బంగారు పక్షి (అద్భుతమైన జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక రైతుంటాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. వాళ్ళందరికీ పెళ్ళి వయసొచ్చింది. దాంతో ఆ రైతు సంబంధాల కోసం వెదకసాగినాడు. ఒకసారి ఆ ముగ్గురు అమ్మాయిలు కడవలు తీసుకోని నీళ్ళు తేవడానికని చెరువు దగ్గరికి పోయినారు. నీళ్ళు ముంచుకుంటా... ముంచుకుంటా “ఏమే... నాన్న సంబంధాలు చూస్తా వున్నాడు గదా. నువ్వెవరిని చేసుకుంటావే... అంటే... నువ్వెవరిని చేసుకుంటావే” అని ఒకర్నొకరు అడుక్కోసాగినారు.
అదే సమయంలో ఆ వూరి యువరాజు మారువేషంలో అటువైపు వచ్చినాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటా వున్నారో విందామని ఒక పొద దాపున కూర్చున్నాడు.
అందరికంటే పెద్దామె "నేను ఈ రాజ్యాన్ని కాపాడే సేనాధిపతిని చేసుకుంటా... నాకు యుద్దాలన్నా, పోరాటాలన్నా చానా ఇష్టం" అనింది.
రెండో ఆమె "నేను తన ఎత్తులు జిత్తులతో ఈ రాజ్యాన్ని ప్రశాంతంగా వుంచే మంత్రిని చేసుకుంటా... నాకు సలహాలివ్వడమన్నా, సమస్యల్ని పరిష్కరించడమన్నా చానా ఇష్టం" అనింది.
చిన్నామె “నేను ఈ రాజ్యాన్ని పాలించే యువరాజును చేసుకుంటా... నాకు దాసదాసీలతో సేవలందుకోవడమన్నా, సింహాసనం మీద రాజు పక్కన కూర్చోని ప్రజల్ని పాలించడమన్నా చానా ఇష్టం" అనింది.
అంతలో పెద్దామె "పదపద... ఆలస్యమైపోతా వుంది. మనం ఇలా పొద్దుపోక వుత్తుత్త కలలు కనాల్సిందే గానీ... ఇవన్నీ నిజమవుతాయా... పాడా... మన నాన్న ఏ తలకు మాసినోన్ని తెచ్చినా తలొంచుకోని తాళి కట్టించుకోవడం తప్ప ఏం చేయగలం" అనింది బాధగా. ముగ్గురూ మౌనంగా కడవలు సంకన పెట్టుకోని గమ్మున ఇంటిదారి పట్టినారు.
యువరాజు వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ముగ్గురినీ చూసినాడు. ముగ్గురూ చానా చక్కగా అప్పుడే పూసిన రోజాపూవుల్లెక్క వంక బెట్టడానికి లేకుండా వున్నారు. “అరే... పాపం... ఈ అమ్మాయిలెవరో గానీ వీళ్ళ కోర్కెలు తీరుద్దాం. వీళ్ళకేం కన్నొంకరా... కాలొంకరా... చక్కగా పాలమీగడ లెక్కున్నారు” అనుకున్నాడు. వెంటనే అంతఃపురానికి పోయి మంత్రినీ, సేనాధిపతినీ పిలిచి జరిగిందంతా చెప్పి "మనం ముగ్గురమూ వాళ్ళ ముగ్గురినీ పెళ్ళాడదాం" అన్నాడు.
రాజే సరే అన్నాక మిగతా వాళ్ళదేముంది... వాళ్ళు గూడా సరే అన్నారు. తర్వాత రోజు ముగ్గురూ కలసి రైతు ఇంటికి పోయినారు. స్వయంగా తమను పాలించే రాజు, మంత్రి, సేనానే తమ ఇంటికి అల్లుళ్ళుగా వస్తామనే సరికి రైతు చానా సంబరపడ్డాడు. వాళ్ళు కోరుకున్నట్టే వారికి నచ్చిన వాళ్ళనిచ్చి పెండ్లి చేసినాడు.
పెద్దామె సేనాధిపతి పెండ్లాం అయితే, నడిపామె మంత్రి పెండ్లాం అయితే, చిన్నామె రాజ్యానికి యువరాణి అయింది. దాంతో చిన్నామెకు అడుగడుగునా దాసీలే. ఆమె భోగమే భోగం. పన్నీటి స్నానాలు, మెత్తని హంసతూలికా తల్పాలు, ఏడువారాల నగలు, లెక్కబెట్టుకోలేనన్ని పట్టు వస్త్రాలు... ఒకటని కాదులే... కను సైగ చేస్తే చాలు కోరుకున్నవన్నీ కాళ్ళముందుకొచ్చేవి. అదంతా చూసి పెద్దామెకు, నడిపామెకు కన్ను కుట్టింది. “ఛ... ఛ... ఆ రోజు చెరువుకాడ ఆ మాటలంటున్నప్పుడు అవి నిజమవుతాయని కలలో గూడా అనుకోలేదు. లేకుంటే మనం గూడా యువరాజే మొగుడు కావాలని కోరుకుంటుంటిమి. మనందరికన్నా చిన్నదయినా దీనికేమి అదృష్టం పట్టింది. ఎట్లాగయినా సరే వీళ్ళిద్దరినీ విడదీయాల" అనుకోసాగినారు.
చూస్తుండగానే గంటలు రోజులై, రోజులు వారాలై, వారాలు నెలలై... ఆ చిన్నపిల్లకు మిగతా ఇద్దరికన్నా ముందే కడుపు పండింది. అది చూసి యువరాజు చానా సంబరపడ్డాడు. కాలు కింద పెట్టనీయకుండా పసిపిల్లలెక్క అల్లారుముద్దుగా చూసుకోసాగినాడు. ఆమె ఏమడిగితే అది... ఎంత ఖరీదయినా సరే తెప్పించసాగినాడు. ఒక పూట తిన్న వంట మరొకపూట తినకుండా దేశదేశాల నుండి పేరు మోసిన వంటగాళ్ళనందరినీ పిలిపించి అమృతం లాంటి వంటకాలన్నీ చేయించి పెట్టసాగినాడు. ఇదంతా చూస్తావున్న కొద్దీ అక్కలిద్దరికీ మరింతగా మండిపోసాగింది. పైకి నవ్వుతా ఇకఇకలాడుతావున్నా... లోపల మాత్రం కుతకుతా వుడికిపోతా విషం కక్కుతా వున్నారు. ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా... ఎప్పుడెప్పుడు దెబ్బ కొడదామా... అని ఎదురు చూడసాగినారు.
అట్లా ఒక్కొక్క నెల గడుస్తా... గడుస్తా... ఆ చిన్నపాపకు తొమ్మిది నెలలు నిండినాయి. ఈ వారమా వచ్చేవారమా కానుపు అన్నట్టుంది. అంతలో అనుకోకుండా పక్క ఊరి నుండి ఒకరాజు ఆ రాజ్యం మీదికి దండయాత్ర కొచ్చినాడు. దాంతో యువరాజు తప్పనిసరై, సైన్యాన్ని తీసుకోని పోతా పోతా పెళ్ళాం అక్కలిద్దరినీ పిలిచి “మీ చెల్లెలు నిండుమనిషి. అక్కలైనా, అమ్మలైనా మీరే. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి" అని అప్పజెప్పినాడు. దానికి వాళ్ళు నవ్వుతా “దానిదేముందిలే యువరాజా! నీవు పోయిరా. మేం కంటికి రెప్పలా, కాలికి చెప్పులా కాపాడుకుంటాము" అన్నారు. పోయే ముందు యువరాజు పెండ్లాంతో “ఏమే... నాకు ముద్దులు మూటగట్టే కొడుకునిస్తావా... చూడ చక్కనైన కూతుర్నిస్తావా... ఎవరినిస్తావు” అన్నాడు. దానికామె నవ్వుతా “ఏమో... నాకేం తెలుసు. దేవుడు కడుపున ఎవర్ని వేసింటే వాళ్ళనిస్తా" అనింది. దానికి యువరాజు “మరి నేను అంత దూరంలో వుంటాను గదా... నాకెట్లా తెలుస్తాది... ఎవరు పుట్టినారో" అన్నాడు. దానికామె చిరునవ్వు నవ్వుతా “ఏముంది... నేను కనగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిస్తే కొడుకు పుట్టినట్లు. పగడాల వాన కురిస్తే కూతురు పుట్టినట్లు... ఏం సరేనా" అనింది.
యువరాజు అట్లాగేనంటూ యుద్ధానికి వెళ్ళిపోయినాడు. అట్లా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయినాయి. అప్పుడు అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం భయపడొద్దు చెల్లీ... మేమున్నాం గదా... కళ్ళు మూసుకోని కాసేపు బాధ బిగబట్టుకో, బోసినవ్వులు నవ్వే పాప పక్కనుంటాది" అంటూ కాన్పుకు తీసుకోని పోయినారు. ఆమెకు కాసేపట్లో ముచ్చటగొలిపే కొడుకు పుట్టినాడు. వెంటనే అక్కలిద్దరూ ఆమె కళ్ళు తెరవక ముందే మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి, ఆమె లేచేలోగా ఆ పిల్లవాన్ని అక్కడి నుంచి తీసుకోని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసి, ఒక చచ్చిపోయిన పిల్లవాన్ని తెచ్చి పక్కన పన్నబెట్టినారు. ఆమెకిదంతా తెలీదు... దాంతో మత్తు దిగినాక కొడుకు చనిపోయి వుండటాన్ని చూసి బాధ పడింది.
అక్కడ యువరాజు యుద్ధంలో వుండగానే ఆకాశంలోంచి ముత్యాలవాన కురిసింది. అది చూసి యువరాజు “ఆహా... నాకు ముత్యంలాంటి కొడుకు పుట్టినట్టున్నాడు" అని ఎంతగానో సంబరపడ్డాడు. యుద్ధం పూర్తి కాగానే ఎప్పుడెప్పుడు కొడుకును చూద్దామా అని సంబరపడతా బెరబెరా ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ పసిపాప నవ్వుల్లేవు. చనిపోయాడని తెలుసుకొని ఎంతగానో బాధపడ్డాడు. ఐనా కాసేపటికి తమాయించుకొని “సరే.. జరిగిందేదో జరిగిందిలే... మనకు నుదుటన రాత రాసినట్టు లేదు. ఈసారి మాత్రం చూడచక్కనైన కూతురినివ్వు" అన్నాడు. మళ్ళా ఆమెను ఇంతకు ముందులాగే బాగా చూసుకోసాగినాడు.
ఇంతకు ముందు బాబును పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలినారు గదా... ఆ పెట్టె కొట్టుకోని పోయి, కొట్టుకోని పోయి ఒక ముసలి బాపనాయనకు దొరికింది. ఆయనకు పెళ్ళాం, పిల్లలు ఎవరూ లేరు. ఒక్కడే. పిల్లలకు చదువు నేర్పిస్తా వుంటాడు. ఆయన ఆ పసిపిల్లోన్ని చూసి “ఎవరు కన్నబిడ్డో ఏమో... పాపం... ఎంత కష్టమొచ్చిందో... ఇట్లా వదిలేసింది" అనుకోని పెంచుకోడానికి ఇంటికి తీసుకోని పోయినాడు.
అట్లా కొంతకాలం గడిచినాక... ఆ రాజ్యంలో రైతులు వేసిన విత్తనాలు మొలకలై, మొలకలు మొక్కలై, మొక్కలకు పూవులై, పూవులు కాయలై, కాయలు విత్తనాలై పంటలు ఇంటికి చేరుతావున్న దశలో యువరాణికి మళ్ళా కడుపు పండింది. ఈసారి రాజు ఆమెని కాలు కింద పెట్టనీయకుండా అడుగడుగునా దాసీలని పెట్టి మరింత అపురూపంగా చూసుకోసాగినాడు. అట్లా ఒకొక్క నెలా దాటి కాన్పుకు దగ్గర పడింది.
అనుకోకుండా అప్పుడే ఆ రాజ్యాన్ని ఆనుకొని వుండే అడవుల్లో కొన్ని దొంగల ముఠాలు చేరినాయి. వాళ్ళు రోజూ గుంపులు గుంపులుగా ఊర్ల మీద పడి దొరికినోన్ని దొరికినట్లు చంపుతా కనబడినదల్లా దోచుకోని పోసాగినారు. జనాలంతా భయపడి రాజు దగ్గరికి పోయి “రాజా! వాళ్ళు మామూలోళ్ళు గాదు. ఒకొక్కడు ఒకొక్క ఏనుగంత బలంగా వున్నాడు. వాళ్ళని ఆపడం మా వల్ల కావడం లేదు. నీవే మమ్మల్ని ఎట్లాగైనా కాపాడాల. లేకుంటే ఊర్లు వదిలిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు" అని కాళ్ళ మీద పడినారు. రాజు 'సరే' అని పెండ్లాన్ని పిలిచి “మళ్ళా కానుపప్పుడే పోవలసి వస్తా వుంది. ఈసారి జాగ్రత్త. నేను వచ్చేసరికి బోసినవ్వులతో కిలకిలకిల నవ్వుతా వున్న కొడుకునో కూతురినో నా చేతుల్లో పెట్టాల. ఆరోగ్యం జాగ్రత్త" అని చెప్పి పోయినాడు.
అట్లా పోయిన వారం రోజులకు ఆమెకు నొప్పులు మొదలయినాయి. ఎప్పట్లాగే అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం భయపడొద్దు చెల్లీ. మేమున్నాం గదా... కళ్ళు మూసుకొని కాసేపు బాధ బిగబట్టు, చిరునవ్వులొలికే చిన్నారి నీ పక్కనుంటాది" అంటా కాన్పుకు తీసుకోనిపోయినారు. ఆమెకు కాసేపటికి చందమామ లెక్క చక్కని పాప పుట్టింది. వెంటనే అక్కలిద్దరూ చెల్లెలికి మత్తుమందు కలిపిన నీళ్ళిచ్చి ఆమె లేచేలోగా ఆ పాపను అక్కడి నుంచి తీసుకోని పోయి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేసి, ఒక చచ్చిపోయిన పాపని తెచ్చి పక్కన పన్నబెట్టినారు.
ఆమెకిదంతా తెలీదు గదా... దాంతో మత్తు దిగినాక కూతురు చనిపోయుండటాన్ని చూచి “అరే... అప్పుడు కొడుకు, ఇప్పుడు కూతురు. ఏమి రాత రాసినావురా దేవుడా నుదుటి మీద" అంటా కళ్ళనీళ్ళు పెట్టుకోనింది. అంతలో అక్కలిద్దరూ చెరోపక్కన చేరి “ఏం బతుకే నీది... ఎప్పుడూ చచ్చిపోయిన పిల్లోల్లని కంటా వున్నావు. పాపం ఎన్నో ఆశలతో వురుకులు పరుగుల మీద వచ్చే నీ మొగునికి నీ మొగం ఎట్లా చూపిస్తావే పాపిష్టిదానా" అంటూ సూటిపోటి మాటలన్నారు. దాంతో ఆమెకు చానా బాధ వేసి రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆ రాజ్యాన్ని వదిలేసి ఎవరికీ కనబడనంత దూరం వెళ్ళిపోయింది. అక్కడ ఒక ఇంట్లో ఎవరూ లేని అనాథనంటూ పనికి చేరి బతకసాగింది. అక్కలిద్దరూ చెల్లెలు వెళ్ళిపోవడంతో చానా సంబరపడినారు.
అక్కడ అడవిలో దొంగలను వేటాడుతా వున్న యువరాజు మీద ఆకాశంలోంచి పగడాల వాన కురిసింది. అది చూసి యువరాజు “ఆహా.. ఈసారి నాకు చూడచక్కని కూతురు పుట్టినట్లుంది" అని సంబరపడ్డాడు. కొద్దిరోజుల్లో దొంగలనంతా తరిమేసి పాపను చూడ్డం కోసం వురుకులు పరుగుల మీద ఇంటికొచ్చినాడు.
కానీ అక్కడ పసిపాప కేరింతలు లేవు. అక్కలిద్దరూ దొంగ ఏడుపు ఏడుస్తా నీ పెళ్ళానికి ఈసారి గూడా చచ్చిపోయినోళ్ళే పుట్టినారు. దాంతో నీకు మొగం చూపించలేక రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పా పెట్టకుండా యాడికో వెళ్ళిపోయింది" అంటూ చెప్పినారు. పిల్లనే గాక పెళ్ళాం గూడా పోయినందుకు రాజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
ఇంతకు ముందు అక్కలిద్దరూ పెట్టెలో పాపను పెట్టి వదిలినారు కదా... అది కొట్టుకోని పోయి కొట్టుకోని పోయి... మళ్ళా అదే ముసలి బాపనాయనకు దొరికింది. ఆయన ఆ పాపను గూడా బైటకు తీసుకొచ్చి సొంత పిల్లలెక్క అల్లారుముద్దుగా పెంచసాగినాడు. అట్లా ఆడ కొంతకాలానికి పిల్లలిద్దరూ పెరిగి పెద్దగయినారు. ఆయన దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నారు. ఆ
బాపనాయన చానా ముసిలోడయిపోయినాడు. చనిపోయే ముందు ఇద్దరినీ పిలిచి “బాబూ... మీకు మీ పుట్టుక గురించి ఒక్క నిజం చెప్పాల. మీరు నా సొంత పిల్లలు కాదు" అంటూ జరిగిందంతా చెప్పి చనిపోయినాడు.
పిల్లలకు తమ అమ్మానాన్నా ఎట్లా వుంటారో, ఎక్కడుంటారో తెలుసుకోవాలనిపించింది. కానీ చెప్పేవాళ్ళు ఎవరూ లేక బాధపడసాగినారు.
ఆ పిల్లల ఇంటి పక్కన ఒక తోట వుంది. దాంట్లో లోకంలో యాడా దొరకనన్ని రకరకాల పండ్ల చెట్లు వున్నాయి. వాటి కోసం ఒక బంగారు పక్షి అక్కడికి వచ్చింది. సూర్యుని కిరణాలు పడి దాని ఒళ్ళంతా ధగధగా మెరవసాగింది. లోకంలో ఎన్నో పక్షులు చూసినాం గానీ ఇంత అందమైన పక్షిని ఎప్పుడూ చూడలేదు. దీన్ని పట్టి ఇంట్లో వుంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారిద్దరూ. దాంతో వాళ్ళు నెమ్మదిగా దాక్కుంటా దాక్కుంటా దాని దగ్గరికి పోయినారు. లటుక్కున ఆ పక్షిని పట్టుకోబోతే అది అందినట్లే అంది చేయి తాకిన మరుక్షణమే టక్కున మాయమైపోయింది. మళ్ళీ ఎప్పుడూ అటువైపు రాలేదు.
అట్లా కొంతకాలం గడిచినాక ఒక సాధువు వాళ్ళ ఇంటికాడికి వచ్చినాడు. అది అన్నాల సమయం. పిల్లలిద్దరూ ఇంట్లో కూచోని అన్నం పెట్టుకుంటా వున్నారు. ఆ సమయంలో సాధువు "అమ్మా... ఆకలయితా వుంది. ఏమయినా వుంటే పెట్టండమ్మా... పొద్దున్నించీ ఏమీ తినలేదు. నీరసంగా వుంది' అన్నాడు. అన్నా చెల్లెల్లిద్దరూ అన్నం పళ్ళాల కాన్నించి లేచి బైటకొచ్చి సాధువుకు తమ కోసం వండుకున్నదంతా వేడివేడిగా పెట్టినారు. తోటలోంచి మంచి మంచి మాగిన పళ్ళు తెచ్చి ఇచ్చినారు. సాధువు కడుపు నిండా తిన్నాక "పిల్లలూ... మీరు చేస్తున్న మర్యాదలకు చానా సంతోషం కలుగుతా వుంది. నేను దేశమంతా ఒకసారి పోయిన చోటికి మరొకసారి పోకుండా తిరుగుతా వుంటాను. అక్కడి వింతలు విశేషాలు తెలుసుకుంటా వుంటాను. నాకు మాయలూ మంత్రాలు రావు గానీ అనేక విషయాలు మాత్రం తెలుసు. మీకేమయినా అటువంటివి తెలుసుకోవాలనుకుంటే అడగండి చెబుతాను” అన్నాడు.
అప్పుడా పిల్లలకు ఒకసారి తమ తోటలోకి వచ్చిన బంగారు పక్షి గుర్తుకు వచ్చింది. “సామీ... ఈ నడుమ మా తోటలోనికి ఒక బంగారుపక్షి వచ్చింది. మేము పుట్టి బుద్దెరిగినప్పటి నుండీ అటువంటి అందమైన పక్షిని ఎప్పుడూ చూడలేదు. వినలేదు. మీకేమయినా దాని గురించి తెలుసా" అని అడిగినారు.
దానికా సాధువు చిరునవ్వు నవ్వి “నాయనా... అది అట్లాంటిట్లాంటి మామూలు పక్షికాదు. ఏడేడు పధ్నాలుగు లోకాల్లోనూ అంత అందమైన పక్షి యాడా కనిపించదు. అంతే కాదు అది చానా మహిమలున్న పక్షి. ఇక్కడికి ఉత్తరం వైపున ఏడువందల మైళ్ళ దూరంలో వరుసగా ఏడు కొండలున్నాయి. చివరి కొండ మీద ఏడు మర్రిచెట్లు వున్నాయి. చివరి మర్రిచెట్టుకు ఏడు పెద్ద పెద్ద కొమ్మలున్నాయి. చివరి కొమ్మ మీద ఏడు అందమైన గూళ్ళు వున్నాయి. అందులోని చివరి గూడులో ఈ పక్షి నివసిస్తా వుంటాది. కానీ దాని దగ్గరికి పోయిన వారిని ఎవరినైనా సరే అది ఏడు ప్రశ్నలడుగుతాది. సరియైన సమాధానం చెప్పావా... నీవు ఏ కోరిక కోరినా కాదనకుండా నెరవేరుస్తాది. తప్పు చెప్పినావా వెంటనే నిన్ను అక్కడికక్కడే రాయిగా మార్చి వేస్తుంది" అని చెప్పినాడు.
బాపనాయన దగ్గర చిన్నప్పటి నుంచీ వేదవేదాల్లో శిక్షణ పొందిన ఆ పిల్లోడు ఎట్లాగయినా సరే ఆ పక్షిని చేరుకొని అమ్మానాన్నల గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. తరువాత రోజు పొద్దున్నే దారిలో తినడానికి పళ్ళు, రొట్టెలు మూట కట్టిచ్చుకోని బైలుదేరినాడు. రాత్రనకా, పగలనకా నడిచీ నడిచీ చివరికి ఏడేడు పధ్నాలుగు రోజులకు కొండలను చేరుకున్నాడు. గంటకో కొండను దాటుతా ఏడో గంటకు చివరి కొండను చేరుకున్నాడు.
నిమిషానికో మర్రిచెట్టు దాటుతా ఏడో నిమిషానికి చివరి చెట్టును చేరుకున్నాడు. క్షణానికో గూడు దాటుతా ఏడో క్షణానికి చివరి గూడు చేరి తలుపు తట్టినాడు. అప్పుడు ఆ గూట్లో నుంచి ధగధగా మెరిసిపోతా వున్న బంగారు రెక్కలను విదిలించుకుంటా బైటకొచ్చింది. ఈ పిల్లోన్ని చూసి “చూడు... వచ్చిందారినే మర్యాదగా వెనక్కు తిరిగి చూడకుండా ఐనా వెళ్ళిపో... లేదా నేనడిగే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పి నీకు కావలసినదాన్న తీసుకోని పో" అనింది. అప్పుడా పిల్లోడు ఏ మాత్రం బెదపడకుండా “అడుగు చెబుతాను" అన్నాడు. ఆ పక్షి అడగడం మొదలు పెట్టింది. అదట్లా అడగడం ఆలస్యం ఆ
పిల్లోడు క్షణం గూడా ఆలస్యం చేయకుండా ఠకీమని సమాధానం చెప్పడం మొదలు పెట్టినాడు. 
1. లోకంలో అన్నిటికన్నా వేగమైనది ఏది? 
జ. మనసు 
2. ఎంత దాచినా దాగనిది ఏది? 
జ. అబద్దం 
3. పోతే తిరిగిరానిది ఏది? 
జ. పరువు 
4. ఎంత పంచినా తరగనిది ఏది? 
జ. విద్య 
5. భార్యాభర్తల మధ్య వుండాల్సినది ఏమిటి? 
జ. నమ్మకం 
6. మనషులు నాశనం కావడానికి కారణం? 
జ. అసూయ 
7. మనిషి గొప్పవాడయ్యేది ఎప్పుడు? 
జ. ఇతరుల కోసం బతికినప్పుడు.
ఆ పిల్లోడిచ్చిన జవాబులన్నీ విని ఆ పక్షి చానా ముచ్చటపడింది. “ఆహా... ఎన్నాళ్ల నుండో ఈడికి ఎంతోమంది వస్తా వున్నారు. జవాబులు చెప్పలేక రాళ్ళుగా మారుతా వున్నారే గానీ... నీ మాదిరి చక్కగా సమాధానం చెప్పినవారు ఎవరూ లేరు. చెప్పు... నీకేం కావాల్నో" అనింది. అప్పుడా పిల్లోడు జరిగిందంతా చెప్పి "మా అమ్మానాన్నలు యాడున్నారు. వాళ్ళని, మమ్మల్ని కలుపు" అన్నాడు.
సరే అని పక్షి ముందు వాళ్ళ చెల్లెలిని ఆడికి పిలుచుకోనొచ్చి ఇద్దరినీ బంగారు రథంపై కూచోబెట్టుకోని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకోని పోయింది. జరిగిందంతా తెలుసుకున్న వాళ్ళమ్మ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకోని ముద్దుల మీద ముద్దులు పెడతా కళ్ళనీళ్ళు పెట్టుకోనింది. ఆ తరువాత అందరూ రథమెక్కి యువరాజు దగ్గరికి చేరుకున్నారు. పెళ్ళాన్ని చూడగానే రాజు చానా సంబరపడినాడు. పక్కనున్న ఇద్దరు పిల్లలు తమ పిల్లలే అని తెలుసుకోని ఆనందంతో అందరినీ దగ్గరికి తీసుకున్నాడు.
జరిగిందంతా తెలుసుకోని భటులని పిలిచి “పోండి... పోయి యువరాణి అక్కలిద్దరినీ పట్టుకోని గుండు కొట్టించి, సున్నం బొట్లు పెట్టి, ఊరకుక్కల మీద వూరంతా వూరేగించి వురెయ్యండి" అని చెప్పినాడు. దానికి యువరాణి అడ్డంపడి “వద్దు రాజా... ఏది ఏమయినా వాళ్ళిద్దరూ నాతోపాటు రక్తం పంచుకొని పుట్టినోళ్ళు. వాళ్ళ బాధ నాకూ బాధే. ఈ ఒక్కసారికి వదిలేయండి" అనింది. చెల్లెలి మంచితనం తెలుసుకోని అక్కలిద్దరూ కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు. పరుగు పరుగున వచ్చి ఆమె కాళ్ళ మీద పడినారు. ఆమె వాళ్ళని పైకి లేపి “జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండీ అందరం కలసిమెలసి వుందాం హాయిగా" అనింది.
రాజు తన పెండ్లాం పిల్లలు తిరిగి వచ్చినందుకు సంతోషంతో వూరువూరంతా విందు భోజనాలు పెట్టించినాడు. నేను కూడా తినడానికి నా పెండ్లాం బిడ్డలతో  కలసి పోతావున్నా. మీరు కూడా ఇక చదవడం ఆపి వెంటనే బైలు దేరండి. 
***********
కామెంట్‌లు