సుప్రభాత కవిత ; - బృంద
కలలు కనులముందు
కరువుతీరా  కమ్మగా
కనువిందుగా కళకళ లాడుతూ
కమనీయంగా  కనిపిస్తే

పెదవి దాటని మాటలా
ఎదురు చూచిన  పిలుపులు
ఒదిగిన మనసులో
పొదుగుకున్న మధురభావనలు

నిశ్శబ్ద విస్ఫోటనంలా
మౌనమైన  సంతోషాలు
మది లోపలి పొరలలో
జరిగే కంపనాలతో

అవని అంబరానికి ఎగిరిందో
అంబరం అవనికి అందిందో
సంబరాన రంగులు విరజిమ్మగా
సంతసాన మానసం మునిగింది

పాల మబ్బులు పలకరించగా
పూల మొక్కలు పరవశించి
గాలికి సుగంధాల కానుకలిచ్చి
నీలి నింగిని కాస్త అందించమన్నట్టు

మధురముగా మారిన జగతిలో
కోరికలు తీరే తరుణం
చేరువ అవుతోందని
చెబుతున్న వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు