అగ్నికి ఆరాధన, వాయువుకి గౌరవం భోగిపిడకలు.

 భోగి మంటలో పేడపిడకలు వేయడం ద్వారా గాలిలో శుద్ధి ఏర్పడునని, అగ్నిదేవునికి ఆరాధించినట్లవుతుందని, వాయుదేవునికి గౌరవించడమేనని, వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
పేడపిడకల ప్రాధాన్యత గూర్చి విశదీకరించే కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. 
నాగమణి మాట్లాడుతూ 
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశాన్ని  పురస్కరించుకుని మకర సంక్రాంతికి ముందురోజు ఒక సాంప్రదాయకంగా ఈ భోగిమంటలు వేస్తున్నామని అన్నారు. 
ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ 
దక్షిణాయనంలో మనం ఎదుర్కొనే కష్టాలను ఈ భోగిమంటకు ఆహుతినిచ్చీ, సౌఖ్యానికి పరమార్ధమైన భుగ్ ని ఆహ్వానించడంతో ఈ మంటకు భోగి మంట అని పిలుచుకుంటున్నామని అన్నారు. 
ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ 
పేడ కలిసిన మంట వలన గాలిలో ప్రాణవాయువు విడుదలౌతుందని, సూక్ష్మక్రిములు నశిస్తాయని, చలికాలపు శ్వాస సంబంధిత వ్యాథులను నిర్మూలించేలా ఈ భోగి మంట ఔషదంలా పనిచేస్తుందని అన్నారు. 
ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ రావి, మామిడి, మేడి వంటి చెట్ల కలపను ఈ పేడపిడకలతో పాటు భోగి మంటలో వేయడం ద్వారా లభించే ఆ వెచ్చదనంవలన శరీరంలో డెబ్బది రెండు వేల నాడులు పరిశుభ్రత పొందునని, మానసిక వికాసానికి దోహదపడునని అన్నారు. ఉపాధ్యాయులు సిద్ధాబత్తుల వెంకటరమణ  మాట్లాడుతూ శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందే సందర్భానికి సూచికగా ఈ భోగి పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ 
శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం నేర్పే సందర్భంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఈ భోగి పండుగ రోజేనని ఆయన గుర్తుచేసారు. శాపవశంగా బసవన్నను భువికి పంపీ, రైతుల పాలిట దైవంగా కొలిచే నేపథ్యంలో ఆ ఆవుపేడ పిడకలు ప్రాథాన్యం సంతరించుకున్నాయని తిరుమలరావు అన్నారు. శ్రీవిష్ణువు పాతాళానికి తొక్కి బలిచక్రవర్తిని పాతాళరాజుగా మార్చిననూ, ప్రతి సంక్రాంతికీ ముందు రోజు భూమిపైకి వచ్చి ప్రజలను సమస్త జీవకోటినీ ఆశీర్వదించాలని కోరడంతో బలిచక్రవర్తిని స్వాగతిస్తూ ఈ భోగి మంట ఆచారం మనమంతా పాటిస్తున్నామని ఉపాధ్యాయులంతా వివరించారు. 
ఈ భోగిపిడకల రూపకల్పనకు తోడ్పడిన బెహరా రితిక, దత్తి లాస్య ప్రియ, కనపాక లోకేష్ లతో పాటు, సీనియర్ విద్యార్థులు సుంకర చాందిని, పల్లి కావ్య, నందిగాన ప్రత్యూష, గులివిందల పావని, ఎస్.రామకృష్ణ, పి.నానిబాబు, ఎస్.నరేష్ తదితరులు ఈ భోగి పిడకలను ప్రదర్శించి, వీటి ఆవశ్యకతను పూజ్యభావంతో కొలుచుకుంటామని అన్నారు.
కామెంట్‌లు