సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -381
అభ్ర మయూర న్యాయము
*****
అభ్రము అంటే మేఘము,వాయు మండలము, ఆకాశము అనే అర్థాలు ఉన్నాయి. మయూరము అనగా నెమలి,ఒక కవి,ఉత్త రేణు అనే అర్థాలు ఉన్నాయి.
మేఘాలను చూస్తే నెమలికి సంతోషం కలుగుతుంది.
ఆకాశం మేఘావృతమైనప్పుడు పరవశించి నాట్యం చేసే ఒకే ఒక పక్షి నెమలి.మరి ఆ నెమలి గురించి ఓ నాలుగు విశేషాలు తెలుసుకుందామా...
 నెమలి మన జాతీయ పక్షి అన్న విషయం మనందరికీ తెలిసిందే.1963 జనవరి 31న మన దేశం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది.
"నెమలికి నేర్పిన నడకలివీ" అనీ, "ఆడవే నటన మాడవే మయూరీ " అని, నీలి మబ్బు నీడ లేచి నెమలి ఆడె" అనే పాటలు , నాట్య మయూరి అనే బిరుదు... ఇవన్నీ వింటుంటే  'ఓహ్! నెమలి ఎంత గొప్ప నాట్య కత్తె అని స్త్రీ వాచకంలో అనుకుంటాం. కానీ అంత గొప్పగా నాట్యం చేసేది ఆడ నెమలి కాదు మగ నెమలి. దీనిని మయూరం అని పిలుస్తారు.
ఈ మగ నెమలికి పొడవైన మెడ,తలపైన హుందాగా కనిపించే కిరీటం,నీలం రంగు గల దేహం, పెద్ద పెద్ద కన్నులు కలిగిన పొడవైన అందమైన ఈకలు కలిగిన తోక వుంటుంది.శ్రీకృష్ణుని శిరస్సును చేరడంతో నెమలి ఈకకు ప్రత్యేకమైన హోదా గుర్తింపు లభించింది.ఈ నెమలి శివుని కుమారుడైన కుమారస్వామి వాహనం కూడా. నెమలి చూడటానికి రాజసానికి,దర్పానికి గుర్తుగా కనిపిస్తుంది.
 మగ నెమలికి అందమైన మెరిసే నీలం ఆకుపచ్చ రంగు పింఛం వుంటుంది.పొడవైన ఈకల చివర కన్నులు వుంటాయి. వాటినే చిన్నప్పుడు నెమలి కన్నులని పిలుస్తూ ఎంతో ఇష్టంగా పుస్తకాల్లో దాచుకునే వాళ్ళం. ఇప్పటికీ నెమలిని తలుచుకుంటే తీయని బాల్యం గుర్తు మనసు నిండా ఆక్రమిస్తుంది.
 మరలాంటి నెమలి నాట్యం అద్భుతంగా వుంటుంది.చూసేందుకు రెండు కళ్ళు చాలవు.నెమలి పింఛాలలో అద్భుతమైన రంగులకి కారణం ఈకల మీద పేర్చినట్టు వుండే సన్నని పీచు లాంటి పదార్థాలే.అది నాట్యం చేసేటప్పుడు దాని పింఛం వివిధ కోణాల్లో వివిధ రంగులుగా కనువిందు చేస్తుంది.
మగ నెమలి ఎంత అందంగా వుంటుందో దానికి పూర్తి వ్యతిరేకంగా ఆడ నెమలి వుంటుంది.ఇది ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులో మగ నెమలి కంటే చిన్నగా  తోక లేకుండా వుంటుంది.
ఇక నెమలికి పక్షి జాతిలో  యోగ విద్య తెలిసిన పక్షిగా పేరుందట.దీనికి "షట్చక్రాల కుండలినీ" పరిజ్ఞానం వుందని అంటుంటారు. ఈ నెమలితో పాటు యోగ విద్య, షట్చక్రాల కుండలినీ పరిజ్ఞానం ఉన్న పక్షులు రామ చిలుక,హంస, గ్రద్ద, పావురము. ఈ పక్షులు ఇతర పక్షులతో కలిసి పోయినంత  నెమలి కలవదు. చూడటానికి ఎంత అందంగా వుంటుందో, గొంతు విప్పితే మాత్రం కర్ణ కఠోరం. వినబుద్ధి కాదు.
 ఆకాశంలో మేఘాలు కమ్ముకోగానే మగ నెమలి  పురివిప్పి నాట్యం చేయడానికి గల కారణం ఏమిటో చూద్దాం.
ఇలా మగ నెమలి పురివిప్పి నాట్యం చేయడానికి కారణం ఆడ నెమలిని ఆకర్షించేందుకే.కొన్ని రకాల పక్షులు కేవలం కొన్ని ఋతువులు, ఆయా మాసాల్లోనే ప్రత్యుత్పత్తికి పూనుకుంటాయి.
ఆకాశం మేఘావృతమయ్యే వర్ష ఋతువులో నెమళ్ళు పరస్పర ఆకర్షణకు లోనవుతాయట. అందుకే కాబోలు  పురి విప్పి ఆడే నెమళ్ళను వర్ష ఋతువులోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా సర్వాంగ సుందరమైన ప్రణయ నృత్యంతో ఆడ నెమలిని ఆకర్షిస్తుందన్న మాట.
అయితే నెమళ్ళను అస్ఖలిత బ్రహ్మచారులు అంటారట.ఎందుకంటే వాటి వీర్యాన్ని ఊర్థ్వ ముఖంగా నడిపించి, కంటిలోని గ్రంధుల ద్వారా  బయటకు స్రవింపజేస్తాయట. ఆ సమయంలో ఒక రకమైన వాసనను చిమ్మి ఆడ నెమలిని ఆకర్షిస్తుందట.అలా ఆడ నెమలి మగ నెమలి కంటి నుండి పడిన చుక్కలను మింగటం వల్ల సంతానం కలుగుతుందని, ఇలా  సృష్టిలోనే పవిత్రమైన పక్షి  నెమలి అని పురాణాలలో చెప్పబడింది.
నక్షత్రాలు , సూర్య చంద్రులు,విశాల విశ్వానికి ప్రతినిధిగా, కరుణ ,సహానుభూతి, పరిశుద్ధాత్మకు సంకేతంగా నెమలిని భావిస్తారు. నెమలి పుట్టుకకు సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది.
 ఈ నెమలిని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల చిహ్నంగా కూడా పరిగణిస్తారు‌ ఊహలకు, సృజనాత్మకతకు, దివ్య దృష్టికి మాత్రమే కాకుండా శాశ్వతమైన ఆనందం మరియు స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు.వీటికి తుఫానులు,భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా అంచనా వేసే శక్తి  వుంటుందట. ముఖ్యంగా నెమళ్ళు  బృందంగా తిరుగుతూ వుంటాయి .
ఇలా నెమలి గురించి మనం చాలా విషయాలు విశేషాలు తెలుసుకున్నాం కదా!
 మరి మనం నెమలిలా హుందాతనం, రాజసం ఉట్టిపడేలా గౌరవంగా వుందాం.స్వచ్ఛతకు ప్రతీకగా జీవిద్దాం."అభ్ర మయూరి"లా ఆనంద నర్తనం చేద్దాం. మేఘాలను చూసి నెమళ్ళు సంతోష పడినట్లు, మనల్ని చూసి మన చుట్టూ వాళ్ళు ఆనంద పడే విధంగా   జీవనాన్ని కొనసాగిద్దాం.
ప్రభాత కిరణాల మనస్సులతో 🙏

కామెంట్‌లు