రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామాలాలి మేఘా శ్యామలాలి జోలపాడుతారు.
శ్లో: శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!!
రామ.. రెండక్షరాల ఈ పేరు ఎంతో మహిమాన్వితమైనది. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమశివాయ పంచాక్షరి నుంచి ‘మ’ అనే అక్షరాన్ని కలిపితే ‘రామా’. శివకేశవతత్వం ఇమిడివున్న ఈ నామం కన్నా అమృతం ఇంకొకటి వుండదంటే అతిశయోక్తి కాదు. రామనామాన్ని మించిన రక్ష ఏదీ. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటాం. తన రక్షణ కోరి వచ్చిన విభీషణుడిని చివరిదాకా కాపాడాడు శ్రీరాముడు. తన రక్షణలో వున్న పాండవులను అడుగడుగునా అపాయాల నుంచి సంరక్షించాడు శ్రీ కృష్ణుడు. అందుకే ఆ నారాయణుడిని మనస్పూర్తిగా శరణు వేడితే శరణ్యము, ఆశ్రయము, అభయం, శత్రువుల నుండి రక్షణ కవచం దొరుకుతాయి. శ్రీరామచంద్రుడు- పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది. అదే శ్రీరామచంద్రునిలోని గొప్పతనం. అందరినీ ఆనందపరిచేవాడే శ్రీరాముడు.శ్రీరాముడు మానవునికుండవలసిన గుణాలను కలిగి సమాజంలో మనిషి ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తి. పదహారు గుణాలు అనే పదహారు కళలతో శ్రీరామచంద్రమూర్తి అయినాడు. మర్యాదాపురుషోత్తముడుగా కీర్తిని పొందాడు.రావణ వధానంతరం విభీషండు నూతన వస్త్రాలను, ఆభరణాలను ధరించమని ప్రార్థిస్తే కైకేయి కుమారుడైన భరతుడు నా కోసం ఎదురుచూస్తుంటే అతనిని చూసి కలసిన తరువాతే నాకీ అలంకారాలు అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి