సబబు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఊహ తెలియని వయసు 
అంతా తనవారే అనే భావన
మాయమాటలకు లొంగే అమాయకత్వం
వెరసి ముక్కుపచ్చలారని పాప!
వేలుపట్టి నడిపిస్తాడనుకున్న మనిషి
రాక్షసుడై తనను పీడిస్తాడని తెలియనిది
వింతపశువుచేసే వికృతక్రీడకు 
బలిపశువు అవుతున్నది!
మగతనంబలిసిన ఆంబోతు అకృత్యాలకు 
పూలచెండై నలుగుతున్నది
ప్రేమ కరుణ దయ జాలి 
తెలియని మృగం చేసే దుశ్చర్యలకు
ఆహుతి అవుతున్నది!
తల్లిపాలు తాగినప్పుడు 
చెల్లిని ఎత్తుకున్నపుడు
అక్క లాలించినపుడు 
వాళ్ళు చూపిన ప్రేమ 
వాడికి అర్థం కాలేదు!
తన తల్లీ చెల్లీ అక్కా 
ఈ పాపలకుండే శరీరంతోనే ఉన్నారని 
గ్రహించలేని మూర్ఖుల నీచపుచేష్టలకు 
పతనమవుతున్నది!
ఎదిగి, పుష్పించి, ఫలించి 
మరోజీవికి జన్మనిచ్చే
అవకాశం లేకుండా మొగ్గలోనే 
నలిపేస్తున్న దుష్టులను
ఇక ఉపేక్షిస్తే లాభం లేదు 
ఈమృగాళ్ళకు ఈలోకంలో
స్థానం లేకుండా చేయడమే సబబు!
**************************************

కామెంట్‌లు