సుప్రభాత కవిత ; - బృంద
జ్ఞాపకాల గంధాలు
పూసుకుంటూ
మమతల మాలికలల్లుకుంటూ
తలపుల తలుపులు
తోసుకుంటూ

సత్యాలు కాని స్వప్నాలు
చూసుకుంటూ
తీరని కోరికల దాహానికి
మనసు తడి చేసుకుంటూ

మూగబోయిన మదిలోని
హృదయరాగాలు
గురుతొచ్చి ఎద గిచ్చి
చివ్వున కంట నీరు చిమ్ముతుంటే

అరచేయి నొక్కి అక్కర
చూపించి అండనే ఉండే
ప్రియనేస్తంలా

తలనిమిరి కళ్ళు తుడిచి
నేనున్నానని ప్రత్యేకంగా 
చెప్పని తండ్రిలా...

కాలంలా కలిసొచ్చి 
గాయం మాన్పించి
సాయం చేసే ఆత్మబంధువులా

దిక్కు తెలియని చీకట్లో
చిరుదీపం పట్టుకుని
వెంట వచ్చి దారి చూపు అపరిచితునిలా...

ఎదురొచ్చే ఎన్నో సమస్యలను
మౌనమైన నవ్వుతో
ఎదిరించే తెగువ ఇచ్చే ప్రేరణలా

ఇడుములన్నీ తొలగించి
ఇహము లోని బ్రతుకునంత
ఇంపుగా గడిపే వరమిచ్చే
ఇనుడికిదే మది పాడే

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు