వాక్కు మహిమ- సి.హెచ్.ప్రతాప్

 మానవులకు అందానిచ్చేది వాక్కు. మాటలలో మృదుత్వం,నిజాయితీ చిత్తశుద్ధి తప్పక వుండాలి. వాగ్భూషణం భాషణం. కాలు జారిన తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోవడం అసాధ్యం. సంబంధ బాంధవ్యాలు విచ్చిన్నం అవుతాయి. మాటలు శృతి మించితే  యుద్ధం మొదలౌతుంది.  జీవితాలే నాశనం కాగలవు. మాటలు మమతలను పంచుతూ స్నేహ వారధులను నిర్మించేవిగా వుండాలి. మనసులను కరిగించాలి, జీవితాలలో వెన్నెల వెలుగులను నింపాలి. అద్భుత విజయాలను, అజరామరమైన కీర్తి పతిష్టలను అందించేది మంచి మాట మాత్రమే. అందుకే ,మాటే మంత్రము, మనసే బంధం అన్నాడొక కవి. మాట రెండువైపులా పదును వున్న కత్తి లాంటిది. ప్రాణాన్ని నిలపగలదు, ప్రాణాన్ని తీయగలదు కూడా. రెండు మనసులను కలపగలిగే,నిండు ప్రాణాలను నిలపగలిగే మంచి మాట స్వంతం చేసుకోవాలి.జీవితంలో వెనక్కి రానివి చేజార్చుకున్న అవకాశం, పెరిగే వయస్సు, గడిచిపోయిన కాలం మరితు నోటి నుండి వెలువడిన మాట అంతారు. అందుకే మాటకు అంత విలువ వుంది. నలుగురితో మంచివాడు అని అనిపించుకోవాలే తప్పా ఇతరులతో వాగ్వాదానికి వెళ్ళకూడదు . మనం సంభాషించే ప్రతిమాట ఎదుటివారికి ఆనందాన్ని ఇవ్వాలి.ఒక వ్యక్తియొక్క సంస్కారాన్ని అతను మాట్లాడే మాటలనుబట్టి అర్థంచేసుకోవచ్చు .
మనం మాట్లాడే మాటలు వినసొంపుగా ఉండాలి .మృధు మధురంగా ఉండాలి.వినే వ్యక్తికి మనం మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించాలి .ఎంత కోపంగా వున్న వ్యక్తి అయినా మన మాటలతో చల్లబడాలి. మనతో సుహృద్భావంతో మెలగాలి.  వారిని మన మాటలతో కించపర్చరాదు.ఎంత తక్కువ మాట్లాడితే,  అంత ఎక్కువ మనం విలువ పెరుగుతుందని గుర్తుంచుకోవాలి .అధిక ప్రసంగాలకు పోయి లేని పోనీ చిక్కుల్లో ఇరుక్కునే బదులు,  మాట్లాడకుండా మౌనం వహించడం ఎంతో మంచిది.
కామెంట్‌లు