నిష్కృతి లేని పాపాలు- సి.హెచ్.ప్రతాప్
 నామ స్మరణ  ప్రాశస్థ్యం అత్యద్భుతం.
పాతకములు అంటే నిష్కృతి లేని గొప్ప పాపాలు, దుష్కర్మలు.
కావాలని కాక పోయినా , పొరపాటుగా నైనా తాను అనక పోయినా, ఎవరైనా అంటుంటే భగవంతుని నామం విన్నా సరే నరక బాధలు తొలగి ముక్తి లభిస్తుందిట. మరి, ఇష్టంతో త్రికరణశుద్ధితో నామజపం చేస్తూ, వింటూ ఉంటే ఫలితం ఎంత ఉంటుందో దీనిని బట్టి ఊహించ వచ్చును.
కష్టాల కల్లోలం చుట్టుముట్టినప్పుడు భగవంతుడు జ్ఞప్తికి వచ్చుట తీవ్రమైన వేదనతో కష్ట నష్టములను దూరమొనర్చమని కోరికల మూటతో ప్రార్ధన గావించడం, అనంతరం భగవంతుడిని మరచుట మానవ నైజం. సుఖముల పానుపుపై తేలియాడే సమయమందు భగవంతుడిని జ్ఞప్తికి చేసుకోవడం బహు అరుదైన విషయం. స్వార్ధపు చింతనతో కోర్కెల మూటతో చేయు ప్రార్ధనలు ఆ సర్వేశ్వరుడిని చేరలేవు. చిత్త శుద్ధి లేని శివ పూజ ఫలించదు. భగవంతుడిని కష్ట నష్టములను తీర్చెడి యంత్రము వలే భావించే నేటి తరం మానవునికి భక్తి, ముక్తి, మోక్షం అసాధ్యం. అనుక్షణం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన అనుగ్రహ ఫలం వర్షించని క్షణం వ్యర్ధమని తలుస్తూ కష్ట సుఖములను ఆయన పవిత్ర ప్రసాదము గా భావించి ఆనందం గా యధాతధముగా స్వీకరించడమే నిస్వార్ధ , నిష్కల్మష భక్తుల తత్వం, రక్తి, విరక్తి అను నవి భక్తికి కారణములే. సుఖములలో మునిగి భగవంతుడిని విస్మరించుట , కష్టములు ఎదురైనప్పుడు నిందించుట కూడని పనులు. ఈ పాపములకెన్నడూ నిష్కృతి లేదు.
నమకం చమకం లో రౌద్రీ అనే ఒక విధానం వుంది.నమకం ఒక సారి చెపుతూ ఒక్కొక్క చమకానువాకం చెప్పి అలా పదకొండు సార్లు నమకంతో ఒక చమకం పూర్తి చేయడాన్ని రౌద్రీ (ఏదాశ రుద్రం) అంటారు. ఫలం అనేక జన్మలలో చేసిన పాపం ఆరు నెలల్లో నశిస్తాయి.
అట్లే అతి రుద్రం అంటే 14641 సార్లు నమకం 1331 సార్లు చమకం ఆవృత్తం చేసిన అతి రుద్రం అంటారు. అనగా 11 మహా రుద్రాలు చేయడమనమాట. 1331×11= 14,641. ఫలం నిష్కృతి లేని మహా పాప,అతిపాతక, ఉపపాతకములకు ఇదే శరణ్యం. 

కామెంట్‌లు