ఒత్తిడిని జయిస్తూ ఆత్మ విశ్వాసంతో పరీక్షలు వ్రాయాలి

 పరీక్ష కేంద్రంలో నిర్మలమైన మనస్సుతో పరీక్షలకు సిద్ధమవ్వాలంటూ, ఎలాంటి ఒత్తిడికీ లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలంటూ దూరదర్శన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
ప్రభుత్వ నిర్దేశాల మేరకు విద్యార్థులందరికీ దూరదర్శన్ ద్వారా పరీక్ష మే చర్చా కార్యక్రమాన్ని వీక్షింపజేసామని ఆమె తెలిపారు. వేలాదిమంది విద్యార్థులతో పరీక్షలనే అంశంపై నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించి, వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడే సన్నివేశాలు వీక్షిస్తున్న తమ విద్యార్థులు మిక్కిలి ఆనందం పొందారని ఉపాధ్యాయులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుండి సంగీత ఉపాధ్యాయుడు సంపత్ రావు అడిగిన ప్రశ్నకు మానసిక ఉల్లాసం సంగీతం ద్వారా మాత్రమే సముపార్జించుకోగలమని
ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. 
ఒరిస్సా, చత్తిస్ గడ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాన మంత్రి మోదీ సమాధానమిస్తూ ఎలాంటి ఒత్తిడికీ లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు వ్రాయాలని, నిర్మలమైన మనస్సుతో పరీక్షలు వ్రాసేందుకు సిద్ధమవ్వాలని
అన్నారు. మోదీ మాట్లాడుతూ విద్యార్థులంతా నిరంతరం చదువులపై దృష్టి సారించాలని అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం రాదని అన్నారు. మొబైల్ సెల్ ఫోన్ వాడకం పరిమితంగా ఉండాలని, 
తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే సమయం వృథా అవుతుంది తప్ప ఎట్టి ఉపయోగం లేదని అన్నారు. 
ఎంతగా శ్రమించి చదివితే అంతటి ఆత్మ విశ్వాసం పొందుతారని ప్రధాని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులను స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంచేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి నేరుగాను, అంతర్జాలం ద్వారాను విద్యార్థులతోనూ, ఉపాధ్యాయులతోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిర్వహించిన పరీక్షా మే చర్చా కార్యక్రమాన్ని వోని పాఠశాల విద్యార్థులంతా ఆసక్తిగా వీక్షించారు.
దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
కామెంట్‌లు