కొత్త మొక్క కనుగొన్నభరత్ సింహ యాదవ్; - వెంకట్: మొలక ప్రత్యేక ప్రతినిధి
  వనపర్తి జిల్లా: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన పి. భరత్ సింహ యాదవ్ తమిళనాడులోని తేని జిల్లాలో ఒక కొత్త మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు ఆండ్రోగ్రాఫిస్ థేనియెన్సిస్ అని నామకరణం చేశారు. కల్వరాలకు చెందిన పద్మా, వెంకటస్వామిల కుమారుడు భరత్ సింహ యాదవ్ తమిళనాడు రాష్ట్రంలో మదురైలోని ది మధుర కాలేజ్‌లో ప్రొఫెసర్ కరుప్పుసామి ఆధ్వర్యంలో వృక్షశాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్నారు.
భరత్ కల్వరాలలో పాఠశాల విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్, డిగ్రీ వనపర్తిలో చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వనపర్తిలో డిగ్రీ చేస్తూనే పరిశోధనలపై ఆసక్తి చూపించారు. అది గమనించిన కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా. బి. సదాశివయ్య ప్రోత్సహించి తన దగ్గర ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చారు. తరువాత భరత్ పీహెచ్‌డీ కోసం తమిళనాడు వెళ్లారు. ప్రస్తుతం ‘పశ్చిమ కనుమల్లోని అంతరించిపోతున్న మొక్కల జీవిత చక్రం’ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడులోని తేని జిల్లాలో ఒక కొత్త మొక్కను కనుగొన్నారు.
సాధారణంగా ఆండ్రోగ్రాఫిస్ జాతికి చెందిన మొక్కలు బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు పశ్చిమ హిమాలయాలలో విస్తరించి ఉంటాయి. ఎక్కువ భాగం దక్షిణ భారతదేశం, శ్రీలంకలో పశ్చిమ మరియు తూర్పు కనుమలలో విస్తరించబడి వున్నాయి. ఈ మొక్కలు జలుబు, దగ్గు, జ్వరం, కామెర్లు, విరేచనాలు, హృదయ మరియు హెపాటిక్ వంటి అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతున్నాయి. ఈ మొక్క అంతర్జాతీయ నార్డిక్ జర్నల్ ఆఫ్ బోటనీలో ప్రచురించబడింది. కొత్త మొక్కను కనిపెట్టిన భరత్‌ను అధ్యాపకులు, మిత్రులు, జిల్లా వాసులు అభినందిస్తున్నారు. 
( దిశ  సోవణ్యంతో )

కామెంట్‌లు