సమాజసేవ;- సి.హెచ్.ప్రతాప్


 జీవితం లో మన స్థానం ఎంత ఉన్నతమైనప్పటికీ మనం మన తోటి సమాజస్థులకు సేవకుడినని మాత్రం దృక్పధం అలవరచుకోవడం ఎంతో అవసరం. భగవంతుడు మనలను ఉన్నత స్థానాలకు చేర్చినది మన కంటె తక్కువ స్థాయిలలో ఉన్నవారికి. అభాగ్యులకు, అవసరార్ధులను ఆదుకోవడం కోసమే. మన తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, అదృష్టం మనల్ని ఉన్నత శికరాలను అధిరోహింపజేసాయనుకోవడం అహంకారకేతువు.అవి కేవలం భగవంతును ప్రసాదం మాత్రమే.ప్రమోషన్లు , ఉన్నత పదవులు సమాజ సేవ, దురదృష్టవంతులకు సేవ చేసుకునే చక్కన అవకాశం. అణుకువ, వినయం, ప్రేమ, కరుణా హృదయం అలవరచుకోవడం ఎంతో ముఖ్యం, మౌనంగానే ఎదగమని మొక్క నీకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది అని ఒక కవి ఎంత అద్భుతం గా చెప్పారో మరి !అందరూ గొప్పవారు కావచ్చు. ఎందుకంటే ఎవరైనా సేవ చేయవచ్చు. సేవ చేయడానికి కళాశాల డిగ్రీని అవసరం లేదు.  సేవ చేయడానికి భౌతిక శాస్త్రంలో థర్మోడైనమిక్స్ , రెండవ సిద్ధాంతాన్ని తెలుసుకోవలసిన అవసరం లేదు. దయతో నిండిన హృదయం మాత్రమే అవసరం.అన్ని రకాలుగా అన్ని  కోణాల్లో ఈ సమాజానికి మనమెంతో సేవ చేయవలసి ఉంది. ఈ బాధ్యత మనం కొత్తగా తెచ్చిపెట్టుకోవలసినది కాదు. బరువుగా నెత్తికెత్తుకోవలసినది కాదు. జన్మతః వచ్చిన వారసత్వం. గౌరవంగా స్వీకరించ వలసిన కర్తవ్యం. ఈ కర్తవ్యం నెరవేర్చడానికి మనం పురుషులమా, స్త్రీలమా అనేది ప్రశ్నే కాదు. ధనికులమా, పేదలమా? బలాఢ్యులమా, బలహీనులమా? అన్న ప్రసక్తే లేదు. మనం మనుషులం, ఈ దేశ పౌరులం. అంతే! ఈ దేశం మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందడుగేయాలి .చెరువు కానీ, సరస్సు కానీ, బావి కానీ, కాలువ అయినా సరే తవ్విస్తే అమితమైన పుణ్యఫలాలు దక్కుతాయంటోంది నారద పురాణం. స్వయంగా నిర్మించినా, లేదంటే ఇంకొకరు నిర్మించేటప్పుడు అందుకు సహకరించినా, తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నవారంతా లక్ష కోట్ల తరాల వరకూ, మూడు కల్పాల కాలం వరకూ విష్ణులోకంలో నివసించొచ్చు. చెట్లు పెంచితే దివ్యదేహాన్ని ధరించి ఉత్తమ విమానాన్ని అధిరోహించి, మూడు కల్పాల పాటు విష్ణులోకంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.స్వప్రయోజనం ప్రజా సేవను అధిగమించినప్పుడు, సమాజం అవినీతి భారంతో కుప్పకూలిపోతుంది.భారతదేశం యొక్క ఖ్యాతిని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంతో పాటు పాశ్చాత్య దేశాల్లో కూడా తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు. యువతకు స్ఫూర్తిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచారు.జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు.. కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే అని గొప్పగా ఆయన చెప్పారు.  


కామెంట్‌లు