మాట తప్పితే కలుగును ముప్పు (అద్భుత నీతికథ)-డా.ఎం. హరి కిషన్- కర్నూల్- 9441032212

 ఒక వేటగాడు విల్లమ్ములు, వల భుజానికి తగిలించుకొని అడవిలో వేటకు బయలుదేరాడు. జంతువుల కోసం వెతుకుతా వుంటే ఒకచోట ఒక బంగారు రంగు మచ్చల జింక కనపడింది. అది ధగధగా మెరిసిపోతా వుంది. దాన్ని చూసి “అబ్బ... ఈరోజు పొద్దున్నే నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాను. ఎంత ముచ్చటగా వుందిది. వంద చందమామలు కూడా దీనికి సాటి రావు. ఈ జింకను తీసుకుపోయి సంతలో అమ్మకానికి పెడితే, జనాలు నాకు కావాలంటే నాకు కావాలని పోటీలు పడి కొనుక్కుంటారు. రోజూ వచ్చే దానికన్నా పదింతలు లాభం వస్తుంది. నెలరోజులు హాయిగా కాలుమీద కాలేసుకుని కడుపునిండా కమ్మగా తింటూ పడుకోవచ్చు. ఎలాగైనా సరే దీన్ని పట్టాలి. అదృష్టాన్ని కొట్టాలి" అనుకున్నాడు.
వెంటనే తన దగ్గరున్న వల తీసుకొని చప్పుడు చేయకుండా చెట్ల చాటున, పొదల మాటున దాక్కుంటా పాక్కుంటా ముందుకు పోయి ఆ జింక మీద గురి చూసి టక్కున వల విసిరాడు. ఆకులు తింటా వున్న జింక అది గమనించలేదు. అంతే... అది అందులో చిక్కుకు పోయింది. తప్పించుకోవడానికి పెనుగులాడుతున్న కొద్దీ వలలో మరింత ఇరుక్కుపోయింది. వేటగాడు వెంటనే వేగంగా ముందుకు దుంకి దాన్ని పట్టేసుకున్నాడు. అది భయంతో గజగజా వణికిపోతూ పెద్దగా అరవసాగింది.
అంతలో అటువైపు ఒక ముని వచ్చాడు. అతనికి ఎన్నో మహిమలు వున్నాయి. అవి మంచి పనులకే తప్ప చెడు పనులకు అస్సలు ఉపయోగించడు. అతను ఆ వేటగాన్ని చూసి “నాయనా... ఈ అడవిలో జంతువులు ఇప్పటికే చాలా తక్కువ అయిపోయాయి. నువ్విలా రోజుకు నాలుగైదు పట్టుకుంటా వుంటే కొద్ది రోజులకు ఒక్కటి కూడా మిగలదు. దానిని వదిలి వెయ్యి" అన్నాడు.
దానికా వేటగాడు "అయ్యా... నువ్వు చెప్పేది నిజమే. కానీ నాకు వేట తప్ప మరే పని చేతకాదు. ఈ వృత్తి మానేసి నేను నా పెళ్ళాం బిడ్డలు ఎలా బతకాలి. ఏం తినాలి”
అని అడిగాడు.
దానికాముని "నువ్వు చెప్పేది కూడా నిజమే. పొట్ట పోసుకోవడం కోసం చేసే పని ఏదీ తప్పు కాదు. నీ పొట్ట కొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. మా ఆశ్రమానికి ఒక ధనవంతుడు కానుకగా ఇచ్చిన మంచి పొలం ఇరవై ఎకరాలు మీ ఊరి దగ్గర వుంది. ఆది నీవు తీసుకొని ఇక ఈ అడవిలో అడుగు పెట్టకు" అన్నాడు. వేటగాడు ఆనందంతో సరేనంటూ ఒప్పుకున్నాడు.
అది బంగారంలాంటి పొలం. పక్కనే ఎప్పుడూ నీటితో కళకళలాడే చెరువు వుంది. ఏడాదికి మూడుసార్లు పండుతుంది. దాంతో ఏ పంట వేసినా విరగబడి కాస్తా మంచి లాభాలు రాసాగాయి. వచ్చిన డబ్బు ఏం చేయాలో తోచక ఇంద్ర భవనం లాంటి పెద్ద ఇల్లు కట్టాడు. డబ్బును అనేక మందికి వడ్డీలకు ఇచ్చాడు. వాటితో మరలా డబ్బులు రాసాగాయి. చూస్తుండగానే ఊరిలో పెద్ద ధనవంతుడు అయిపోయాడు. ఇంటి నిండా పనివాళ్ళు వచ్చారు. పెళ్ళాం బిడ్డలకు వంటిమీద మోయలేనన్ని బంగారు ఆభరణాలు వచ్చాయి. లెక్కపెట్టలేనన్ని డబ్బులు చేతికి అందాయి. ఊరికి పెద్దమనిషి అయిపోయాడు. అడుగు బయటికి పెడితే ఊరంతా వంగి వంగి నమస్కారాలు చేయడం మొదలు పెట్టింది. విందులు వినోదాలు పెరిగాయి. కాలు కింద పెట్టకుండా అన్ని సేవలు చేసే సేవకులు వచ్చారు.
అందరూ తనకు వంగి వంగి దండాలు పెడుతూ వుంటే నెమ్మదిగా తనంతవాడు లేడనే అహంకారం ఆ వేటగానికి పెరిగిపోయింది. కన్ను మిన్ను గానకుండా తయారయ్యాడు. ఒకరోజు వాళ్ళింటికి కొందరు స్నేహితులు వచ్చారు. "జింక మాంసం తినాలని వుంది. సరదాగా అడవిలో వేటకు పోదాం" అన్నారు. దానికి ఆ వేటగాడు సరేనంటూ వేటకు పోవడానికి ఏర్పాట్లు చేయమని సేవకులకు చెప్పాడు.
అతని పెళ్ళాం అది విని “మరచిపోయారా... అడవి వైపు కన్నెత్తి చూడనంటేనే కదా... ఆ ముని నీకు పొలం ఇచ్చింది. దాని వల్లనే కదా మనకి ఇంత సంపద పెరిగింది. మాట తప్పి అటువైపు పోవడం మంచిది కాదు" అనింది.
దానికి అతను కోపంగా “ఆ మునేమైనా వూరికే ఇచ్చాడా. చేతికి చిక్కిన ఆ బంగారు జింకను వదిలి వేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చాడు. అయినా అతను ఇచ్చింది ఎంత...
బోడి ఇరవై ఎకరాలు. ఇప్పుడున్నదంతా నేను కష్టపడి సంపాదించిందే కదా. నువ్వు ఇంకో మాట మాట్లాడితే ఇక్కడ కాకుండా నీ పుట్టింట్లో ఉంటావు చూడు" అంటూ కస్సుమన్నాడు. మొగుని మాటలకు ఎదురు చెప్పలేక ఆమె గమ్మున వుండిపోయింది.
తర్వాతరోజు స్నేహితులను, సేవకులను తీసుకొని అడవికి వేటకు వెళ్లాడు. జంతువులను దొరికిన వాటిని దొరికినట్టు పట్టి బంధించసాగాడు. అడవంతా అల్లకల్లోలం అయింది. అది తెలిసి ముని పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. “నాయనా... ఆ రోజు వేట మానేస్తానని మాట ఇచ్చావు. మరలా ఇలా చేయడం ధర్మం కాదు. దయచేసి పట్టుకున్న ఆ అమాయకమైన జంతువులను వదిలేసి వెళ్ళు" అన్నాడు. 
ఆ వేటగాడు అహంకారంతో కన్నూమిన్నూగానక “ఓ మునీ... అనవసరంగా గొడవ పెట్టుకోకుండా పక్కకు జరుగు. కావాలంటే నీ బోడి పొలం నువ్వే తీసుకో. అంతకు పదింతలు నా దగ్గర వుంది" అన్నాడు నడుము మీద చేయి పెట్టుకుని.
మునికి అతను మాట్లాడే పద్ధతి చూస్తేనే పరిస్థితి అర్థమయింది. చిరునవ్వు నవ్వి "అయితే వేట మాత్రం మానను అంటావు" అన్నాడు.
“చెప్పేది అర్థం కాలేదా... మరొక్కసారి చెప్పాల్నా" అన్నాడు వేటగాడు నిర్లక్ష్యంగా. “సరే... ఎవరి రాత ఎలా వుంటే అలా బ్రతుకుతారు. పందిని తెచ్చి పరిమళాలతో స్నానం చేయించినా బురద కనబడితే ఎగిరి దుంకుతుందే తప్ప ఆగదు కదా. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తి మీదికి ఎక్కి అహంకారంతో విర్రవీగుతున్నావు. నీకు దక్కాల్సినదే దక్కుతుంది" అంటూ వెళ్లిపోయాడు.
వేటగాడు ఎగతాళిగా నవ్వుకుంటూ తన అనుచరులతో వేట కొనసాగించాడు. అంతలో ఒక్కసారిగా ఒక పెద్ద ఏనుగుల గుంపు వాళ్లకు ఎదురొచ్చింది. వాళ్లు అదిరిపడి విల్లమ్ములు ఎక్కుపెట్టే లోపల అవి కనపడిన వాళ్లను కనపడినట్లు తొండంతో పట్టుకొని తలా ఒక దిక్కు విసిరి కొట్టాయి. ఒకనికి చేయిరిగితే ఇంకొకనికి కాలిరిగింది. ఒకనికి మూతి పచ్చడయితే మరొకనికి వీపు సాపయింది. దెబ్బకు అందరూ తలా ఒక దిక్కు బ్రతుకు జీవుడా అంటూ పారిపోయారు. కాలు విరిగిన వేటగాడు కుంటుకుంటూ అడవి దాటి ఊరిలోకి పోతావుంటే ఎదురుగా అతని పెళ్ళాం బిడ్డలు ఏడుస్తూ పరుగు పరుగున ఎదురొచ్చారు. వాళ్ళని చూసి కంగారుపడుతా "ఏమైంది... ఎందుకలా ఏడుస్తావున్నారు” అని అడిగాడు. దానికి వాళ్లు “ఇంట్లో దీపం పడి మన లంకంత ఇల్లు కాలిపోయింది. డబ్బు, నగలు, అప్పు పత్రాలు అన్నీ ఒక్కటి కూడా మిగలకుండా బూడిదైపోయాయి” అని చెప్పారు.
వేటగానికి నోట మాట రాలేదు. కాలూ చేయీ ఆడలేదు. అంతలో పొలంలో పనిచేసే గాసగాళ్లు వురుక్కుంటా వచ్చి "అయ్యా... చెరువుకు గండి పడి మీ పొలాలన్నీ మునిగిపోయి కోతకొచ్చిన పంటలన్నీ కొట్టుకుపోయాయి” అని చెప్పారు. ఒక్క రోజులో సమస్తం పోయి మరలా కట్టు బట్టలతో వీధిలో నిలబడ్డారు.
అంతవరకు అతని వెంట వచ్చిన వారు, పొగిడిన వారు, మెచ్చుకున్న వారు ఒక్కరు కూడా కనపడలేదు, ఓదార్చలేదు. జనాలు అతన్ని చూసి “నడిమంత్రపు సిరి కుక్కని సింహం చేస్తుంది. మూర్ఖున్ని రాజును చేస్తుంది. కానీ ఎంతయినా కుక్క కుక్కే... మూర్ఖుడు మూర్ఖుడే. ఎప్పటికీ పంది నంది కాలేదు కదా" అంటూ ఒకటే నవ్వసాగారు. వేటగాడు తాను చేసిన తప్పు అర్థమయి సిగ్గుతో ఆ ఊరిలో వుండలేక కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్ళిపోయాడు.
**********
డా.ఎం. హరి కిషన్- కర్నూల్- 9441032212
**********
కామెంట్‌లు