కొంగజపం(జాతీయం వెనుక కథ) -డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
   కొంగజపం అంటే అర్థం మనం చూస్తున్నది నిజం కాదు నటన అనీ. కొంతమంది ఎదుటి వారిని మోసం చేయడానికి మంచివాళ్ళుగా నటిస్తూ నోరు తెరిస్తే చాలు ధర్మసూత్రాలు వల్లిస్తూ వుంటారు. ఆ మాటలవలలో చిక్కుకొని చాలామంది మోసపోతూ వుంటారు. ఎదుటివాడు చేస్తున్నదంతా నటన. మేక తోలు కప్పుకున్న పులిలా వాని అసలు రూపం అది గాదు, వాడు పెద్ద మోసగాడు అని చెప్పడం కోసం ఈ కొంగజపం అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. ఇలాంటి కొంగ జపం చేసేవాళ్ళను మనం చాలామందిని అన్ని మతాలలో చూడవచ్చు. వాళ్ళు రకరకాల దీక్షలు తీసుకుంటూ వుంటారు. ఉదయాన్నే లేవడం, భగవంతున్ని ఆరాధించడం, కఠినమైన నియమాలు ఆచరించడం, నేలమీద పడుకోవడం, దానధర్మాలు చేయడం మృధువుగా మాట్లాడడం లాంటివి ఆ దీక్షా సమయంలో చేస్తుంటారు. ఆ సమయంలో వాళ్ళను చూస్తే మనకు భక్తి భావం, వారిపై గౌరవం, సద్భావం కలుగుతుంది. కానీ నూటికి తొంభై మంది ఆ ప్రవర్తన దీక్షలో వున్నంత వరకే. నిజానికి ఆ దీక్షలు ఎందుకంటే ఆ తరువాతకూడా అలాగే మంచిగా బతకుతూ చెడు అలవాట్లను వదిలేసి జీవన విధానాన్ని మార్చుకోవడం కోసం. 
ఒక్కసారిగా ఆ మార్పు రాదు కాబట్టి నెమ్మదిగా శరీరానికి, మనసుకు అలవాటు చేయడం కోసం దీక్షలు వచ్చాయి. కానీ దీక్ష చేసే జనాల్లో తొంభైశాతం మందివి కొంగజపాలే. ఎందుకంటే దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే మరలా వారు అంతకుముందు ఎలా జీవిస్తున్నారో అలాగే మారిపోతారు. అంటే ఆ దీక్ష ప్రభావం కొంచం గూడా వారిమీద ప్రసరించనట్లే. కాబట్టి మనం దీక్షా సమయంలో వారి ప్రవర్తన చూసి అదే నిజమని భ్రాంతి పడగూడదు. చాలా జాగ్రత్తగా వాళ్ళను గమనించి అంచనా వేసుకోవాలి అనే వుద్దేశ్యంతో కొంగజపం అనే జాతీయం వాడుకలోనికి వచ్చింది. ఈ జాతీయం వెనుక ఒక చిన్న కథ కూడా వుంది. అదేమంటే
ఒక చెట్టుమీద ఒక కొంగ వుండేది. అది చాలా ముసలిదయిపోయింది. చెరువులో చేపలు పట్టడం చాలా కష్టమయిపోయింది. ఎక్కువ దూరం ఎగరలేక పోతోంది. దాంతో బాగా ఆలోచించి అది ఒక ఉపాయం పన్నింది.
ఒక రోజు ఒక చెరువు వద్దకు చేరి, ఒడ్డుకు దగ్గరలో, నీటిలో నిలబడి ఒంటికాలిమీద జపం చేయసాగింది. కొంగను చూసి చేపలు భయపడ్డాయి. కానీ అది మౌనంగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో దేవున్ని ప్రార్థించడం చూశాయి. ఒక చేప ధైర్యం చేసి కొంచం దూరంలో నిలబడి "ఓ కొంగమామా... ఏం చేస్తున్నావు? ఎందుకలా ఒంటికాలిమీద నిలబడి వున్నావు" అనడిగింది. 
దానికా కొంగ "ఏమీ లేదు.. వయసుమీద పడింది. పెద్దవాన్ని అయ్యాను. ఇప్పటికే కడుపునింపుకోవడం కోసం ప్రతిరోజూ ఎన్నో చేపలను చంపి తింటూ ఎంతో పాపం మూటగట్టుకున్నాను. ఇక ఈ చివరి రోజులలో నన్నా మంచిగా బ్రతకాలి అనుకుంటున్నాను. అందుకే మాంసాహారం తినడం మానేసి ఆకులు, పళ్ళు తింటూ రోజూ ఇలా భగవంతుని గురించి తపస్సు చేసుకుంటున్నాను" అని చెప్పింది. చేపలు దాని మాటలు నిజమని నమ్మాయి. హాయిగా కొంగ అంటే ఏ మాత్రం భయం లేకుండా దగ్గరగా తిరగసాగాయి.
కొంగ ఎవరూ చూడకుండా తన దగ్గరకు వచ్చిన చేపలను మాత్రం గుటుక్కుమనిపిస్తూ పైకి మాత్రం దీక్ష చేస్తున్నట్లు నటిస్తూ కడుపునింపుకోసాగింది. కొద్ది కాలంలోనే చెరువులోని చేపలన్నీ ఖాళీ అయిపోయాయి. కొంగ మరొక చెరువును వెదుక్కుంటా వెళ్ళిపోయింది. ఈ కథలోంచే నీతి, నిజాయితీ లేకుండా చేసే కపట దీక్షలను ఉద్దేశించి కొంగజపం అనే జాతీయం వాడుకలోనికి వచ్చింది. కొంగజపం అంటే దొంగజపం అన్నమాట.
***********

కామెంట్‌లు