నల్గొండలోని, రామగిరి రామాలయానికి ప్రసిద్ధి.ఈ రామాలయం ఒక్క నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతి గాంచినది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.రెండవ భద్రాద్రిగా పేరు పొందింది.రామగిరి సెంటర్ నుంచి ప్రసాద్ ఫోటో స్టూడియోకు వెళ్ళే దారిలో ఈ ఆలయం ఉంటుంది.
ఆలయం ముందు ఉండే స్థలంలో జిగ్ జాగ్ గా ఉండే ప్రహారీ గోడ.మద్యలో కళ్యాణ మంటపం.దాని వెనక భారీ
గా, ఆరు,ఏడు, అంగుళాల ఎత్తులో హనుమంతుడి విగ్రహం.గుడి వెనక భాగం ప్రముఖ న్యాయవాది ఆవంచ వేణుగోపాల్ రావు గారి ఇల్లు,ఆ ఇంటి పక్కనే గీతా విజ్ఞాన
మందిర్ స్కూలు.ప్రస్థుతం ఆ స్కూలును గవర్నమెంట్ లో
కలిపే ప్రయత్నం జరుగుతోంది.ఒక్కప్పుడు నల్గొండ టౌనులో సెంటాల్ఫన్సెస్,లిటిల్ ఫ్లవర్,బాప్టిస్ట్ అనే మూడు
ప్రైవేట్ మిషనరీ స్కూళ్లు మాత్రమే ఉండేవి.మనకు సంబంధించిన ప్రైవేట్ స్కూల్ ఒకటుండాలనే ఉద్దేశంతో అప్పట్లో ఎర్రమళ్ళరాజయ్య, శ్రీరామచంద్రమూర్తి, ఎల్.ఐ.సీ లక్ష్మణ రావు , దాసరి యాదగిరి రెడ్డి
తదితరులు సభ్యులు గా ఉండి గీతా విజ్ఞాన సమితిని ఏర్పాటు చేసారు.ఆ స్కూలు స్థలం దాసరి యాదగిరి రెడ్డి గారిది........ రామాలయాన్ని వెనుక భాగాన్ని ఆనుకొని ఉన్న నేను చదువుకున్న డీవిఎం స్కూలును కూడా మూసేసి, రామగిరి ప్రభుత్వ పాఠశాలలో కలిపేసారు.ఈ రెండు స్కూళ్ల గురించి మళ్ళీ సపరేట్ గా రాస్తాను,ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది....కట్ చేస్తే...
రామాలయం లోకి ప్రవేశ ద్వారం పాత రోజుల్లో రాజుల కాలంలో వాళ్ళ కోటలకు ఉండే ద్వారాన్ని
పోలి ఉంటుంది.చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజ స్థంభం.కృష్టుని భక్తుడు,అపర ధానశీలి అయిన ధ్వజుడుని పరీక్షించేందుకు స్వయంగా శ్రీ కృష్ణుడే మారువేషంలో వచ్చి నీ శరీరంలో సగభాగమీయమనీ,అదీ నీ కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క రావద్దని షరతు విధిస్తాడు.అన్న ప్రకారం ధ్వజుడు
తాను సగం శరీరాన్ని కోసి ఇస్తాడు.కానీ కంట్లో నుంచి కన్నీరు కారుతుంది.కన్నీరు కార్చావు, నాకు నీ శరీరం వద్దు అంటాడు, మారువేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు.
అప్పుడు ధ్వజుడు,నా శరీరంలో కేవలం సగ భాగమే కోరారు, మిగితా సగం పనికిరాదా అన్న బాధలో కన్నీరు
కార్చాను,అని చెప్పడంతో కృష్ణుడు సంతుష్టుడై వరం కోరుకోమని అడుగుతాడు,అప్పుడు ధ్వజుడు ఎప్పుడూ నేను మీ ముందే ఉండే వరమీయమని కోరుతాడు.
దానితో కృష్ణుడు అన్ని వైష్ణవ ఆలయాలలో గర్బ గుడి ముందు ఉండి,నీ దర్శనం తరువాతనే భక్తులు నన్ను
దర్శించుకుంటారని వరమిస్తాడు....ఇదీ ధ్వజస్తంభం కథ.
రామగిరి రామాలయంలో ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఎడమ వైపు నుంచి గర్బ గుడిలోకి వెళితే
సీతా,రామ,లక్ష్మణ,భరతల,రామానుజాచార్యులు,గోదాదేవి మందిరాలు వరుసగా ఉంటాయి.ఆ మందిరాల ద్వారాలు చాలా చిన్నవిగా అంటే నాలుగున్నర అంగుళాలు ఉంటాయి.అలా ఉండటానికి కూడా ఒక కారణం ఉంది,ఎంతటి వారైనా దేవుని సేవకులే అని,చెప్పేందుకే... అంతే కాకుండా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుండే ఆ మందిరాల లోపలికి వెళ్ళే పూజారులు, తమలోని అహంకారాన్ని,బయటే వదిలి తల దించుకుని వెళ్ళాలన్న పద్దతి.ఆలయంలోకి వచ్చే భక్తులు ఆ రాముడిని దర్శించుకునే సమయంలో ముఖద్వారం ముందు నిలబడకూడదు.ఎడమ,కుడి పక్కల నిలబడి నమస్కారం చేసుకోవాలన్నడం నియమం.రాగి గిన్నెలో తులసి ఆకులు వేసి ఇచ్చే తీర్థానికి కూడా ఒక విశిష్టత ఉంది.తులసి పవిత్రమైనది.అది ప్రాణవాయువుగా కూడా
ఉపయోగపడుతుంది.తీర్థం తీసుకొని బయటకు వచ్చాక
ధ్వజస్తంభం పక్కనే కొద్ది దూరంలో రామకోటి స్థూపం ఉంటుంది.శ్రీరామ అంటూ కోటి నామాలతో ఆ స్థూపం ఉంటుంది.అక్కడ ఉన్న ఒక గద్దెపై మనం శ్రీ రామ అని ఒకసారి రాసి,ఆ స్థూపం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే
రామకోటి రాసిన ఫలం కలుగుతుందనీ, నమ్మకం.అక్కడి
నుంచి కొద్ది దూరంలో రామాలయానికి ఉప ఆలయమైన
వెంకటేశ్వరుడి ఆలయం ఉంటుంది.సీతా సహిత,రామ,
లక్ష్మణ,భరత ఆలయం నాకు తెలిసి రాష్ట్రంలోనే మొదటిది అనుకుంటా.అంతేకాకుండా ఈ ఆలయం రెండవ భద్రాద్రి గా పేరుగాంచింది.ఆలయ ప్రాంగణం చుట్టూ చెట్లు,నేలపై పచ్చని గడ్డితో చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.లోపల ఒక కళ్యాణ మండపం,
అక్కడే గోదా కళ్యాణం జరుగుతుంది.ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండే రామాలయం భక్తులను ఉదయం సాయంత్రాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది.....కట్ చేస్తే.....
నల్గొండ టౌనులోనే ఎన్నో రామాలయాలు ఉన్నాయి అయినా ఈ రామాలయమే ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది,అంటే దానికి కారణం మద్ది విద్యాసాగర్ రెడ్డి,ఆయన ఆలయ చైర్మన్ గా భాద్యతలు
తీసుకున్న తర్వాత గుడిని చాలా అభివృద్ధి చేసారు.ప్రతి
సంవత్సరం శ్రీరామనవమి రోజున రామ కళ్యాణం, ప్రతి
మార్గశిర మాసంలో మార్గళి రోజుల్లో తిరుప్పావై పాశురాలు చదువుతూ,నెల పూర్తి అయ్యాక గోదా కళ్యాణం, లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.ఆ కార్యక్రమాలకు శ్రీమాన్ చిన్న జీయర్ స్వామి గారు వచ్చి
మార్గళి మాసం రోజులు రామాలయంలో విడిది చేసేవారు.చిన్న జీయర్ స్వామి గారు చాలా సంవత్సరాలు ఈ ప్రత్యేక సందర్భాల్లో రావడం మూలంగా
రామగిరి రామాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
రెండవ భద్రాద్రిగా పేరు గాంచింది.రామగిరి రామాలయం పేరు ఎక్కడ వినిపించినా అందుకు కారణం మద్ది విద్యాసాగర్ రెడ్డి గారే అని చెప్పక తప్పదు.ఆయన ఆలయాన్ని అంత చిత్త శుద్ధితో అభివృద్ధి చేసాడు కాబట్టే పట్టణ ప్రజల మన్ననలు పొందాడు,ఆ తరువాత రోజుల్లో మున్సిపల్ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యాడు.గుడిలో
జరిగే త్యాగరాయ ఉత్సవాల సందర్భంగా భూరుగుగడ్డకు
చెందిన ఏడుగురు బ్రదర్స్ నిర్వహించే సంగీత విభావరి అనేక మందిని ఆకర్షింపజేసేది.ఆ తరువాత రోజుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన పురుషోత్తమా చార్యులు, రామాలయంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు.నల్గొండకు చెందిన ఒక మహిళ ప్రతి సంవత్సరం మార్గళి మాసంలో రోజూ గుడి ప్రాంగణం అంతా ఊడ్చి శుభ్రం చేసి,ముగ్గులు వేస్తుండేది
నాకు ఇంకా జ్ఞాపకం ఉంది.ఆమె ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండేది.నేను పందొమ్మిది వందల తొంబై అయిదు సంవత్సరంలో నల్గొండలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే కాలంలో గుడికి వెళ్ళేవాడిని.
ఆ తర్వాత మళ్లీ పోలేదు....కట్ చేస్తే........
ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నరకు
రమణ నల్గొండ గ్రూపులో ఒక మెసేజ్ పెట్టాడు.ఎవరైనా
నల్గొండకు వెళుతున్నారా..అని, నాకెందుకో వెళ్ళాలని అనిపించింది వెంటనే ఫోన్ చేసి పోదాం రమణ నేను వస్తానని చెప్పాను.దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది, నేను గుడికి పోక. హైదరాబాద్
కి వలసపోయిన వాళ్ళు కాక,అక్కడే ఉండిపోయిన
బంధువులు, చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు,
ఇంకా ఎవరైనా కలుస్తారనే ఒకేఒక్క ఆశ నన్ను ఈ ప్రయాణానికి పురికొల్పింది.నేను,రమణ సరిగ్గా నాలుగు
గంటల నలభై నిమిషాలకు సాగర్ రింగ్ రోడ్డు నుంచి
నల్గొండకు ప్రయాణం అయ్యాం.చిట్యాల దాటిన తర్వాత
ఒక ఒరిస్సా డాబాలో టీకాతాత్పయ్యం( ఛాయ) సేవించి నల్గొండకు ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు చేరుకున్నాం.ఇంత తొందరగా వచ్చాం కదా ఇప్పుడిప్పుడే గుడిలో కార్యక్రమం మొదలవుతుంది, ఏడున్నర సమయంలో వెళ్ళాలని నిర్ణయించుకొని, ప్రముఖ కవి
వేణు సంకోజు గారి ఇంటికి వెళ్ళాం.అక్కడ ఒక అరగంట
సమయాన్ని గడిపి,ఆయన రాసిన పుస్తకాలు తీసుకుని
కొంత సాహిత్య చర్చ,పరిచయ కార్యక్రమాలు జరిపి, మళ్ళీ టీకాతాత్పయ్యాలు స్వీకరించి, ఏడున్నరకు రామాలయానికి చేరుకున్నాం.రామాలయం వెనుక రాఘవ రంగారావు గారి ఇంటికి కొంచెం వెనకాల కారు పార్క్ చేసి,పక్కనే నేను చదువుకున్న డీవిఎం స్కూలు బిల్డింగ్ ని ఒకసారి చూసేసరికి నా కళ్ళు ఆనందంతో మెరిసాయి.అక్కడి నుంచి మెల్లగా నడుస్తూ, రామాలయం వెనుక వైపున ఉన్న చిన్న సందులో నుంచి
గుడి ప్రధాన ద్వారం చేరాం.చెప్పులు బయట విడిచి, లోపలికి వెళ్ళగానే ఎదురుగా ధ్వజస్తంభం దానికి ప్రదిక్షణలు చేసి గర్బ గుడిలోకి వెళ్ళే ముందే రమణ టీటిసి కాలేజీ ఫ్రెండ్ కలిసాడు.ఆయనతో మాట్లాడాక,
శ్రీ రాముడి, గోదాదేవి దర్శనం చేసుకుని,పక్కనే ఉన్న
వేంకటేశ్వర స్వామి వారికి దర్శించుకొని, కళ్యాణం జరిగే
ప్రాంగణంలోకి అడుగు పెట్టాం.ఆలయ కమిటీ సభ్యుడు,
చిరకాల మిత్రుడు, జర్నలిస్టు, గుడిపాటి శ్రీనివాస్ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి కళ్యాణ్ మండపం పక్కన కూర్చోబెట్టాడు.అరగంట కూర్చున్నాం.చాలా మంది మిత్రులు, బంధువులు కలిసారు.చాలా సంతోషం
అయ్యింది.ఇరవైఎనమిది సంవత్సరాల తర్వాత చూస్తున్నందుకు గుడి చాలా కొత్తగా కనిపించింది.
స్థానిక శాసన సభ్యులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజకీయ నాయకులు, పాత్రికేయులు,స్థానిక పెద్దలు, టికెట్ కొని వచ్చిన దంపతులు,భక్తులతో కళ్యాణ మండప ప్రాంగణం అంతా శోభాయమానంగా ఉంది.
మామూలు జనం గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించేందుకు
గుడిలో ఎల్ఈడీ స్ర్కీన్ లను పెట్టారు.మొత్తంగా కవి రంగరాజు రవికుమార్ తన తేటగీతి పద్యంలో చెప్పినట్లు
తిరు నగరి రామగిరి తీర్చి దిద్దే!
గోదా రంగనాధ మనువు గొప్పగాను !
మాడ వీధులలో దిప్పి మాడ్యునకును!
మంగళారతి నిచ్చిరి మరులు కొల్ప!
రామగిరి పరిసర ప్రాంతమంతా ఒక పండుగ వాతావరణం
నెలకొంది.చాలా రోజుల తర్వాత గోదా కళ్యాణాన్ని తిలకించిన మంచి ఫీల్ తో గుడి బయటకు వచ్చాను.
గుడి బయట మిత్రుడు సురేష్ గుప్త పర్యావరణానికి సంబంధించిన ఒక స్టాల్ ని పెట్టాడు.అతని గురించి కూడా
రాయాల్సి ఉంది... రాస్తాను.చాలా రోజుల తర్వాత మా ఊరు మా గుడిని చూసిన ఆనందంలో,చిన్నప్పటి జ్ఞాపకాలు మస్తిష్కం పొరల్లో పరుగులు తీస్తుంటే స్నేహితులు, బంధువులు కలిసిన సంతోషాన్ని గుండె నిండా నింపుకొని తిరుగు ప్రయాణం అయ్యాను.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి