అనుభవమే అన్నీ నేర్పిస్తుంది - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకసారి ఇంద్రుడు భూలోకమెట్లా వుందో చూద్దామని ఆకాశంలో తిరుగుతా వున్నాడు. అట్లా తిరుగుతా వుంటే ఆయనకి ఒకచోట ఒక మేకలు కాసేటోడు కనబన్నాడు. వాడు కొండ మీద వెదురు బొంగులు, తడికెలతో ఒక గుడిసె వేసుకుంటా వున్నాడు. అది చూసి ఇంద్రుడు కిందికి దిగి వచ్చి "ఇదేందిరా.... ఈ కొండ మీద... ఎవరూ లేని చోట తడికెలతో గుడిసె వేస్తా వున్నావు. గాలీవానా వస్తే ఇదెక్కడ నిలబడతాది. కొట్టుకపోతాది గానీ” అన్నాడు.
దానికి ఆ పశువుల కాపరి నవ్వి "ఇంకెక్కడ వాన సామీ... మేఘాలన్నీ ఎప్పుడో కురిసి వెళ్ళిపోయినాయి. ఇంకో మూడు నెలల వరకు వాన కాదు గదా తుంపరలు గూడా రాలవు. అందుకే ఈ పాక వేసుకోని మేకలు మేపుకుంటా వున్నా" అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు వాని వంక చూసి “నీకెట్లా తెలుసు మూడు నెలల వరకూ వానలు రావని, మధ్యలో వస్తే ఏం చేస్తావు" అనడిగినాడు.
దానికా పశువుల కాపరి నవ్వి "సామీ... వానలు ఎప్పుడొస్తాయో... ఎప్పుడు పోతాయో... ఈ భూమ్మీద బతికే నాలాంటి మట్టి మనుషులకు తెలుస్తాది గానీ... చల్లగా  ఇంద్రలోకంలో కూచునే నీకెలా తెలుస్తాది" అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు “అరెరే... ఎంత పొగరు వీనికి. నన్నే అంత మాటంటాడా. ఉండు వీని పని చెప్తా" అనుకుంటా వానలు కురిపించే వరుణదేవుని దగ్గరికి పోయి “వానదేవా... అదిగో ఆ కొండల మీద ఒకడు పాక వేసుకోని వున్నాడు చూడు... అక్కడికి ఒక్కసారిగా మేఘాలన్నిటినీ పంపి... భూమీ ఆకాశం కలసిపోయేలా పెద్దవాన కురిపించు" అన్నాడు.
ఆ మాటలకు వానదేవుడు "అయ్యయ్యో... సామీ..... కోరక కోరక ఒక్క కోరిక కోరినావు. కానీ ఇప్పటికే చానా ఆలస్యమైపోయింది. మేఘాలన్నింటినీ పడమటి దేశాల వైపు పంపించేసినాను. ఇప్పటికే అవి చానా దూరం వెళ్ళిపోయినాయి. ఇప్పటికిప్పుడు పోయి వాటిని వెనక్కి పిలుచుకురావాలన్నా చానా రోజులు పడుతుంది. మూడు నెల్లు ఆగు సామీ... నీవు చెప్పిన చోటికి పంపిస్తా" అన్నాడు. ఇంద్రుడు ఏమీ చేయలేక మట్టసంగా దేవలోకానికి వెళ్ళిపోయినాడు.
నెమ్మదిగా మూడునెల్లు గడిచిపోయినాయి. ఇంద్రుడు మరలా ఒకసారి ఆకాశంలో అట్లాఇట్లా తిరుగుతా మళ్ళా అదే కొండ మీదకు వచ్చినాడు. చూస్తే ఇంకేముంది.... పశువుల కాపరి పాక విప్పుతా వున్నాడు. అది చూసి ఇంద్రుడు కిందికి దిగి వచ్చి “అదేమి అప్పుడే అట్లా విప్పుకోని పోతా వున్నావు” అనడిగినాడు.
దానికి వాడు నవ్వి “సామీ... తొందరలో వానలు పడబోతా వున్నాయి. అందుకే అవి రాకముందే ఇప్పుకోని పశువులను ఇంటికి తోలుకోని పోవాల" అన్నాడు.
“వానలు వస్తాయని నీకెట్లా తెలుసు" మళ్ళా అడిగినాడు శివుడు.
వాడు చిరునవ్వు నవ్వి “చూడు సామీ.... ఈ నేల మీద కష్టం చేసుకోని బతికేటోనికి తెలుస్తాది ఆకాశం గురించి భూమి గురించి. అంతేగానీ ఏ కష్టమూ లేని మీకేం తెలుస్తాది" అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు “వీనికి చానా పొగరున్నట్లుంది. చూస్తా... ఇక్కడ వానెట్లా కురుస్తాదో" అనుకుంటా రయ్యిమని వానలు కురిపించే వరుణదేవుని దగ్గరికి పోయి “వానదేవా... అదిగో ఆ కొండల మీద ఒకడు తడికెలతో చేసిన ఇంటిని విప్పుతా వున్నాడు చూడు... అక్కడ మాత్రం ఈసారి ఒక్క బొట్టు వాన గూడా కురిపియ్యొద్దు. సరేనా" అన్నాడు.
ఆ మాటలకు వానదేవుడు "అయ్యయ్యో.... అదేంది సామీ... అట్లా మాట మారుస్తా వున్నావు. అడగక అడగక అడిగినావు కదాని పడమటి దేశాల్లో వానలు కురిపించిన మేఘాలు తిరిగి వస్తానే ఇంతకు ముందు నీవు చెప్పిన కొండ దగ్గరికే పంపించేసినా. ఇప్పటికే అవి చానా దూరం వెళ్ళిపోయింటాయి. వాటిని ఆపడం ఇక నా చేతుల్లో లేదు" అన్నాడు.
ఆ మాటలకు ఇంద్రుడు నవ్వుకోని "ఆ మట్టిమనిషి చెప్పింది నిజమే... ఎప్పుడు వానొస్తుంది. ... ఎప్పుడు గాలొస్తుంది... ఎప్పుడు పంటొస్తుంది... ఎప్పుడు కరువొస్తుంది... ఇట్లాంటి విషయాలన్నీ ఆ పనులు చేసేటోళ్ళకు తెలిసినట్లు వూరికే చూసే మనలాంటోళ్ళకు తెలీవు గదా... ఏదైనా అనుభవమే అన్నీ నేర్పిస్తుంది" అనుకుంటా గమ్మున ఇంద్రలోకానికి వెళ్ళిపోయినాడు.
***********
కామెంట్‌లు