సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -345
స్తనంధయ న్యాయము
*****
స్తనంధయ అంటే పాలుతాగే పసిబిడ్డ,చంటి పాప పసివాడు,శిశువు అని అర్థము.
పాలు తాపి పడుకోబెట్టిన  శిశువు చక్కగా నిద్రపోతూ  నిద్రా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలా  జీవితాన్ని అనుభవించాలని కానీ అనుభవించకూడదని కానీ తెలియని జ్ఞాన శూన్యుడు ఆ శిశువు.అయిననూ మహానందాన్ని అనుభవించు వాని వలె నిర్విచారుడై నిద్రాసుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
అలా జ్ఞాని కూడా ఆనంద స్వరూపడైన పరబ్రహ్మ యందు మనసును లీనము చేసి కనులు మూసి బ్రహ్మానందం అనుభవిస్తాడు.పైకి  ఏమీ  ఎరుగని స్థాణువు వలె ఉన్నప్పటికీ లోలోన అఖండమైన బ్రహ్మానంద రసంలో తేలియాడుతూ వుంటాడు. ఏ ఇతర విచారములు లేక తదేక నిష్ఠతో అదే  ధ్యాసలో, ధ్యానంలో ఉంటాడు.
మరి  పసిబిడ్డలా మనకు అది సాధ్యమా? సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ గమ్యం ఎటో తెలియక తికకమక పడుతూ సాగే జీవితంలో  మహానందాన్ని అనుభవించడం కుదురుతుందా? మరి కుదరక పోతే మనిషి,మనసూ ప్రతిక్షణం అనిశ్ఛిత స్థితిలో ఉంటుంది కదా! మరేం చేయాలి? ఎలా ఆ ఆనందాన్ని వెతుక్కోవాలి?  దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి?ఎలా ఒడిసిపట్టుకోవాలి?  ఈ చింతన ప్రతి ఒక్కరికీ తరచుగా ఎదురవుతూనే వుంటుంది.
జ్ఞానులు, ఆధ్యాత్మిక వాదులు ఆనందం ఎక్కడో లేదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉంది. దానికి బయటి ప్రపంచంతో సంబంధం లేదు.అది అంతర్గతమైనది అంటారు. అంటే సుఖాలకు, దుఃఖాలకు, జయాపజయాలకు అతీతంగా వున్నట్లయితే ఆనందాన్ని అలవోకగా అనుభవించవచ్చు."అంటారు.
 ఇక భౌతిక వాదులు  "అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలోనూ, నచ్చిన పని చేయడంలోనూ, పరోపకారంలోనూ అంతులేని ఆనందం వుంటుంది." అంటారు.
 ఇలా ఎవరికి వారు ఆయా  రంగాలలో తమదైన గెలుపు ఓటములను అనుభవిఃచిన వారు ఆనందానికి ఇలా స్వయం నిర్వచనాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆ క్షణానికో లేదా కొన్ని గంటలు, రోజుల పాటే వుంటాయి.
ఇదే విధంగా తనను తాను తెలుసుకున్న వ్యక్తికి నిర్వికార,నిశ్చల స్థితి వస్తుంది. ఇలాంటి స్థిత ప్రజ్ఞత వలన అలవోకగా ఆత్మానందం, మహానందాన్ని పొందగలడు అనే అర్థంతో  వేమన గారు రాసిన పద్యాన్ని చూద్దామా...
"లోన జూచినతడు లోకంబు లెఱుగును/బయల జూచినతడు పరమ యోగి/తన్ను జూచినతడు తానౌను సర్వము/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఆత్మను చూచిన వాడు లోకంలో దేన్నైనా చూడగలడు.అలా బయట లోకం కూడా చూసిన వాడే పరమ యోగి కూడా అవుతాడు.కాని తనను తాను తెలుసుకున్న వాడు, సర్వమూ తెలుసుకున్నట్లు. 
ఇలా ప్రతి వ్యక్తి సాధన చేస్తే పసిబిడ్డ వలె నిద్రలో, మెలకువలో ఆనందాన్ని పొందుతాడని " స్తనంధయ న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
ఇదండీ! న్యాయములోని అంతరార్థము. మనమూ మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ, నచ్చిన, నలుగురు మెచ్చిన మంచి పనులు చేస్తూ అందులోనే మహానందాన్ని పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు