సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -384
ఆజా గళ స్తన న్యాయము
******
అజా అంటే ఆడ లేదా మగ మేక.గళము అంటే కుత్తుక లేదా,మెడ, గొంతు.స్తనము అనగా కుచము,చన్ను, రొమ్ము.
కొన్ని మేకల మెడల లేదా కుత్తుకల క్రింద కండగలిగిన  సంచులు చూడటానికి స్తనముల వేళ్ళాడుతూ కనిపిస్తాయి. వాటినే అజా గళ స్తనాలు అంటారు.
మరి వీటి గురించి విశేషించి చెప్పుకోవలసిన అవసరం ఏముంది అంటే... అవి మేక పిల్లలు పాలు తాగడానికి ఉపయోగ పడే విధంగా కనబడతాయి. కానీ వాటిల్లో పాలు వుండవు. వాటి వల్ల  అటు మేకలకు గానీ,పాల కొఱకు మనకు గాని ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేవలం అలంకార ప్రాయం మాత్రమే.
అంటే అవి చూపులకు తప్ప మేపులకు పనికిరావన్న మాట.అలాంటి మేక చన్నుల గురించి  వేమన లోభిని ఉద్దేశించి రాసిన పద్యాన్ని చూద్దామా.
 "మేక కుతిక బట్టి మెడచన్ను గుడవంగ/ ఆకలేల మాను ఆశ గాక/లోభివాని నడుగ లాభంబు లేదయా/ విశ్వదాభిరామ వినురవేమ!"
'మేక మెడకింద చన్నులను కుడిచితే పాలు దొరకవు.అదే విధంగా లోభి దగ్గర ఎంత సంపద ఉన్నా అవసరానికి యాచిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు"అని పిసినారి మనస్తత్వాన్ని ఘాటుగా విమర్శించారు.
 అయితే శ్రీల ప్రభు పాద స్వామి రచించిన శ్రీమద్భాగవతంలో   "చైతన్య  బోధనలు" అని రాసిన వాటిలో ఈ "అజాగళ స్తన న్యాయం గురించి" రాశారు.మరి అందులో ఏముందో చూద్దాం.
భక్తితో కూడిన సేవ లేకుండా ఆత్మ సాక్షాత్కారానికి మరియు ఆధ్యాత్మిక జీవితానికి ఏ ఇతర పద్ధతులు పనికి రావనీ,ఆ ఇతర పద్ధతులన్నీ "అజాగళ స్తనాల "వంటివే.అవి ఏ సమయంలోనూ మంచి ఫలితాలను ఇవ్వలేవు అంటారు.
 అలాగే  ఇది జాతీయంగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి బూదరాజు రాధాకృష్ణ గారు ఓ విశేషం రాశారు.
అదేమిటంటే ఓ తెలుగు కవి సాహిణీ మారుడనే కాకతీయ సేనాధిపతిని  సంస్కృతంలో తిడుతూ ,ఆ సేనాధిపతినీ ఈ మేక చన్నులను సృష్టించినందువల్లనే బ్రహ్మ దేవుడికి పూజలు జరగడం లేదని దూషించాడట. అంటే ఫలితంతో ఫలానా పని గాని, విషయం గాని,వస్తువు గాని పనికి రాదనో, పనికిమాలినదనో చెప్పడానికి ఈ 'అజాగళ స్తన' అనే పదబంధాన్ని ఉపయోగిస్తుంటారని రాశారు.
 ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా,  ఒక్కో కోణంలో ఈ" అజాగళ స్తనాల గురించి రాశారన్న మాట.
 ఇలా మన పెద్దలు సృష్టిలోని ప్రతి ప్రాణినీ నిశితంగా పరిశీలించి వాటి మీద ఇలా జాతీయాలు, న్యాయాలు సృష్టించి వాటిని మనుషులకు అన్వయించి చెప్పడం వారి సమయస్పూర్తికీ, విషయ పరిజ్ఞానానికి నిదర్శనం.
 ముఖ్యంగా ఈ న్యాయము ద్వారా మనకు లోభత్వం ఉండకూడదని,మనం చేసే పని అలంకార ప్రాయం కాకూడదని ,చిత్త శుద్ధి లేని పూజ వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేమని అర్థం చేసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు