శ్రీ శిరిడీసాయి లీలావైభవం; - సి.హెచ్.ప్రతాప్

 ఒక సంధర్భంలో నానా సాహెబ్ డెంగలే అను భక్తుడు నాలుగు మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడుకోవడానికని తీసుకు వచ్చాడు.ఆ బల్లను నేలపై వేసుకొని బాబా దానిపై పడుకొని , తనను ఆశీర్వదించాలన్నది డెంగలే కోరిక.అయితే అందుకు భిన్నంగా బాబా ఆ బల్లను నాలుగు చింకి గుడ్డ పీలికలతో మశీదు దూలానికి ఉయ్యాలవలే వేలాడదీసారు.అంతే కాక, రాత్రిళ్ళు ఆ బల్లపై పడుకోవడం ప్రారంభించారు. ఆ గుడ్డ పీలికలు చిరిగిపోయిన స్థితిలో వుండి బల్ల బరువును మోయడమే గగనం. అందునా ఆజానుబాహుడైన బాబా యొక్క బరువును మోయడం దాదాపు అసాధ్యం. కాని తన యోగ శక్తితో అసాధ్యాలను సాధ్యాలుగా చేసే శ్రీ సాయి అ బల్లకు నాలుగు వైపులా ప్రమిదలలో దీపాలను వెలిగించి హాయిగా నిద్రపోయేవారు. అది చూసిన వారందరూ ముక్కున వేలేసుకున్నారు. అంత ఎత్తులో వున్న ఆ బల్లపై పడుకోవడానికి బాబా ఏ నిచ్చెననూ ఉపయోగించేవారు కాదు. ఎలా ఎక్కేవారు, ఎలా దిగేవారో ఎవ్వరికి అర్ధమయ్యేది కాదు.ఈ చర్య వెనుక వున్న మర్మం కనిపెట్టాలని ఎందరో దొంగతనంగా కాచుకు కూర్చునేవారు కాని ఎవ్వరికీ ఈ రహస్యం తెలియలేదు, బాబా కూడా తన సన్నిహితులకు సైతం తెలియనివ్వలేదు. రాను రాను ఈ వింత చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడి వుండడం చూసిన బాబా విసుగు చెంది ఆ బల్లని విరిచి బయట పారవేసారు. హేమాద్పంతు శ్రీ సాయి సచ్చరిత్రలో వ్రాసినట్లుగా అష్ట సిద్దులన్నీ బాబా వారి ఆధీనంలో వుండేవి. వాటిని సాధించుటకు బాబా ఏనాడు ఏ రకమైన అభ్యాసములను చెయ్యలేదు. వారు పరిపూర్ణ భగవత్స్వరూపులు గనుక అవి సహజంగానే బాబాకు సిద్ధించాయి. మహనీయులైన శ్రీ ఆనంద సాయి స్వామి ఒకానొక ప్రవచనంలో బాబా యొక్క లీలలన్నింటిలో కెల్లా ఈ శయన లీల బహు గొప్పదని, ఈ లీలను ఒకే ఆసనంపై కూర్చోని పదకొండు సార్లు పారాయణ చేసిన శ్రీ సాయి కరుణా కటాక్షములకు పాత్రులమై బ్రహ్మ జ్ఞానం శ్రీఘ్రమే సిద్ధిస్తుందని తెలియజేసారు
కామెంట్‌లు