సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -377
అణుకులాచల న్యాయము
*****
అణు అనగా అతి చిన్న పరిమాణము గల,లేశము,అల్పము,చిఱువడ్లు అనే అర్థాలు ఉన్నాయి.అచల అనగా కదలనిది,కొండ, పర్వతము, మేకు ,భూమి .
అణువుకు పర్వతమునకు గల తారతమ్యము చెప్పడమే ఈ న్యాయము యొక్క ఉద్దేశ్యం.
 "అణువూ అణువున వెలసిన దేవా/ కను వెలుగై మము కాపాడ రావా" అనే  సినిమా పాట మనలో చాలా మంది వినే వుంటారు. మరి అణువు అంటే ఏమిటి? అది ఎంత పరిమాణంలో వుంటుంది? దానికి సంబంధించిన కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందామా....!
 
 భౌతిక, రసాయన శాస్త్రం ప్రకారం అణువు అంటే తటస్థ విద్యుదావేశం కలిగి రసాయన బంధం ద్వారా ఉండే రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహం లేదా సముదాయము అని డాల్టన్ సిద్ధాంతీకరించాడు. పదార్థము అణువులతోనూ ఈ అణువులు ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రాన్లను కలిగి వుంటాయి.
అణువులో పరమాణువులు వుంటాయి.అణువే అతి చిన్నది అంటే పరమాణువు  మరింత చిన్నది.మన ఊహకు అందనంత చిన్నదిగా ఉంటుంది.
అలా  అణువు అనేది రసాయన శాస్త్రంలో ఒక ప్రాథమిక యూనిట్.చాలా చిన్నగా వుంటుందని మనకు ఈపాటికి అర్థమయ్యే వుంటుంది.
మరి అణువుకూ అచలానికి ఎంత తేడా ఉందో చెప్పక్కర్లేదు కదా!
అచలము అంటే కొండ లేదా పర్వతము అని అర్థం వున్నప్పటికీ చిన్న కొండలను గుట్టలు అంటారు.ఎత్తుగా వున్న కొండల్ని పర్వతాలు అంటారు.
అణువుకూ అచలానికి ఊహించలేనంత తారతమ్యము వుంది. అణువులో కదలిక వుంటుంది.పర్వతం అతి పెద్దదిగానూ, కదలిక లేకుండానూ, నిశ్చలంగా ఉంటుంది.
ఇతిహాసాలు,పురాణాలలో కొండలు లేదా‌ పర్వతాలు కదిలేవి,ఎగిరేవి అని చెప్పారు.అవి మన నమ్మకాలా? నిజాలా? అనేది పక్కన పెడితే టెక్టోనిక్ ప్లేట్‌ కదలిక వల్ల ,అలాగే భూమి‌ యొక్క క్రస్ట్ లో మార్ఫులు,భూకంపాల వల్ల పర్వతాలు కదులుతాయనీ, మరియు సృష్టించ‌ బడతాయని భూగర్భ‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే  అలా జరిగే క్రమము అత్యంత నెమ్మదిగా జరుగుతుందని అంటున్నారు.
సైన్సు ప్రకారం ఎన్ని విషయాలు, విశేషాలు చెప్పుకున్నా సామాన్యార్థకంలో మానవులు ఈ రెంటినీ పోల్చి చూస్తూ వుంటారు .నక్కకూ- నాగలోకానికో, హస్తి - మశకానికో పోల్చి చూసి కొండ- కొండే, అణువు- అణువే అనడం పరిపాటి.
కాబట్టి చంచలమైన మనస్సును అణువుతోనూ, దేనికీ చలించని స్థిరమైన, దృఢమైన మనస్సును పర్వతంతోనూ పోల్చి, వాటి మధ్య గల తారతమ్యాలను చూపుతూ 'అణువు అణువే', పర్వతం పర్వతమే..చంచల స్వభావులు- స్థిర చిత్తులు అని మన  ప్రవర్తనను బాగా గమనించిన  మన పెద్దలు  పోలికలు, భేదాలు చెబుతూ తెగడటమో పొగడటమో చేస్తుంటారు.
మరి అణువులా వెంట వెంటనే మార్పు  చెందకుండా,పర్వతంలా దృఢ చిత్తంతో  వుందాం. మనమెంత స్థితప్రజ్ఞులమో  చాటుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు