవారికి లోబడిపోయి ఇష్టానుసారంగా దాన ధర్మాలు, సహాయం చేస్తుంటారు. అయితే అపాత్రులకు చేసే దానం ఫలించదని పైగా పాపం చుట్టుకుంటుందని మహాభారతంలో విదురుడు తన విదుర నీతిలో స్పష్తంగా చెప్పాడు. కొడుకైనా, కూతురైన మరే ఇతర రక్స్త సంబంధం అయినా అపాత్ర దానం చేస్తే ఫలితం రాకపోగా పాప సంచయం అంటుకుంటుంది. కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే ఆ దానాన్ని స్వీకరించే వారి పాత్రతను అంటే యోగ్యతను బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి.ఇతరులకు పెట్టనిదే మనకు పుట్టదని ఒక సామెత ప్రచారంలో ఉంది. మనకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలి. చేయమన్నారు కదా అని అపాత్రదానం చేయకూడదు. మనం సంపాదించిన దానిలో ఎనిమిద వ వంతు ఇతరులకు దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. కనుక వీలయినంతగా అవసరంలో ఉన్నవారికి దానం చేయవలసిందిగా శాస్త్రం స్పష్టంగా చెబుతొంది.   
కామెంట్‌లు