సుప్రభాత కవిత ; - బృంద
హేమంతపు  సాయంత్రాలు
కురిసే సన్నని హిమపాతాలు
మంచు ముసుగున దాగి
వణికి పోతున్న  భూతాపాలు

తొలికిరణపు రాకతో
నులివెచ్చని తాకిడికి
కరిగి నీరై జారిపోయి
కలగ మిగిలిపోయే తీరు

కరడు కట్టిన కలతలైనా
కాలంతో పాటు కరిగి
కలవన్నవి కలవో లేవో అనిపించి
కలవరం లేక కరిగిపోవు కలగా

చలి ఎండల చురుకులు
సన్నగ సాగే ఎద సవ్వడికి
సత్తువగా మారి మరల
కొత్తఊపిరి పోసి బ్రతుకునిచ్చు

వినువీధిని ఇనుడి రాక
తొలగించే హిమపు తెర
కురిపించే వెలుగుల ఝరి
మరిపించే మంచుల ఉరి

ప్రభాతవేళ ప్రభాసమానమై
ప్రభాకరుడు  ప్రభవించగా
ప్రత్యక్ష దేవుని ప్రబలమైన
ప్రసాదముగా ప్రవేశించె శక్తి

మంచుదారుల సాగే పాదాలకు
తోడుగా ప్రసరించు వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు