కడుము చదువులమ్మ నీడలో....

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఆ పాఠశాలలో చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్ధులంతా సమావేశమయ్యారు. 1996 నుండి 2001 మధ్యకాలంలో ఈ పాఠశాలలో చదువు నేర్చుకున్న వారంతా సమావేశమై బాల్యం నాటి విషయాలన్నీ గుర్తుచేసుకున్నారు. 
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సరదాగా జరిగింది. 
ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ బాల్యదశ బలమైన దశయని అన్నారు. క్రమశిక్షణతో విద్యను సముపార్జించిననాడే ఆ ప్రమాణాలకు సార్ధకత ఏర్పడునని అన్నారు. కన్నతల్లి లాంటి పుట్టినూరును మరువకుండా, ఉన్నతవిద్యను నేర్పిన ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకున్న ఈ పూర్వవిద్యార్ధులందరూ మిక్కిలి ధన్యులని అన్నారు. ఎందరెందరికో ఈ విద్యావంతులు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. 
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము కడుము చదువులమ్మ చెట్టు నీడలో అంటూ ఆటా పాట అల్లర్లతో పూర్వ విద్యార్ధుల సంబరాలు మిన్నంటాయి. 
ఎవరి జీవిత పయనం ఎలా సాగిందో, ఎవరెవరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో ఒకరికొకరు ముచ్చటించుకొని తమ ఆశయాలను పంచుకుంటూ ఆనందభాష్పాలతో ఉద్వేగానికి లోనయ్యారు. 
అధ్యక్షత వహించిన ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావును, 
ఈ 1996-2001 పూర్వ విద్యార్ధులకు పాఠాలు నేర్పించిన ఆనాటి ఉపాధ్యాయులు వై.ఎస్.ప్రకాశం, బి.చంద్రమోహన్, బి.దుర్గాప్రసాద్, టి.రాజు, రఘురాం మహంతి, సూర్యారావు తదితరులను ఘనంగా సన్మానించారు. ఆయా ఉపాధ్యాయుల బోధనలో గల సామర్ధ్యాలే తమను ఇంతటివారిగా తీర్చిదిద్దాయని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సర్పంచ్ గుజ్జ రామారావు, ఎంపిటిసి వలురోతు గోవిందరావు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్మన్ భూపతి లక్ష్మి, మాజీ సర్పంచ్ వలురోతు ధర్మారావు, ఆనాటి ఉపాధ్యాయులు ప్రకాశం, చంద్రమోహన్, దుర్గాప్రసాద్, రాజు, రఘురాం మహంతి, సూర్యారావు, మరియు రబికుమార్ మహాపాత్రో, ఎస్.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు