సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -390
అహినిర్లయినీ న్యాయము
******
అహి అనగా పాము, సూర్యుడు, రాహువు, మోసగాడు, మేఘము అనే అర్థాలు ఉన్నాయి. నిర్లయి అనగా నశించు,సక్తమగు,దాగినది, పోయినది అనే అర్థాలు ఉన్నాయి.
పాము కుబుసము విడిచినట్లు అన్నమాట.
పాము కుబుసము విడిపోక ముందు తనకు అంటియున్న కుబుసాన్ని  తన దేహమే అనుకుంటూ వుంటుంది.అది నిజం కూడా! ఇక కుబుసము తన నుండి విడిపోయిన తరువాత ఆ కుబుసము తానే విడిచాననీ,అది తనదే అనే జ్ఞానము  పాముకు అస్సలు వుండదు.
అనగా జ్ఞానోదయమైనప్పుడు అజ్ఞానావరణముతో బాటు దేహాభిమానము కూడా నశిస్తుందన్న  మాట.అలా అంతకు ముందు గల నాది, నా దేహమనే భ్రాంతి తొలగిపోతుందనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
పనిలో పనిగా పాము తన కుబుసం ఎలా విడుస్తుందో అది ఎందుకు విడుస్తుందో, దానికి సంబంధించిన కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
మనము ఎక్కువగా గమనించేది త్రాచుపాము కుబుసాన్నే.ఆ కుబుసం చూడటానికి అచ్చం పాము లాగే కనిపిస్తుంది.
 అయితే ఒక్క త్రాచుపాము మాత్రమే కాదు.మరి కొన్ని రకాల పాములు కూడా తమ కుబుసాన్ని విడుస్తాయట. మరి ఎందుకు విడుస్తాయో? కారణమేమిటో తెలుసుకుందాం.
కేవలం పాములే కాదు.మనుషులమైన మనం కూడా కుబుసం లాంటి చర్మాన్ని విడుస్తామట.అయితే ఇది నిరంతరం జరుగుతుంది కాబట్టి  ప్రత్యేకంగా దానిని గుర్తించలేమట.
 ఇక పాముల విషయానికి వస్తే వాటి మొత్తం చర్మం ఓకే సారి కుబుసం రూపంలో బయటికి వస్తుంది. దాని పై చర్మం క్రింద కొత్త చర్మం క్రమ క్రమంగా పెరుగుతూ ఉంటుంది.అలా పెరగడం పూర్తి కాగానే  అవసరం లేని పై చర్మాన్ని విసర్జించే ప్రయత్నం చేస్తుంది.అలా చేయడాన్నే కుబుసం విడవడం అంటారు.
మరి తన శరీరం మీదనుండి ఎలా తొలగించుకుంటుందో తెలుసుకుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది.  కుబుసం విడిచే ముందు నోటి దగ్గర పాత చర్మానికి ఓ చీలికను ఏర్పరచుకుంటుంది.ఆ చీలిక కోసం పాము తన తలను గరకు ప్రదేశంలో కానీ,రాయి మీద కానీ బాగా రుద్దుకుంటుంది. అలా రుద్దుకునే క్రమంలో నోటి దగ్గర ఓ చీలిక ఏర్పడుతుంది.అలా ఆ చీలిక నుండి పాత చర్మాన్ని వదిలివేస్తుంది.
 
ఇదే విధంగా మానవులైన మనం  కుబుసం వంటి  ప్రాపంచిక సుఖాలను వీడాలి.అప్పుడే అజ్ఞానము వీడిపోయి జ్ఞానోదయం అవుతుంది.తద్వారా దేహాభిమానము నశిస్తుంది.అంతే కాదు నాది, నా దేహమనే స్వార్థపూరితమైన భ్రాంతి కూడా తొలగిపోతుంది.
 ఇదండీ! "అహినిర్లయినీ న్యాయము"లోని అంతరార్థం.అనవసరమైన భ్రమలు,మోహ పాశాలను తొలగించుకుందాం. నిస్వార్థ నిరామయ జీవితాన్ని గడుపుదాం .
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు