అరోగ్యకరమైన ఆలోచనా ధోరణి-సి.హెచ్.ప్రతాప్

 మానవుల మానసిక శక్తిలో ఆలోచనా శక్తికి చాలా విలువైన స్థానం ఉంది. ఈ శక్తి మనిషిలో కొత్త చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది.అరోగ్యకరమైన ఆలోచనా ధోరణి జీవితం లో విజయం సాధించుటకు ఆనందమయమైన జీవనం సాగించుటకు అత్యావశ్యకం.  మంచి ఆలోచనలు ఉంటేనే జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆలోచనల సారంలోనే జీవన సారం ఉంది. మన మనసులోంచి వచ్చిన ఒక మంచి ఆలోచన జీవితాన్ని సరిదిద్దగలదు.  అనారోగ్యకర ఆలోచనా విధానం ప్రగతికి చేటు , అశేష శారీరక , మానసిక వ్యాధులకు పుట్టినిల్లు. మానవ జీవితమంతా అశాంతి మయం. నిత్యం చింతలు, సమస్యలు, ఆందోళనలు , హృదయం ఒక మండుతున్న లావా. కటువైన ప్రవర్తనతో మానవ సంభందాలన్నీ దూరం. కృషి, పట్టుదల, తపనలతో పాటు సానుకూల ఆలోచనా ధృక్పధం తో నిత్యం ప్రశాంతం గా అరోగ్యకరం గా వుండే మనసుతో ముందడుగు వేసిన నాడు అనితర సాధ్యమైన విజయాలన్నీ మనకు స్వంతం. జీవితం ఒక విరబూసిన నందనవనం అవుతుంది.ఆలోచన మానవుణ్ణి ఉన్నతంగా తయారు చేస్తుంది. ఆలోచనల వల్ల నిరాశతో నిండిన మనసులో ఆశ చిగురిస్తుంది.ఎప్పుడూ భయం, అనుమానంతో పీడితులయ్యేవారు ఆరోగ్యమైన జీవితంలోని ఆనందాన్ని ఎన్నటికీ పొందలేరు.  కొందరు వ్యక్తులు ఆరోగ్యంగానే ఉంటారు. కానీ మనసులో తమను తాము రోగులుగా భావించుకుంటూ ఉంటారు. అటువంటివారికి జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోవడం అసాధ్యం.గడియారంలో ముల్లు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగే మనిషి జీవితంలో ముందుకు పోతూనే ఉండాలి. లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని ఒక అమాయక జీవిగా, ఎన్నో అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా మిగిలిపోతారు.  అందుకనే వాస్తవ జీవితంలో మనిషి ఏదో ఒకరకంగా ఎదగాలి అంటే ఆలోచనాపరమైన మార్పులు తప్పనిసరి అనిపిస్తుంది.ఆలోచన అనేది మనస్సులో కల్గే ఒక సూక్ష్మస్పందన. మనస్సు ఏ వస్తువు/విషయం గురించి విచారిస్తే ఆ ఆకృతిని దాల్చుతుంది. ఆలోచించే విషయం మారితే మనస్సు కూడ మార్పు చెందుతుంటుంది. ప్రతీ ఆలోచనా మనోఫలకంమీద ఒకవిధమైన ముద్రను మిగుల్చుతుంది. దాన్నే సంస్కారము అని శాస్త్రం చెబుతోంది.

కామెంట్‌లు