సంక్రాంతి;- -శిరందాస్ శ్రీనివాస్హైదరాబాద్. 9441673339
పట్నం పల్లె బాట బట్టింది
పల్లెలు పచ్చని తోరణాలతో సింగారించుకుని ముస్తాబు అయినవి.
బాటెంట వరి కంకులు
పిల్ల గాలులకు తలలు ఊపుతూ
ఆటోలకు, కార్లు బైకులకు 
స్వాగతం పలుకుతున్నయి.

పట్నం రోడ్లు బొసి బోయి వెల వెల బోతున్నయి..
శివార్లలో ఉచిత బస్సుల కోసం 
జనం బారులు తీరి 
కిక్కిరిసిన బస్సులలో దూరే సందులేక 
కార్లకోసం కోసం ఎంతైనా చెల్లించి
పిల్లా పాపలతో ఎట్టగైన త్వరగా ఊరు చేరాలని తాపత్రయం..
పండుగనాడైనా
అమ్మా నాన్నలతో గడపాలనే 
గంపెడాశ ..

అందరూ వస్తున్నరు..
మావొడూ కోడలు పిల్ల ఇంకా రాలేదని ముసలోళ్ళ ఎదిరిచూపులు.

మనుమలు మనుమరాండ్ల కోసం
చేసిన తీపి వంటకాలు 
అరిసెలు, గర్జికాయలు, కారపప్పల నిరీక్షణ..

పచ్చని కళ్ళాపి చల్లి 
తీరొక్క ముగ్గులతో 
గొబ్బెమ్మలతో 
గరక పోసలు, రేగుపళ్ళ
పసుపు కుంకుమలతో
ముస్తాబైన లోగిళ్ళు
ప్రాణం లేచి వచ్చిందా పల్లెలకు 
అన్నట్లు కొత్త పెళ్లి కూతురులా సింగారించుకుని
సందడి చేస్తున్నాయి..
ఇప్పుడే గ్రామ స్వరాజ్యం వచ్చినంతగా...

గంగిరెద్దుల విన్యాసాలు
హరి దాసుల కీర్తనలు ..  
రాళ్ళు రప్పలు, చెక్కలు అడ్డు పెట్టి
వచ్చి పోయే వాహనాలకు
ముగ్గులు చెడిపోకుండా 
కన్నె పిల్లల ఆరాటం..

పట్నమంత పల్లెటూర్లో 
మకాం వేస్తే ..
నిన్నటి దాకా బోసిబోయిన
పల్లెలు కల కల లాడుతు
జీవ కళ ఉట్టి పడేలా 
సందడి చేస్తున్నయి..

కొత్త అల్లుళ్లకు మర్యాదలతో
కోడళ్ళ ఆరాటాలు..
ఆడ కూతుర్ల అలకలు
బామ్మర్డుల పాట్లు..
కోడి పందాలు, సరదా జూదాలు 
అన్నీ కలగలిపి పల్లెలు 
జోరుగా హుషారుగా పాట లక్కించుకున్నయి..

ఈ కళ ఇలాగే ఉండి పోవాలని
ఈ కేరింతలు, సందళ్లు
హరిదాసు కీర్తనలు శాశ్వితం
కావాలనీ
ఈ ఊరంతా సంక్రాంతి 
ఇలాగే ఉండాలనీ
తెల్లారక పోతే బావుండు..
ఆ సూరీడు మకర రాశిలోనే 
ఉండి పోతే బావుండు..కామెంట్‌లు