సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -383
అంధకవర్తకీయ/అంధ చటక న్యాయము
*****
అంధ అంటే గుడ్డియగు, చీకటి, నీరు, కళ్ళు లేని వ్యక్తి. వర్తకము అంటే వణిగ్వ్యాపారము,వెలిచె పిట్ట, గుఱ్ఱపు గొరిసె అనే అర్థాలు ఉన్నాయి.చటక అనగా పిచ్చుక.
కళ్ళు లేని వ్యక్తి చేతికి పిచ్చుక చిక్కినట్లు అని అర్థము.
 ఒకానొక కళ్ళు లేని వ్యక్తి దారిలో వెళ్తూ వుంటాడు.మరి అతడికి దారి కనిపించదు.తనకు అడ్డంగా వచ్చిన వాళ్ళను వెంటనే తప్పుకోలేడు కాబట్టి  చప్పట్లు కొడుతూ వెళ్తుంటాడు.చప్పట్లు ఎందుకంటే తెలుసు కదా!ఆ శబ్దానికి తనకు అడ్డంగా వచ్చే వాళ్ళు నడకకు యిబ్బంది లేకుండా తప్పుకుంటారనే ఉద్దేశం.అలా  రెండు అరచేతులు కలిపి చప్పుడు చేస్తూ వెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తో, ఈ వ్యక్తి యొక్క అదృష్టవశాత్తో అతని చేతులకు  ఓ పిచ్చుక చిక్కుతుంది.
 అయితే దారిన పోయే కొందరు అది చూసి కళ్ళు లేని వాడైనా పిచ్చుకను భలేగా పట్టుకున్నాడే అనుకుంటూ వుంటారు.
 అలా అనుకోవడంలో ఆ కొందరిలో ఎలాంటి తార్కిక దృష్టి లేదన్న మాట.అంధుడైన వ్యక్తి ఎలా పట్టుకోగలిగాడు? అనే ఆలోచన లేకుండా  అది ఆ వ్యక్తి ప్రజ్ఞ అనుకోవడం వాళ్ళ వివేక శూన్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది.ఇలా  అనుకున్న వాళ్ళ అవివేకాన్ని కూడా తెలియజేస్తుంది.
అయితే  దీనినే నిత్య జీవితంలో కొన్ని విషయాలతోనో, సంఘటనలతోనో పోల్చి చూసినప్పుడు...
కొంతమంది ఎలాంటి ప్రతిభ లేని వ్యక్తులు,ప్రజ్ఞా హీనులు అప్పుడప్పుడు కొన్ని  కార్యాలు సాధిస్తుంటారు.అప్రయత్నంగా లాభ పడుతూ వుంటారు.
ఉదాహరణకు ఎం సెట్ లాంటి పోటీ పరీక్షలను నిర్థారిత సమయంలో రాయాల్సి ఉంటుంది.అలా రాసే క్రమంలో  ఎంత ప్రతిభ ఉన్న వ్యక్తి అయినా  సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేక పోతే అనుకున్న ర్యాంకు సాధించలేక పోతాడు.  సామాన్య ప్రతిభ వున్న వ్యక్తి ఆ సమయంలో తనకు తోచినట్లు ఊహించి జవాబులతో నింపడం. యాదృచ్ఛికంగా అవి సరిగా వుండి బాగా ప్రతిభ ఉన్న వ్యక్తి కంటే మంచి ర్యాంకు పొందడం జరుగుతుంది. అలా అప్పటి వరకు మామూలు చదువరి అయిన వ్యక్తి అకస్మాత్తుగా ఆకాశానికి ఎత్తివేయబడతాడు.
 నిజంగా అది అతని సామర్థ్యమా? ప్రతిభనా?కాదు కదా! అలాంటి సందర్భాల్లో మన పెద్దలు ఈ "అంధకవర్తకీయ/అంధ చటక"న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇలాంటి విషయానికి సంబంధించి ఓ సరదా ఉదాహరణ చూద్దాం.
 
ఒకానొక చెరువు గట్టు దగ్గర చాలా మంది గుమిగూడి వుంటారు . కారణం ఆ చెరువులో ఓ వ్యక్తి పడిపోయి రక్షించమని మునకలు వేస్తూ అరుస్తుంటాడు.అదంతా తెలియని ఓ  వ్యక్తి అక్కడికి వెళ్ళి తాను కూడా చెరువులోకి తొంగి చూస్తుంటాడు.అలా చూసేవాళ్ళ తోపులాటలో అప్పుడే వెళ్లి  చూస్తున్న వ్యక్తి అందులో పడిపోతాడు.అందులో మునిగి పోయే వ్యక్తి చేతికి  దొరుకుతాడు.తనను రక్షించడానికి వచ్చాడని అతడూ, తన్ను తాను రక్షించుకోవడానికి ఇతడూ .. మొత్తానికి ఎలాగైతేనేం ఇద్దరూ చెరువులోంచి బయటికి వస్తారు.
అప్పటి వరకూ చోద్యం చూస్తున్న వారందరి దృష్టిలో ఈ విధంగా రక్షించిన వ్యక్తి ఓ హీరో అయి పోతాడు.
అసలు కారణం అది కాదు కదా! తాను అందులో పడిపోవడంతో తనను తాను రక్షించుకునే క్రమంలో  మాత్రమే అలా జరిగింది.అంతే కానీ ఆ వ్యక్తి లోని మానవత్వమో,సాటివ్యక్తిని కాపాడాలనే గుణం మాత్రం కాదు.
ఇలా కొన్ని సంఘటనలు  సామాన్యులను కూడా అందలమెక్కిస్తాయి.అందరిలో గుర్తింపు తెస్తాయి.ఇలాంటివి అనుకోకుండా వచ్చే అదృష్టాలు అన్నమాట.అందుకే కొందరు ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని "కోతికైనా గీత సక్కంగుంటే చాలు.అన్నీ భోగాలే" అంటుంటారు.
ఇంతెందుకండీ ఈమధ్య ప్రసార మాధ్యమాల్లో కుక్కలకు భోగి పళ్ళు, పుట్టినరోజులు, శ్రీమంతురాలు చేయడం చూస్తున్నాంగా... అవన్నీ వాటికి అనుకోకుండా వచ్చిన అదృష్టాలే కదా!
 ఇవండీ! అంధకవర్తకీయ/ అంధ చటక  న్యాయములోని సరదా విశేషాలు, విషయాలు.
 అలా యాదృచ్ఛికంగా వచ్చిన అదృష్టాన్ని  సద్వినియోగం చేసుకొంటే భవిష్యత్తులో అతనికి మంచి జరుగుతుంది. లేదా 'నడమంత్రపు సిరి,నరం మీద పుండులా'  విమర్శల పాలవుతారు.
ఏది ఏమైనా మనం స్వయం కృషితో ప్రతిభను, ప్రజ్ఞను పెంచుకుందాం. సొక్కం బంగారంగా ప్రకాశిద్దాం.అంతే కదండీ!
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు