మానవుల జీవితలక్ష్యం;-సి.హెచ్.ప్రతాప్

 మానవుడు జీవితలక్ష్యం తన లౌకిక వ్యాపారాలు, ఉద్యోగాలు, స్థితిగతులు కాదు. మానవజీవన లక్ష్యం- మోక్షం. మోహాన్ని వీడి, స్వార్థాన్ని తగ్గించుకొని, తోటిమానవుడుని దేవుడిలా చూసే దశనే మోక్షస్థాయి అని శాస్త్రం పేర్కొంటోంది.సమాజమంతా సజ్జనశీలురుంటే మంచితనం అంతటా వెల్లివిరుస్తుంది. పరివ్యాప్తమవుతుంది. దుర్గుణాలూ అంతే పాత్ర పోషిస్తాయి. ప్రపంచం లోని చెడును విమర్శించడం కంటే మనలోని చెడును తొలగించుకునే ప్రయత్నం చేయడమే మంచిది. మానవుడు పరివర్తనతో ప్రాయశ్చిత్త మార్గాన్ని  అనుసరించి  మంచిగా మారి సమాజసేవ చేయగలడు. శాంతిని స్థాపించగలడు. పరివర్తనతో, తనను తాను సంస్కరించుకొనే శక్తి మానవుడుకి మాత్రమే ఉంది.
మనోనిరోథాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సత్యభాషణం, సత్కర్మ, సదాలోచన చేస్తూ త్రికరణముల శుద్ధికై పాటుపడాలి. కామక్రోధాలు జయించాలి. భయదుఃఖాలకు లొంగిపోరాదు. ఈ గుణాలు అలవడడానికి సత్సాంగత్యము చేయాలి. మహాత్ములు నిర్దేశించిన మార్గాలలో నడుస్తూ, దురాలోచనలు దూరంచేసి సతతమూ సత్పదార్థాన్ని చింతిస్తూ సకల శ్రేయానికిన్నీ మూలకారణమైన జగన్మాత, సర్వమంగళను ధ్యానంచేస్తూ ఉండాలి. ఈ విధంగా ఎవడు చేస్తాడో అతడు జీవించి ఉన్నప్పుడే ముక్తుడై పునరావృత్తి రాహిత్యాన్నీ, మోక్షానంగాన్నీ పొందుతాడు అని కంచి పరమాచార్యులు తమ సద్గురువాణిలో అత్యద్భుతంగా తెలిపారు. రీరతత్వాన్ని, ప్రపంచ రీతులను, జీవితమును చక్కగా అవగాహన చేసుకొని జీవిస్తే మానవునకు శాంతి లభిస్తుంది. సామాన్య మానవులలో మరియు భోగలాలసులలో, మహారాజులలో క్షణంలో పరివర్తన కలుగుటకు కారణము ఈ ఎరుకనే. శంకరాచార్యులు అందరినీ సన్యసించమని, ఆలు బిడ్డలను వదిలి వెళ్ళమని ఆదేశించలేదు. కమలము బురదలో పుట్టి బురదలో పెరిగినా ఆ బురదను తనలో చేర్చుకోదు. అదే విధంగా సంసారములో ఉంటూ విషయవాసనలను ఎప్పటికప్పుడు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన కర్మలను నిర్వహిస్తూ భగవంతుని స్మరిస్తూ జీవించాలి. త్యాగరాజు, ఏకనాథ్, రామదాసు, తుకారాం, మొదలగు మహనీయులందరూ గృహస్థులే, అయిననూ వారు ఎంతో ఆనందముగా, శాంతముగా తమ జీవితమును గడిపారు.
కామెంట్‌లు