మారిన దొంగ ;-డా.ఎం హరికిషన్-కర్నూల్-9441032212

 కందనవోలు నగరంలో ఒక పెద్ద గజదొంగ వున్నాడు. తరతరాల నుంచి వాళ్ళ వృత్తి దొంగతనాలే. వాళ్ళ వంశంలో ఇంతవరకూ ఒక్కరు గూడా పట్టుబడిందీ లేదు. కారాగారంలో అడుగుపెట్టిందీ లేదు. చుట్టుపక్కల వాళ్ళకు చిన్న అనుమానం కూడా రాకుండా అందరితో కలసిమెలసి వుంటూ తాము పెద్ద వ్యాపారస్తులమని చెబుతుండేవారు. అనేక రాజ్యాలు తిరుగుతూ అక్కడ తక్కువ ధరకు లభించేవి కొంటూ, వాటిని ఎక్కువ ధర వచ్చే మరొక రాజ్యంలో అమ్ముతూ వుంటామని చెప్పేవారు. వాళ్ళు వుండే రాజ్యంలో పొరపాటున గూడా ఎక్కడా చిన్న దొంగతనం గూడా చేసేవాళ్ళు కాదు. దాంతో ఎవరికీ ఎటువంటి అనుమానమూ వచ్చేది కాదు.
ఆ గజదొంగకు ఒక కొడుకు వున్నాడు. వాని పేరు బాలచంద్రుడు. బాలచంద్రునికి దొంగతనాలంటే అస్సలు ఇష్టం లేదు. నిజాయితీగా, కష్టపడి బ్రతకాలని కోరిక. కానీ చిన్నప్పటి నుంచీ తండ్రితో పాటే తిరుగుతూ, వృత్తిలోని మెలకువలన్నీ అణువణువూ అందిపుచ్చుకున్నాడు. తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో పాటే దొంగతనాల్లో పాల్గొనేవాడు. కానీ అనుకోకుండా అతని తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఇక దొంగతనాలు ఆపివేయాలని, తన పిల్లలు ఆ వృత్తిలోకి అడుగు పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ తాను నేర్చుకున్న మెలకువలు వ్యర్థం కాకుండా అవి మంచి పనుల కోసం మళ్ళించాలి అనుకొని ఆ ఊరి మహారాజును కలవడానికి వెళ్ళాడు.
మహారాజుకు జరిగిందంతా చెప్పి “రాజా... మేము దొంగలమయినా మాకొక న్యాయం వుంది. ఆశ్రయం ఇచ్చిన రాజ్యంలో ఎప్పుడూ ఎక్కడా దొంగతనానికి పాల్పడలేదు. పేదవాళ్ళ ఇళ్ళవైపు కన్నెత్తి చూడలేదు. ధనవంతులైనా నిజాయితీగా సంపాదించిన వారి ఇంటిలో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. నా వయసు పదేళ్ళున్నప్పటి నుంచే నేను ఈ రంగంలో అడుగుపెట్టాను. ఏ కారాగారాలు నన్ను బంధించలేవు. ఏ సంకెళ్ళూ నన్ను ఆపలేవు. ఎటువంటి తాళమైనా సరే చిటికెలో ఊడిపోవలసిందే. ఎటువంటి ఆభరణమైనా క్షణంలో మాయం కావలసిందే. ఉడుములా ఎంతటి నున్నని గోడనయినా అవలీలగా ఎక్కగలను. శత్రువుల పట్టు నుంచి కందెనలా జారిపోగలను. చచ్చినా నా నుంచి నిజాలను ఎవడూ బైట పెట్టించలేడు. ఎంతటి బాధనైనా భరించే శక్తి అలవడింది. నాకున్న శక్తిని గౌరవించి, నా సేవలను మీ రాజ్యం కోసం, ప్రజల కోసం ఉపయోగించుకోండి. తగిన వేతనమిచ్చి మీ కొలువులో నియమించుకోండి. నేను నాపిల్లలు నిజాయితీగా, గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వండి" అని వేడుకున్నాడు.
రాజుకు ఆ దొంగను ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. అంతలో పక్కనున్న మంత్రి, “మహారాజా... వీనికి ఉద్యోగం ఇవ్వడం... తెలిసి తెలిసీ దొంగ చేతికి తాళంచెవులు అప్పగించినట్లు అవుతుందేమో" అన్నాడు అనుమానంగా. మహారాజు కాసేపు ఆలోచించి "సరే... అన్ని అనుమానాలూ పక్కన పెట్టి నీకొక పని అప్పజెబుతా. అది గనుక నువ్వు విజయవంతంగా పూర్తి చేయగలిగితే నిన్ను కొలువులో చేర్చుకుంటాను" అన్నాడు.
“చెప్పండి మహారాజా... మీరు ఎంత కష్టమైన పని చెప్పినా దానిని విజయవంతంగా నెరవేర్చుకొని వస్తాను. నా శక్తి సామర్థ్యాలను నిరూపించుకొంటాను" అన్నాడు.
అప్పుడు మహారాజు “రెండు రోజుల కిందట మన గూఢచారి ఒకరు పొరుగు రాజ్యమైన అవంతీపురం సైనికులకి పట్టుబడ్డాడు. కానీ వాళ్ళకు అతను మన గూఢచారని తెలీదు. ఎవరో పెద్ద గజదొంగ అనుకుంటూ వున్నారు. విషయం వాళ్ళకి తెలిసిపోయేలోపల ఎలాగైనా సరే ఆ గూఢచారిని మూడోకంటికి తెలియకుండా విడిపించుకొని రావాలి. నీకు సాధ్యమవుతుందా” అని అడిగాడు. అలా అడుగుతుంటే మహారాజు మాటలు తడబడుతున్నాయి.
ఆ దొంగ మహారాజు వంక సూటిగా చూస్తూ "మహారాజా... యువరాజును క్షేమంగా విడిపించుకొని వచ్చే బాధ్యత నాది” అన్నాడు.
ఆ మాటలకు మహారాజు అదిరిపడ్డాడు. “యువరాజా... ఆ రహస్యం నీకెలా తెలుసు” అన్నాడు ఆశ్చర్యంగా.
“మహారాజా... విషయం వివరిస్తున్నప్పుడు మీ ముఖంలో చాలా ఆందోళన, మాటల్లో తడబాటు కనబడింది. ఎప్పుడూ అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా వుండే మీరు పెరిగిన గడ్డంతో, నిద్రపోని ఎర్రని కళ్ళతో, విచారంగా వున్నారు. మనకు చాలా దగ్గరి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మన మొహం అలా మారిపోతుంది. ఆ గూఢచారిని విడిపించుకొని రమ్మని మీ పక్కనుండే మంత్రి నన్ను ఆదేశించవచ్చు. కానీ స్వయంగా మీరే అడగడంలోనే అతను మీకెంత ముఖ్యమో అర్థమవుతుంది. అంతేగాక వారం రోజులుగా యువరాజు రాజ్యంలో కనబడడం లేదు. ఇవన్నీ ఒకదానికొకటి కలిపి చూస్తే పట్టుబడిన గూఢచారి యువరాజే అని అర్థమవుతూ వుంది" అని చెప్పాడు.
ఆ మాటలతో మహారాజుకు ఆ దొంగ తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. "జాగ్రత్త...
అవంతీపురం మనకన్నా పెద్ద రాజ్యం. వాళ్ళతో పెట్టుకుంటే మన రాజ్యం సర్వనాశనం అవుతుంది. అందుకే వినయంగా నడుచుకుంటున్నాం. కానీ ఎప్పటికయినా సరే ఆ రాజ్యాన్ని జయించాలి. అనేది నా కోరిక. అందుకే యువరాజు అవంతీపురం రహస్యాలు, ఆయువుపట్లు తెలుసుకోవడానికి రహస్యంగా అక్కడికి వెళ్ళి దురదృష్టవశాత్తూ పట్టుబడ్డాడు. వాళ్ళని ఎదిరించి యుద్ధం చేసి నా కొడుకుని విడిపించుకోలేను. అట్లాగే నా కొడుకు గూఢచారిగా వాళ్ళ రాజ్యంలోకి వచ్చాడని వాళ్ళకి తెలిసినా... ఆ రాజు కోపంతో మన మీద యుద్ధం ప్రకటిస్తాడు. అందుకే ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మనోవేదనతో వున్నాను” అని చెప్పాడు.
గజదొంగ చిరునవ్వుతో "మహారాజా... నాకో నాలుగు రోజులు సమయం ఇవ్వండి. అలాగే నేను ఏది చెబితే అది ఎదురు ప్రశ్నించకుండా నా ఆజ్ఞను పాటించే ఇరవైమంది మెరికల్లాంటి సైనికులను నాతో పంపండి. ముక్కుకి తెలియకుండా ముక్కెర కొట్టేసినట్లు, యువరాజుకు చిన్న ఆపద కూడా కలగకుండా మీ వద్దకు తీసుకువస్తాను" అని అన్నాడు.
మహారాజు అలాగేనంటూ అంగీకారం తెలిపాడు.
*******
ఆ గజదొంగ తరువాత రోజు ఉదయానికంతా మహారాజు ఇచ్చిన ఇరవై మంది సైనికులతో, యాత్రికుల మాదిరి మారువేషం వేసుకొని అవంతీపురంలో ఒక సత్రానికి చేరుకున్నాడు.
"మీరు నగరమంతా తిరుగుతూ వీధులన్నీ చక్కగా గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నానికంతా తిరిగి సత్రం వద్దకు చేరుకోండి" అని అందరినీ పంపించి తాను యువరాజును బంధించి వున్న కారాగారం వద్దకు చేరుకున్నాడు.
కారాగారం చుట్టూ లోపల ఏమీ కనబడకుండా ఎత్తయిన గోడలున్నాయి. లోపలికి పోవడానికి ఒకటే ద్వారం వుంది. అక్కడ ఇద్దరు సైనికులు ఆయుధాలతో కాపలాగా వున్నారు. ముందు ఒక చిన్నగదిలో సైనికాధికారి కాపలాగా వున్నాడు. అతని అనుమతి లేకుండా లోపలికి ఎవరూ పోలేరు.
ఆ దొంగ చుట్టూ చూశాడు. కారాగారం ఎదురుగా ఒక చిన్న ఫలహారశాల కనబడింది. అక్కడికి పోయి ఉగ్గానీ బజ్జీ తింటూ వానితో మాట కలిపాడు. “ఇదేందన్నా... ఈ కారాగారం ఇంత చిన్నగా వుంది. కాపలాగూడా ఇద్దరే వున్నారు. దొంగలు చాలా సులభంగా తప్పించుకోవచ్చు గదా” అన్నాడు నవ్వుతా.
“అదేమీ కనబడినంత సులభం కాదులే... బైట ఇద్దరు మాత్రమే కనబడతా వున్నా లోపల ఉదయం పది మంది, రాత్రి పది మంది వంతుల వారీగా కాపలా వుంటారు. రాత్రి కాపలా వున్నవాళ్ళు రేపు ఉదయం ఎనిమిదికి బైటకొచ్చి, మరలా రాత్రి ఎనిమిదికి తిరిగి వస్తారు. నిజానికి ఇక్కడ దొంగలు ఎక్కువ మంది వుండరు. కేవలం ముగ్గురో నలుగురో అంతే. కొత్తగా పట్టుకొచ్చిన వాళ్ళని ఇక్కడ వుంచుతారు. ప్రతి ఆదివారం విచారణ జరుగుతుంది. శిక్ష పడిన వాళ్ళని పెద్ద కారాగారానికి మారుస్తారు. మిగిలిన వాళ్ళని వదిలి వేస్తారు. అందుకే కొంచం తక్కువ కాపలా” అని చెప్పాడు.
ఆదివారం అంటే ఎల్లుండే. అంతలోపు యువరాజును ఇక్కడినుంచి తప్పించకపోతే తరువాత మరింత కష్టమయిపోతుంది. కారాగారం చుట్టుపక్కల జాగ్రత్తగా గమనిస్తూ సత్రానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి మిగతా సైనికులు కూడా వచ్చి సిద్ధంగా వున్నారు.
“ఈ రోజు మీరంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం నుంచీ మన పని మొదలవుతుంది" అంటూ ఉదయం ఏమి చెయ్యాలో వివరించి చెప్పాడు. అందరూ “సరే” అన్నారు.
తరువాత రోజు ఉదయం ఏడుకంతా అందరూ విడివిడిగా కారాగారం వద్దకు చేరుకున్నారు. బైటనుంచి సైనికులు ఒకొక్కరే వచ్చి సైనికాధికారిని కలిసి లోపలికి వెళుతూ వున్నారు. వారు లోపలికి పోయిన కాసేపటికి లోపలినుండి సైనికులు పదిమంది బైటకు వచ్చారు. రాత్రంతా కాపలా కాసి అలసిపోయిన వాళ్ళు నిద్రమబ్బుతో తలొక వైపు ఇంటిదారి పట్టారు. గజదొంగ సైగ చేశాడు. వెంటనే ఒక్కొక్క సైనికున్ని ఇద్దరు రహస్యంగా దూరం నుంచి అనుసరించసాగారు. వాళ్ళ ఇళ్ళు ఎక్కడ వుంది, ఆ చుట్టుపక్కల ఎవరెవరు వున్నారు, ఇంట్లో ఎంతమంది వున్నారు... ఇలాంటి విషయాలన్నీ గమనించి సత్రానికి తిరిగి వచ్చారు.
