సంక్రాంతి (బాల గేయం );- రావిపల్లి వాసుదేవరావు-విజయనగరం-9441713136
శుభాలిచ్చు సంక్రాంతి!
శోభలీను సంక్రాంతి!
ఇంటింటా వెలిగేటి
ఉత్సాహపు నవకాంతి!

హరిదాసు కీర్తనలో
పరవసాల నవగీతి!
గంగిరెద్దు ఆటలలో
ఆనందపు నాట్యరీతి!

అరవిరిసిన బంతుల్లో
హేమంతపు సుమగీతి!
తెల్లని చేమంతులలో
వెన్నెల వెలుగుల రీతి !

భోగభాగ్యాల భోగి!
సంతసాల సంక్రాంతి!
పశుపూజల శుభకనుమ!
మూణ్ణాళ్ల నవ్యకాంతి!

బొమ్మలకొలువుల భాగ్యం!
భోగిపళ్ల సౌభాగ్యం!
రంగవల్లులందాలతో
కన్నులకింపైన దృశ్యం!

గుమ్మడిపూల శోభతో
పొంగులెత్తిన సంబరం!
సంప్రదాయ వంటలతో
ఘుమ ఘుమల ఆనందం!

పౌష్యలక్ష్మి ప్రతిఇంటా
శుభాలిచ్చు పుణ్యకాలం!
పెద్దల పూజలు చేసి 
ముందుకెళ్ళే శుభతరుణం!కామెంట్‌లు