'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య


 నవసమాజ నిర్మాణంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పాటు పడ్డారని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లల చేత అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, సావిత్రిబాయి పూలే, ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి, భారతమాత, తెలంగాణ తల్లి వంటి వేషధారణలు వేయించి, గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తూ నినాదాలు చేశారు. 'విశాల భారతదేశం మనది' అంటూ  దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలకు తినుబండారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాల్యం నుంచి అనేక కష్టాలు పడి, ఉన్నత విద్యనభ్యసించి ప్రపంచ మేధావిగా పేరుగడించారన్నారు. అంబేద్కర్ కు పుస్తకాలంటే మిక్కిలి ఇష్టమని, తన జీవితకాలమంతా విరామం లేకుండా రాత్రింబగళ్లు వేలాది పుస్తకాలను చదివి, గొప్ప మేధావి అయ్యారని, సుమారుగా 14 డిగ్రీలు  పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పిల్లలందరూ కూడా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాగా చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈర్ల సమ్మయ్య ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన 'చినిగిన చొక్కయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో'  అనే నానుడిని పిల్లలకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు విజయలక్ష్మి, సమత, భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, గ్రామ యువకులు జగన్, హరీష్, సందీప్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు