సుప్రభాత కవిత - బృంద
ఆడుగులకు నేల ఆసరా
భావాలకు మనసు ఆసరా
కలలకు కనులు అసరా
మాపటికి  రేపు ఆసరా....

తిమిరాన్ని వెలివేసి
వెలుగులతో వెల్లవేసి
అవని అణువణువుకూ
చైతన్యమిచ్చే వేకువ

తీరమెంత దూరమైనా
భారమే తెలియనీక
కొత్త ఆశల గాలమేసి
చిత్తుగా ఆడించే వేకువ

మోడువారిన బ్రతుకులో
బీడుగ మారిన మనసున
వాడిన ఊహల వేదనలో
తోడుగ నేనున్నాననే వేకువ

కదులుతున్న కాలానికి
బదులు తెలియని ప్రశ్నగా
నలుగుతున్న మదిలో
వెలుగు చూపే వేకువ

కరుగుతున్న కలతల మంచులో
సాగుతున్న  కన్నీటి వాగులో
ఊగుతున్న పడవకు
ఊతమిచ్చే వేకువ

తల్లడిల్లు మనసును
తల్లి లాగా ఒడిచేర్చి
తెల్లవారి వెలుగులో
కళ్ళు తుడిచే వేకువ

గుప్పెడు గుండెలో
చప్పుడు పదిలంగా వుంచి
రెప్పల దాగిన స్వప్నం
తప్పక నెరవేర్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు