సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -375
అగ్ని వమ్రి న్యాయము
     *****
అగ్ని అంటే నిప్పు,అగ్గి. వమ్రి అంటే చెదలు,వమ్రిక,చెట్టు మీద వుండు నల్ల చీమ అనే అర్థాలు ఉన్నాయి.
"అగ్ని వమ్రి అనగా నిప్పుకు చెదలు "పట్టునా?" అని అర్థము
 
 నిజమే కదా ! నిప్పుకు  ఎలా చెదలు పడుతుంది? నిప్పు గుణమే కాల్చడం. అది నీళ్ళను  మరగ బెడుతుంది. అన్నం,కూరలను ఉడికేలా చేస్తుంది. అలాంటి నిప్పుకు చెదలు పట్టడం అనేది అసంభవం అని అర్థము.
మరి అలాంటి అగ్ని గురించి కొన్ని విశేషాలూ, విషయాలను తెలుసుకుందాం.
పంచ భూతాలలో అగ్ని ఒకటి.అగ్ని లేదా నిప్పు అనేది ఒక పదార్థం (ఇంధనం) యొక్క వేగవంతమైన ఆక్సీకరణం.ఇది సాధారణంగా  వేడి మరియు కాంతిని కలిగి మంటతో కలిసి వుంటుంది.మంట అనేది అగ్ని యొక్క కనిపించే భాగం.అగ్నిని ఒక రసాయనిక  ప్రక్రియ అని చెప్పవచ్చు.అగ్ని వల్ల పదార్థాలు,వస్తువులు  కాలిపోతాయి.ఇలా అగ్నికి దహించే గుణం వుంది.
నాలుగు శాస్త్రీయ అంశాలలో అగ్నిని ఒకటిగా చెబుతారు.అగ్నికి సంబంధించి ఓ శాస్త్రం కూడా వుంది.ఫైర్ సైన్స్ అనేది భౌతిక శాస్త్రం యొక్క ఒక విభాగం.ఇందులో అగ్ని యొక్క ప్రవర్తన గురించి వివరణాత్మక సమాచారం వుంది.
ఇలా అగ్ని లేదా నిప్పు దేన్నైనా కాలుస్తుంది.తాకితే కాలుతుంది అని తెలుసు.మరి అలాంటి అగ్నికి చెదలు పట్టడం అసంభవం కదా!
 మరి ఈ సామెతను మన పెద్దవాళ్ళు ఎందుకు సృష్టించి వుంటారు?ఇలా వారు సృష్టించిన ,నిత్య జీవితంలో ఉపయోగించిన ప్రతి సామెత వెనుక ఏదో ఒక అర్థం, పరమార్థం తప్పకుండా వుంటుందని  మనకు తెలిసిందే. అదేమిటో చూద్దామా!.
 ఇక్కడ అగ్నికి చెదలు పట్టడం ఎలా అసాధ్యమో, అగ్ని లాంటి మనిషికి కూడా ఎలాంటి దుర్గుణాల్లాంటి చెదలు పట్టవు.అంటుకోవు.అగ్ని తన ధర్మాన్ని ఎలా మార్చుకోదో అలా అగ్ని లాంటి వ్యక్తి కూడా తన ధర్మాన్ని  ఎప్పుడూ మార్చుకోడని అర్థము.
దీనికి సంబంధించి భగవద్గీతలోని నాల్గవ అధ్యాయంలో ఉన్న ఓ శ్లోకాన్ని చూద్దామా...
"సర్వానీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే; ఆత్మ సామ్య యోగాగ్నౌ జుహ్వతీ జ్ఞాన దీపితే!"
అనగా తెలివి యొక్క యోగా ద్వారా స్వీయ నియంత్రణ సాధన వైపు మొగ్గు చూపే ఇతరులు, నియంత్రిత యొక్క అగ్నిలో వారి అన్ని ఇంద్రియాల విధులను మరియు వారి జీవిత శక్తి యొక్క విధులను నిర్వహిస్తారు అని అర్థము.
   ఇలా ఓ మంచి మనిషి ఎల్లప్పుడూ  తనదైన నియంత్రణలో ఉంటాడు. అలాంటి  మనిషిని,ధర్మబద్ధంగా జీవిస్తూ వున్న  వ్యక్తిని గురించి ఎవరైనా అవాకులు చవాకులు పేలితే, పుకార్లు పుట్టించిన సందర్భాల్లో ఆ వ్యక్తి  గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఈ సామెతను వాడుతుంటారు. అంత మంచి వ్యక్తి గురించి అలా అనడానికి నోరెలా వచ్చింది? "నిప్పుకు ఎక్కడైనా, ఎప్పుడైనా చెదలు పడుతుందా? అంటారు .
అంటే అవినీతి, అక్రమాలకు దూరంగా నియమ బద్ధంగా బ్రతికే ఓ నిఖార్సయిన వ్యక్తిని గురించి చెప్పే సామెత లేదా న్యాయమే "అగ్ని వమ్రి న్యాయము".
 ఈ న్యాయము ద్వారా మనం  నేర్చుకోవలసింది ఎంతో వుంది.ఎన్ని కష్టాలు, నష్టాలు, విపరీత పరిస్థితులు,పరిణామాలు రానీ ధర్మం తప్పకుండా జీవించడం. మన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులతో "నిప్పుకు చెదలు పట్టనట్లే" మన వ్యక్తిత్వానికి ఎలాంటి చెదలు పట్టదని అగ్ని వమ్రి న్యాయమునకు అసలు సిసలైన ఉదాహరణ మనమేనని చెప్పే విధంగా జీవితాన్ని గడుపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు