కవిగారి సృజన;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మేఘాలను పట్టుకొని
రెండుచేతులతో పిండి
చిటపట చినుకులుచల్లి
కవితాగానం వినిపిస్తాడు కవి

ఇంద్రధనస్సు దగ్గరకెళ్ళి
రంగులను ప్రోగుచేసుకొని
తోటలోనిపూలకు పూసి
అందాలకైతలు చూపిస్తాడు కవి

తారకలను ఏరుకొని
బుట్టలో తీసుకొచ్చి
అక్షరాలకు అద్ది
కైతలను తళతళలాడిస్తాడు కవి

జాబిలికడకు ఎగిరిపోయి
పిండివెన్నెలను పట్టుకొని
పదాలమీద చల్లి
కవనాలను వెలిగిస్తాడు కవి

ఉదయాన్నె మేలుకొని
తూర్పుదిక్కునకు ఏగి
విషయాలపై కిరణాలుచల్లి
కవితోదయం చేస్తాడు కవి

నీలాకాశాన్ని చూచి
అందాలను క్రోలి
ఆనందంలో మునిగి
అద్భుతకవనం కూర్చుతాడు కవి

ఆకాశమంత ఎత్తుకి
సాహిత్యాన్ని తీసుకెళ్ళి
పాఠకులను మురిపించి
పరవశపరుస్తాడు కవి

కవుల మేధోశక్తికి
వందనాలు
భావకవితల సృష్టికి
అభివందనాలు


కామెంట్‌లు