చెప్పిందొకటి చేసిందొకటి (ఒక అద్భుత జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   దేవుడు ఈ భూమి మీద అడవులను, సముద్రాలను, కొండలను, లోయలను, జంతువులను, పక్షులను, చేపలను... అట్లా ఒకొక్కదాన్నే పుట్టిస్తా... పుట్టిస్తా... ఆఖరికి మనుషులను తయారు చేసి... ఇంక తన పని అయిపోయింది గదా అనుకోని హాయిగా పండుకొన్నాడు.
పశువులు, పక్షులు రోజంతా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తినుకుంటా... స్నానంగూడా చేయకుండా... తిరుగుతా వుండేవి. వాటి కంటే ఆలోచించే తెలివి లేదు గాని మనుషులకు వుంది గదా... దాంతో వాళ్ళందరూ ఒకచోట చేరి "మనం ఎప్పుడు తినాల, ఎప్పుడు స్నానం చేయాల" అని తెగ ఆలోచించినారు. కొందరేమో పొద్దునా సాయంత్రం తిని మధ్యాన్నం స్నానం చేయాలని, మరికొందరేమో మూడు పూటలా తిని మూడు పూటలా స్నానం చేయాలనీ, కొందరేమో ఒక్కపూట మాత్రమే తింటూ ఒక్కపూటనే స్నానం చేయాలనీ, ఇంకొందరేమో జంతువుల్లా పక్షుల్లా ఎప్పుడు ఏది దొరికితే అది తినుకుంటా వారానికోసారి స్నానం చేస్తే చాలనీ... అట్లా తలొకమాట చెప్పసాగినారు. దాంతో ఎవరూ ఎటూ తేల్చుకోలేక మనల్ని పుట్టించిన ఆ దేవున్నే అడుగుదామని... అందరి కంటే సులభంగా ఛటుక్కున ప్రత్యక్షమయ్యే శివున్ని ప్రార్థించినారు. శివుడు ప్రత్యక్షమై వాళ్ళు చెప్పిందంతా విని “సరే! నేను ఈ రోజంతా బాగా ఆలోచించి రేపు నందితో చెప్పి పంపుతానులే" అన్నాడు.
శివుడు బాగా ఆలోచించి నందిని పిలిచినాడు. “మనుషులు మూడుపూటలా స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా కళకళలాడుతా వుంటారు. అట్లాగే ఒక్కపూట మాత్రమే తింటే కావలసినంత తిండి అన్ని కాలాల్లో దొరుకుతుంది కాబట్టి... నీవు పోయి మనుషులంతా ఇప్పటి నుండి మూడుపూటలా స్నానం చేసి, ఒక్కపూట మాత్రమే అన్నం తినాలని చెప్పు" అని పంపించినాడు.
నంది శివుని మాటలు ఎక్కడ మర్చిపోతానో ఏమో అని భయపడి "మూడు పూటల స్నానం, ఒక్కపూట అన్నం", "మూడు పూటల స్నానం, ఒక్కపూట అన్నం" అనుకుంటా బైలుదేరినాడు. అట్లా కైలాసం నుంచి భూమ్మీదకు దిగి మనుషులుండే చోటుకి పోతావుంటే దారి నడుమ ఒక పెద్ద నది అడ్డం వచ్చింది. దాంతో దాన్ని దాటడానికని వెనక్కి పోయి వురుక్కుంటా వచ్చి ఒక్క ఎగురు ఎగిరి అవతలికి దుంకినాడు. అట్లా దుంకడంలో అంతవరకూ తాను అనుకుంటున్న మాటలు మర్చిపోయి "మూడు పూటల అన్నం, ఒక్కపూట స్నానం".... "మూడు పూటల అన్నం, ఒక్కపూట స్నానం" అని తిరగమళ్ళ అనుకుంటా మనుషుల దగ్గరికి వచ్చినాడు. వాళ్ళందరినీ పిలిచి “శివుడు మీకు ఇప్పటి నుంచీ రోజూ మూడుపూటలా అన్నం తిని, ఒక్కపూట స్నానం చేయమని చెప్పినాడు" అన్నాడు. దాంతో
ఆరోజు నుంచీ వాళ్ళు మూడు పూటల అన్నం తింటా, ఒక్కపూట మాత్రమే స్నానం చేయసాగినారు.
అట్లా కొద్దిరోజులు అయిపోయేసరికి వాళ్ళకు తినడానికి తిండి దొరకడం కష్టమయిపోయింది. వాళ్ళకి సేద్యం తెలీకపోవడంతో కొత్తగా వంటలు
పండించలేకపోయినారు. దాంతో ఎక్కడెక్కడి
చెట్లకు కాసిన కాయలన్నీ వెదికి వెదికి తినసాగినారు. చివరికి అవి గూడా అయిపోయి ఏమీ దొరక్కపోవడంతో ఆకలికి అల్లాడిపోతా మరలా శివున్ని ప్రార్థించినారు. శివుడు ప్రత్యక్షమై "ఏమీ మళ్ళా పిలుస్తా వున్నారు. ఏమైంది" అనడిగినాడు. దానికి వాళ్ళు “ఏముంది సామీ! నీవు చెప్పినట్లే రోజుకి మూడుసార్లు తింటా, ఒక్కపూట స్నానం చేస్తా వున్నాము. కానీ ఇంత మందిమి మూడుపూటలా తినేసరికి ఎక్కడెక్కడి కాయలూ, కూరలూ అన్నీ కొద్దిరోజులకే ఒక్కటి కూడా మిగలకుండా అయిపోయినాయి. ఆకలితో కడుపు నకనకలాడి పోతా వుంది గానీ తినడానికి చిన్న గింజ గూడా దొరకడం లేదు. నీవు చెప్పినట్లు చేయడం వల్లనే గదా ఈ బాధంతా. అందుకే నిన్నే ఈ గండం గట్టెక్కించమని అడగడానికి పిలిచినాం" అన్నారు.
ఆ మాటలకు శివుడు ఆశ్చర్యపోయి "ఇదేంది... నేను చెప్పిందేంది, వీళ్ళు చేస్తున్నదేంది" అని నందిని పిలిచి “ఏమీ చెప్పినావు వీళ్ళకు” అని అడిగినాడు. దానికి నంది “ఏముంది సామీ... నీవు చెప్పినట్టే మూడుపూటలా తిని, ఒక్కపూట స్నానం చేయమని చెప్పినాను" అన్నాడు. దాంతో శివునికి చానా కోపం వచ్చింది.
“ఛ... ఛ... ఎంతపని చేసినావు. నేను చెప్పిందొకటి... నీవు చేసిందొకటి. చూడు. వాళ్ళు మూడు పూటలా తినేసరికి ఎక్కడా తినడానికి తిండి గూడా దొరకకుండా ఐపోయింది" అని బాగా తిట్టి “ఇంక ఇట్లా అయితే లాభం లేదు. వీళ్ళకు పంటలు పండించడం నేర్పించాల్సిందే" అనుకున్నాడు. దాంతో అందరినీ పిలిచి "చూడండి... ప్రకృతిలో సొంతంగా వాటంతటవే పండే పండ్లు, కాయగూరలు, ధాన్యాలతో మీ ఆకలి ఇంక తీరదు. మీరే సొంతంగా మీకు కావలసినవి పండించుకోవాల" అంటూ వారికి సేద్యం ఎట్లా చేయాల్నో, కావలసిన పంటలు ఎట్లా పండించాల్నో వివరంగా చెప్పినాడు. ఈ గొడవకంతా కారణమైన నందిని పిలిచి "మానవులకు ఇంత పెద్ద సమస్య రావడానికి కారణం నీవే గనుక... పో... పోయి.... వాళ్ళకు పంటలు పండించడానికి సాయపడుపో... ఇదే నీకు తగిన శిక్ష” అన్నాడు.
దాంతో అప్పటినుంచి నంది భూమి మీదకు ఎద్దు రూపంలో వచ్చి సేద్యం చేయడానికి సాయపడుతా మనుషుల ఆకలి తీర్చడానికి కష్టపడసాగింది.
***********
కామెంట్‌లు