“చూడండి... మీరు అనుసరించిన వాళ్ళలో ఎవరి కుటుంబం చిన్నదో, ఎవరి వీధుల్లో జనసంచారం తక్కువగా వుందో, ఎవరి ఇళ్ళు విడివిడిగా ఇతరుల ఇళ్ళకు దూరంగా వున్నాయో, ఎవరు శారీరకంగా బలహీనంగా వున్నారో చెప్పండి. అలాంటి ఇళ్ళ మీదకు దాడి చేసి సైనికులను బంధించడం సులభం" అన్నాడు. అందరూ తాము చూసిన వివరాలన్నీ వివరంగా చెప్పారు. ఆఖరికి అందులో రెండు ఇళ్ళను ఎన్నిక చేశారు. అనుచరులలో పదిమందిని ఎన్నిక చేసి, వారిని రెండు గుంపులుగా విడగొట్టాడు.
మీరు ఐదుగురు చొప్పున వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళండి. ఎవరూ చూడకుండా మెరుపువేగంతో ఇంటిలోకి దూరండి. సైనికులు నిద్రమబ్బులో వుంటారు కాబట్టి చురుగ్గా వుండరు. ఇంట్లో వున్న వాళ్ళకు ఎటువంటి హాని చేయకుండా అందరినీ బంధించండి. తలుపులు మూసేసి బైట తాళం వేయండి. మీలో ఒకరు సైనికుని దుస్తులు ధరించి ఎనిమిదికంతా కారాగారం వద్దకు చేరుకోండి. ఇంకొకరు ముందు జాగ్రత్తగా అతన్ని అనుసరించండి. దారిలో మన మిత్రుడు మిమ్మల్ని కలిసి లోపల ఏం చేయాలో చెబుతాడు. వాళ్ళని విజయవంతంగా బంధించగానే ఒకరు వచ్చి మాకు తెలియజేయండి. ఇదంతా సాయంత్రంలోగా పూర్తి కావాలి” అన్నాడు. వాళ్ళు అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
“మనం ఎంత చేసినా బైట వుండే ఆ సైనికాధికారి మన వాళ్ళను గుర్తు పట్టేస్తాడు గదా. కాబట్టి వాన్ని గూడా బంధించి, మనవాన్ని అక్కడ కూర్చోబెడదామా" అన్నాడు ఒక అనుచరుడు. 
"అలా చేయడం సులభమే. కానీ బైటకు వచ్చే సైనికులు సైనికాధికారి మారిపోయిన విషయం గుర్తు పడతారు గదా. అది ఇంకా ప్రమాదం. కాబట్టి అక్కడ ఆ సైనికాధికారే వుండాలి. మనవాళ్ళు లోపలికి పోవాలి" అన్నాడు చిరునవ్వుతో గజదొంగ.
"కట్టె విరగకూడదు. పాము చావగూడదు అంటే ఎలా" అన్నారు వాళ్ళు. గజదొంగ చిరునవ్వు నవ్వి, “ఆ సైనికాధికారి రోజూ సాయంత్రం బైట వున్న ఫలహారశాల నుంచి తినడానికి ఏదయినా తెప్పించుకొని, వేడిపాలు తాగుతూ వుంటాడు. ఆ ఫలహారాల అంగడి వద్ద అస్సలు రద్దీ వుండదు. పది నిమిషాలకు ఒకరో ఇద్దరో వస్తుంటారు. పని తక్కువ కాబట్టి పనివాళ్ళు ఎవరూ వుండరు. అంతా యజమానే చూసుకుంటాడు. కాబట్టి మన పని చాలా సులభం” అంటూ ఇద్దరిని పిలిచి వాళ్ళకు ఏమి చేయాలో చెప్పాడు. వాళ్ళు చిరునవ్వుతో అలాగేనంటూ బైలుదేరారు.
మిగిలిన వాళ్ళతో "మీలో సగం మంది ఆయుధాలు ధరించి కారాగారం చుట్టూ రకరకాల ప్రదేశాల్లో రహస్యంగా దాక్కోండి. మనం లోపల పని ముగించి బైటకు రాగానే ఇక్కడి నుంచి మెరుపు వేగంతో వెళ్ళిపోవడానికి మంచి మేలుజాతి గుర్రాలను సిద్ధం చేసి వుండండి. అంతా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సంతోషమే. అలా కాకుండా ఊహించని ఆపద ఏదయినా ఎదురయితే నేను గట్టిగా మూడుసార్లు ఈల వేస్తాను. ఆ సంకేతం వినగానే ఒక్కసారిగా దాడి చెయ్యండి. నాతోబాటు ఒక్కరు వుండండి. ఇక ఈ సత్రం ఖాళీ చేస్తున్నాం. అందరికీ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో గుర్తుంది గదా" అన్నాడు. అందరూ అలాగేనంటూ తలలూపారు. తలా ఒక దిక్కుకు విడిపోయారు.
సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. సైనికులను కుటుంబంతో సహా ఒక గదిలో బంధించి వారి వేషాల్లో ఇద్దరు కారాగారం వైపు బైలుదేరారు. దారిలో వారికి లోపలికి వెళ్ళి ఏం చేయాలో వివరంగా చెప్పి చెరీ ఒక బరువైన సంచీని ఇంకొకరు అందించారు. అప్పటికే కారాగారం ముందున్న ఫలహారశాలకి చేరుకున్న గజదొంగ దాని యజమానిని బంధించి సైనికాధికారి తాగే పాలలో బేదులు పెట్టే మందు కలిపి అందించాడు. అది తాగిన కాసేపటికే వాని కడుపులో ఉరుములు మెరుపులు మెదలయ్యాయి. పది నిమిషాలకొకసారి చెంబు పట్టుకొని ఉరకడం మొదలుపెట్టాడు.
సమయం ఎనిమిదవుతా వుంది. సైనికులు ఒకొక్కరే వచ్చి సంతకాలు చేసి పోతా వున్నారు. సైనికాధికారికి ఒళ్ళంతా నీరసంగా వుంది. కడుపంతా అల్లకల్లోలంగా వుంది. వచ్చీపోయేవాళ్ళని గమనించే స్థితిలో లేడు. కళ్ళు బైర్లు కమ్ముతా వున్నాయి. మాటిమాటికీ వెనక్కి పరుగెడుతూ వున్నాడు. అలా వెళ్ళిన సమయంలో ఆ ఇద్దరు అనుచరులు అక్కడకు చేరుకొని పుస్తకంలో సంతకం పెట్టి కారాగారంలోకి అడుగుపెట్టారు.
లోపలున్న వాళ్ళు వీళ్ళ కొత్త మొహాలు గమనించి “ఎవరు మీరు. ఇంతకు ముందు ఎక్కడా చూడలేదే" అని ప్రశ్నించారు.
వాళ్ళు నవ్వుతూ "మేము ఈ రోజే పనిలో చేరాము. సైనికాధికారిదీ మాదీ ఒకే ఊరు. కష్టాల్లో వున్నాము కనికరించమని కాళ్ళు పట్టుకుంటే ఈ ఉద్యోగం ఇచ్చాడు" అంటూ అక్కడున్న వాళ్ళకు, బైట కాపలాగా వున్న ఇద్దరికీ తమతో బాటు తెచ్చిన లడ్లు, జిలేబీలు ఇచ్చారు. సైనికులు వాళ్ళకు శుభాకాంక్షలు చెబుతూ వాటిని సంబరంగా తిన్నారు. అంతే... అరగంటకంతా ఎక్కడి వాళ్ళక్కడ మత్తెక్కి మబ్బుగా పడిపోయారు. మరుక్షణమే వాళ్ళు యువరాజు బంధింపబడి వున్న గదికి వెళ్ళి తాళం తీసి జరిగిందంతా చెప్పారు. యువరాజు కూడా సైనికుని మాదిరి బట్టలు వేసుకుని వాళ్ళను అనుసరించాడు.
బైట వున్న సైనికాధికారి చెంబు పట్టుకొని పోయి తిరిగి వచ్చే లోపల ముగ్గురూ బైటకొచ్చి ఫలహారశాల వద్ద వున్న గజదొంగను కలిశారు. మరుక్షణమే వాళ్ళు సిద్ధంగా వున్న
గుర్రాలపై తమ రాజ్యానికి బైలుదేరి తరువాత రోజుకంతా కందనవోలు మహారాజును కలిశారు. 
మహారాజు జరిగిందంతా తెలుసుకొని “శభాష్... వీరుడా ఇచ్చిన మాట ప్రకారం యువరాజు ఒంటి మీద చిన్న గీత గూడా పడకుండా అప్పజెప్పావు. నీలాంటివాడు మన గూఢచార దళంలో వుంటే ఎంతో మేలు. నీకు సరియైన పదవి గూడా అదే" అంటూ ఆ గజదొంగను మెచ్చుకొని గుఢచారదళం నాయకునిగా నియమించడమే గాక, పదివేల బంగారు వరహాలు కానుకగా అందించాడు.
*********
కామెంట్‌లు