సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -391
అశ్వత్థ పత్ర న్యాయము
******
అశ్వత్థము అనగా రావి చెట్టు. పత్రము అనగా ఆకు.
అశ్వత్థ పత్రము గాలి వున్నా లేకున్నా దాని చివర కదులుతూనే వుంటుంది అని అర్థము
అశ్వ అనగా అనిత్యమైనది, పరివర్తన చెందుతుంది.అలాగే ఈ బ్రహ్మాండం కూడా క్షణ క్షణం మారుతూనే వుంటుంది.అలాగే రావి చెట్టు యొక్క ఆకులు చంచలం.గాలి వీచకున్నా ఆకు చివరి భాగం కదులుతూనే వుంటుంది.
మరి ఈ అశ్వత్థ పత్రము,వృక్షము గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్పాడో ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం.
శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వ మూల మధః శాఖమ్, అశ్వత్థం ప్రాహురవ్యయమ్!ఛన్దాంసి యస్య పర్ణాని,యస్తం వేద సవేదవిత్!!
 శ్రీ భగవానుడు పలికెను - ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా,బ్రహ్మయే ముఖ్య శాఖగా ( కాండముగా), వేదములే పర్ణములు ( ఆకులు) గా ఈ సంసార రూపం - అశ్వత్థ వృక్షము నాశరహితమైనది (శాశ్వతమైనది).ఈ సంసార వృక్ష తత్త్వమును మూల సహితముగా తెలిసిన వాడు నిజముగా వేదార్థములను ఎరిగిన వాడు అని భావము.
దీనినే సరళమైన భాషలో చెప్పాలంటే….
శ్రీకృష్ణుడు  ఈ విశ్వము యొక్క స్వరూపాన్ని రావిచెట్టుతో పోల్చి  చెప్పాడు.చెట్టుకు వేర్లు అతి ముఖ్యం కాబట్టి వాటిని ఉచ్ఛ స్థానములో అనగా పైకి ఉన్నట్లు, కొమ్మలు,ఆకులేమో క్రిందికి వున్నట్లు వర్ణించారు.అంటే మన దేహంలో  తలపై భాగంలో వుంటుంది.కాలో ,చెయ్యో తెగిపోయినా ,లేకపోయినా బతకవచ్చు కానీ,తల తెగిపోతే బ్రతికే ఆస్కారం లేదని అంటారు.అవును కదా!
మరి  శ్రీకృష్ణ భగవానుడు చెట్టునే ఉదాహరణగా తీసుకుని అందులోనూ రావి చెట్టునే ఎందుకు ఉపమానంగా తీసుకున్నారో చూద్దాం.
చెట్లన్నింటిలో రావి చెట్టుకో  ప్రత్యేకత.అది అత్యంత చంచలమైనది.ఎందుకంటే గాలి వీచడం పూర్తిగా స్తంభించినా రావిచెట్టు ఆకు మాత్రం కదులుతూనే వుంటుంది.ఈ ప్రపంచం యొక్క మూల రూపం చెట్టు యొక్క మూలం అనుకుంటే అనంతమైన  జ్ఞానాన్ని చెట్టు యొక్క ఆకులతో పోల్చడం జరిగింది.చంచలమైన జ్ఞానాన్ని ఎంత సంపాదించినా మూల జ్ఞానాన్ని తెలుసుకున్న వారే అసలైన జ్ఞానులు అని చెప్పారు.
 దీనిని మనకూ అన్వయించుకోవచ్చు. మన దేహాన్ని రావిచెట్టుతో పోల్చుకుంటే మనసులోని ఆలోచనలను రావి ఆకులతో పోల్చవచ్చు. అవి క్షణం కూడా ఆగకుండా చలిస్తూనే వుంటాయి.చంచలమైన ఆలోచనలకు మూలమైన దేహ జ్ఞానం అంటే మన పుట్టుక దాని అర్థం, పరమార్థం తెలుసుకోవాలి.
 ఎలాగూ రావి ఆకు చంచలత్వం గురించి తెలుసుకున్నాం కాబట్టి రావి చెట్టుకు సంబంధించిన కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
 ఆధ్యాత్మికంగా  రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.హిందువులు, బౌద్ధులు రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టునే బోధి వృక్షం అంటారు. ఈ బోధి వృక్షం క్రిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది.
ఇక  ఆయుర్వేదం పరంగా  కూడా రావిచెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది.అనేక రోగాలను నయం చేసే శక్తి రావి ఆకులకు వుంది.ఆస్తమా, చర్మవ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, పాము కాటు మొదలైన సమస్యలను నివారించేందుకు మందుగా ఉపయోగపడుతుంది.
ఈవిధంగా అశ్వత్థ పత్రము,అశ్వత్థ వృక్షము గురించి అనేక విషయాలు విశేషాలు తెలుసుకున్నాం కదా! అశ్వత్థ పత్రమును  చైతన్యానికి ప్రతీకగా కూడా చెప్పుకోవచ్చు.
క్షణమైనా ఆగకుండా రావి ఆకులా చైతన్యాన్ని కలిగివుందాం.కానీ వివిధ రకాలైన ఆలోచనలతో చలించే మనసును మాత్రం అదుపులో పెట్టుకుందాం.అంతే కదండీ.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు