తల్లిదండ్రుల ప్రేమ- ఆర్పిత-ఏడవ తరగతిZPHS హవేలీ ఘనపూర్మెదక్ జిల్లా9494061649
  అనగనగా చింతపల్లి అనే గ్రామంలో ముత్యం, రజిని అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు వారి పేరు కిరణ్, అరుణ్. దంపతులిద్దరూ కొడుకులను అల్లారి ముద్దుగా పెంచసాగారు. తండ్రి ముత్యం దొరికిన కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని సాదసాగాడు. తల్లి రజిని కూడా కూలీ పనులు చేస్తూ ఉండేది. కిరణ్, అరుణ్ లను మాత్రం రోజు బడికి పంపిస్తూ, చక్కగా చదివించేవారు. దంపతులిద్దరూ ఎంత కష్టపడ్డా బిడ్డలకు మాత్రం లోటు లేకుండా చూడసాగారు. అప్పులు చేసి మరి బిడ్డలను పట్నంలో చదివించారు.
            కిరణ్, అరుణ్ లకు పట్నంలో పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. డబ్బులు బాగా సంపాదిస్తూ, పెద్దపెద్ద కంపెనీలు పెట్టుకొని, హైదరాబాదులోనే వివాహం చేసుకొని ఉండసాగారు. ఇద్దరు కూడా పుట్టిన ఊరికి రావడం మానేశారు. ఊర్లో ఉన్న ముత్యం, రజనీలకు అప్పుల భారం ఎక్కువై ఉన్న ఇంటిని అమ్మేసి అప్పులు కట్టేశారు. భార్యా పిల్లలతో ఉన్న తమ కొడుకుల చిరునామా తెలుసుకొని దంపతులు ఇద్దరు పట్నం వెళ్లారు. మాసిన బట్టలతో వచ్చిన తల్లిదండ్రులను చూసి కిరణ్, అరుణ్ లు కోప్పడ్డారు. ఇలా మాసిన బట్టలతో మీరు రావడమే కాకుండా రేపటి నుంచి మీరు ఇక్కడే ఉంటే మా పరువు ఏం కావాలి. మేం వ్యాపారాలు చేసుకోవద్దా! తిరిగి మీరు ఊరికి వెళ్లండని కొంత డబ్బులు ఇచ్చి పంపించారు.
       కానీ ముత్యం, రజనీలకు ఊరికి వెళ్లాలని అనిపించలేదు. పట్నంలోని బస్టాండ్ వద్దనే ఉన్నారు. బిడ్డలలో మార్పు వచ్చినందుకు దుఃఖించసాగారు. కిరణ్, అరుణ్ సాయంకాలం ఇంటికి వెళ్లగానే వారి బిడ్డలు మురికి బట్టలతో ఇల్లంతా తిరగసాగారు. మురికి బట్టలతో తిరుగుతున్న బిడ్డలపై కోపగించుకున్నారు. మాకు మురికి అంటేనే చాలా ఇష్టం అంటూ పిల్లలు గంతులు వేయసాగారు. కిరణ్, అరుణ్ లు తమ తప్పు తెలుసుకున్నారు. తమ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లి బస్టాండ్ లో ఉన్న వారిని గట్టిగా హత్తుకున్నారు. అయ్యో! బిడ్డలారా! మా మురికి మీ బట్టలకు అంటుతుంది అంటూ ముత్యం, రజిని లు అన్నారు. తమ తప్పుకు క్షమించమని కొడుకులిద్దరూ వాళ్ళ పాదాలపై పడి నమస్కరించి వారిని తమ ఇంటికి తీసుకెళ్లారు. తాత నానమ్మల వద్దకు పరిగెత్తి వెళ్లి మనుమలు మనుమరాలు హత్తుకోవడం చూసి కిరణ్ అరుణ్ లు సంతోషించారు.
నీతి: మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆదరించాలి. కానీ అవమానపరచకూడదు.

కామెంట్‌లు