సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -395
ఆదర్శ గజ న్యాయము
*****
ఆదర్శము అనగా అద్దము,,టీక,అనుకరింపదగిన పరమోత్కృష్టమైన స్థితి, వ్రాయబడిన దాని మాతృక, మాదిరి అనే అర్థాలు ఉన్నాయి.గజము అనగా ఏనుగు.
అద్దంలో పెద్ద ఏనుగు చిన్నదిగా కనబడినట్లు
 పెద్ద ఏనుగు అద్దంలో చిన్నగా కనిపిస్తుంది.అలాగని ఏనుగు రాజసం,ఠీవి, గొప్ప తనం ఏమాత్రం తగ్గదు కదా! అనే అర్థంతో ఈ "ఆదర్శ గజ న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
మనిషి యొక్క గొప్పతనం,ప్రతిభ కూడా అంతే .తనంత తానుగా చెప్పుకోలేక పోయినా,ఆ సందర్భంలో సరైన గుర్తింపు పొందక పోయినా అతనిలోని ప్రతిభకు వచ్చే నష్టమేమీ లేదు.
 దీనికి సమానమైన అర్థంతో కూడిన ప్రజాకవి వేమన రాసిన పద్యాన్ని చూద్దామా...
"అనువు గాని చోట నధికుల మనరాదు/ కొంచెముండుటెల్ల కొదువగాదు/కొండ యద్దమందు కొంచమై యుండదా?/ విశ్వదాభిరామ వినురవేమ "
 కొండ ఎంత పెద్దదైనా అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది.అంత మాత్రాన కొండ చిన్నదై పోదు.చిన్నది కాదు కదా! 
అలాగే మనకు తగని ప్రదేశంలో మనల్ని మనం గొప్పవారమని చెప్పుకోవడం మంచిది కాదు. మనకు గల గొప్పతనము, ఆధిక్యత ఆ ప్రాంతంలో ప్రదర్శించలేక పోయినంత మాత్రాన మన యొక్క ఔన్నత్యానికి, ప్రతిభకు, సామర్థ్యానికి ఎలాంటి భంగము కలగదు.మనంతట మనం చెప్పుకోలేక పోయినంత మాత్రాన మనకున్న ఘనత తగ్గిపోదని భావము.
ప్రతిభ సహజంగా వస్తుంది.అది అప్రయత్నంగా ఉద్భవించే అంతర్గత నాణ్యత.ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా,గుర్తించినా,గుర్తించక పోయినా పూలలోని సుగంధములా  ఏ మాత్రం తగ్గదు.ఎప్పటికైనా బయటపడక మానదు.
ఈ న్యాయానికి దగ్గరగా ఉన్న భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని కూడా చూద్దాం.
"నడవక చిక్కి లేమియగునాడు నిజొదర పోషణార్థమై/యడగి భుజించుటల్ నరులకారము వ్యంగ్యము కాదు పాండవుల్/గడు బలశాలులేవురు నఖండవిభూతి దొలంగి భైక్యముల్/ గడువరె యేకచక్రపురి గుంతియు దారొక చోట భాస్కరా!"
ఎంతటి బలవంతులైనను కాని కాలము కలిసి రానప్పుడు పాండవుల వలె యాచించడంలో తప్పు లేదు.అలా ఏకచక్రపురంలో కుంతి కుమారులు యాచించినంత మాత్రాన  వారిలోని శక్తి సామర్థ్యాలు  బయటపడకుండా ఉండలేదు కదా!
ఏకచక్రపురంలో  పాండవులు ఒక బ్రాహ్మణుల ఇంట్లో తలదాచుకుంటున్న సమయంలో బకాసురుడు అనే రాక్షసుడి గురించి తెలుస్తుంది.
తామున్న ఇంటి బ్రాహ్మణుని వంతు రావడం.ఇంటిల్లిపాదీ ఒకరికొరకు ఒకరు త్యాగం చేస్తూ ఆ రాక్షసుడికి ఆహారంగా పోతామని ఏడుస్తూ పోటీ పడటం కుంతీ దేవి వింటుంది.మహా బలవంతుడైన భీముడికి చెబుతుంది.ఆ ఇంటివారిని  ఒప్పించి భీముణ్ణి పంపిస్తుంది. భీమ, బకాసురుల మధ్య భీకరమైన యుద్ధం జరగడం. భీముడు బకాసురుని చంపి ఆ వూరి ప్రజలకు బకాసురుని పీడ వదిలించడం మనకు తెలిసిన కథే!.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే  పాండవులంతటి మహా పరాక్రమవంతులు కూడా  కాలం కలిసిరాక ఎక్కడెక్కడో తలదాచుకోవలసి వస్తుంది.ఐనంత మాత్రానా వారి శక్తి సామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలగలేదని.అనగా అద్దంలో ఏనుగులా  సామాన్యులుగా కనిపించినా  సమయం వచ్చినప్పుడు ఎవరేంటో తెలుస్తుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా మనం కూడా అపరిచిత ప్రదేశాలలో గౌరవం,ఆదరణ పొందలేక పోతే బాధ పడాల్సిన అవసరం లేదని,మనకున్న ప్రత్యేకత,ప్రతిభ సమయం సందర్భం వచ్చినప్పుడు వాటంతట అవే బయటపడతాయని ఈ "ఆదర్శ గజ న్యాయము" ద్వారా గ్రహించగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు