శ్రీరామనామ విశిష్టత- సి.హెచ్.ప్రతాప్

 రామ" అంటే రమించుట అని అర్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలంలో వెలుగొందుతున్న ఆ ‘శ్రీరాముని’ తెలుసుకొనడానికి ప్రయత్నిస్తుండాలి.మనం శ్రీరామ నామాన్ని ఉచ్ఛరించేటపుడు ‘రా’ అనగానే మన నోరు తెరుచుకుని, మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామ నామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయని శాస్త్య్రం చెబుతోంది. అలాగే ‘మ’ అనే అక్షరం ఉచ్ఛరించినపుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవని, అందువల్లనే మానవులకు ‘రామ నామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని శాస్త్ర వాక్యం.ఏడాదంతా రామ నామాన్ని జపించలేని వారు కూడా రామ నవమి రోజుల్లోనైనా మనసారా ‘రామ’ నామాన్ని జపించి పుణ్యం పొందవచ్చు. అందునా ‘రామ’ అని పలకడం చాలా సరళం. ఈ సూక్ష్మ మంత్రం అందించే శక్తి అంతా ఇంతా కాదు.రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.
ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకొని నిరంతరం జపించడం ఎంతో అవసరం.శ్రీ రామచంద్రమూర్తి రామాయణ కథానాయకుడు, ఎట్టి పరిస్థితుల్లో ధర్మానికి కట్టుబడే ధర్మ రక్షకుడు, పురుషులలో సర్వోన్నత గుణాలు కలిగిన పురుషోత్తముడు. ఇలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షాత్ భగవంతుని స్వరూపాలే, అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు.రామ అనే పేరు సంస్కృత మూలం రామ్ నుండి వచ్చింది, ఈ పదానికి ప్రశాంతత, విశ్రాంతి, ఆనందం, సంతోషపరచడం' ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా సంతోషపెట్టువాడు, ఆనందకారకుడు, ప్రశాంత వదనుడు, ప్రకాశవంతుడు రాముడు అవుతాడు.రామా అనే నామంలో ఎంతో పరమార్థముందని పండితులు పేర్కొన్నారు. రామా (ర ఆ మా) నామంలో ర అక్షరం రుద్రుని, అ అక్షరం బ్రహ్మను, మ అక్షరం విష్ణువునీ సూచిస్తుందని, అనగా రామనామం త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమని మహ ర్షులు పేర్కొన్నారు.

కామెంట్‌లు