సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -380
అభావ విరక్తి న్యాయము
*****
అభావం అంటే లేమి,ఉనికి లేమి, లోపము,ఏమీ లేకపోవడం.విరక్తి అనగా  వైరాగ్యం, విషయ వాసనలు లేకపోవడం అంటే మనిషిగా సహజంగా వుండే కోరికలైన తిండి, సంపాదన లాంటి వాటిపై ఆసక్తి సన్నగిల్లడం.
అభావ విరక్తి అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి  చేసే ప్రయత్నంలో అది లభించనప్పుడు లేదా నెరవేరనప్పుడు  దాని వల్ల అంతగా ప్రయోజనం లేదులేదనీ,అక్కర లేదని చెప్పడాన్ని,అనుకోవడాన్ని  'అభావ విరక్తి' అంటారు.
ఎట్లాగూ తమకు  కొన్ని అందవు అనుకున్నప్పుడు  కొంతమంది తమకే వాటిమీద కోరిక లేదని  విరక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.
మరికొందరేమో వాళ్ళకు కొన్ని అందుబాటులో వుండవు,తీరేవి కావని ముందుగానే తెలిసి వాటి గురించి బాధను బయటికి వ్యక్తం చేయకుండా  "అబ్బే! మేము అలాంటివి అస్సలు ఇష్టపడమండీ!" అని వాటి మీద విరక్తిని నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు.
ఇలా "అందని ద్రాక్ష పండ్లను పుల్లన అని ఎందుకు అనుకోవాలి.అసలు ఇష్టమే వుండదు అనుకుంటే పోలే" అన్నట్లు వుంటుంది వారి మాట ధోరణి.
 అనుకున్న పదవి దక్కని వారు.ఎంతో ఆశించిన  ఉద్యోగం రాని వారు తరచుగా అనే మాట  కూడా పై విధంగానే వుంటుంది.అలాంటి పదవులంటేనే ఇష్టం వుండదని,బతిమిలాడి ఇచ్చినా తీసుకోమనీ అంటుంటారు.ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఆ ఉద్యోగంలో సాధకబాధకాలు ఏకరువు పెడుతూ అలాంటి ఉద్యోగం ఇష్టం లేకే చేయలేదని చెబుతుంటారు.
ఇలా సాధించలేని వాటిపై వద్దనుకున్నామని వ్యక్తం చేసే విరక్తి భావాన్ని అభావ విరక్తి అంటారన్న మాట.మరి ఈ విరక్తి ఎంత కాలం ఉంటుందో చెప్పలేం.కొందరిలో అందనంత వరకు మాత్రమే వుంటుంది అంటే తాత్కాలిక విరక్తి అన్న మాట.
కొందరిలో చాలా కాలం కొనసాగుతూ వుంటుంది.ఎందుకంటే  జీవితాంతం కష్ట పడినా సాధించలేరు.
అయితే ఈ అభావ విరక్తి సన్యాసం లాంటిది మాత్రం కాదని బూదరాజు రాధాకృష్ణ గారు అంటారు. ఎందుకంటే సన్యాసం అంటే అన్నీ వద్దనుకుని వదిలేసుకోవడం. వాటికి జీవితాంతం దూరంగా వుండటం. అలా కాదు కదా!
కావాలని పుచ్చుకునే వైరాగ్యం కాదు.తమకు సమకూరనప్పుడు నిర్లిప్తతతో కృంగి పోకుండా తనకు తానుగా వద్దని అనుకోవడం.
ఇదండీ! "అభావ విరక్తి" అంటే... దీనిలో అంతర్లీనంగా సర్దుకుపోవడం,రాజీపడటం కనిపిస్తుంది కానీ దానివల్ల ఎలాంటి మానసిక క్షోభ వుండదు.కాబట్టి మనవల్ల కాని వాటి పట్ల "అభావ విరక్తి" కలిగి వుండటం మంచిదేగా!.మరి మీరు ఏమంటారు?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు